Published : 08/11/2021 19:48 IST

'జాంపండు'లా మెరిసిపోవాలంటే..!

ఎవరైనా కాస్త అందంగా కనిపిస్తే 'జాంపండులా మెరిసిపోతున్నావు' అంటూ ఉండడం మనం వింటూనే ఉంటాం. చక్కటి ఆరోగ్యానికి జామ పండు బాగా ఉపయోగపడుతుందన్న సంగతి మనకు తెలిసిందే. అయితే అందంలోనూ జామ ప్రాధాన్యం ఎక్కువేనన్న సంగతి మీకు తెలుసా? 

జామ పండుతో తయారుచేసుకోదగిన వివిధ ఫేస్‌ప్యాక్‌లతో చర్మ సమస్యలన్నింటినీ దూరం చేసుకొని మెరిసే జాంపండు లాంటి చర్మాన్ని మన సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా.. మనం తినగా మిగిలిన జామ పండ్లను సౌందర్య పరిరక్షణకు ఉపయోగించడమే.. మరి, అదెలా అంటారా..? జామ పండుతో తయారుచేసుకోదగిన ఫేస్‌ప్యాక్స్ గురించి తెలుసుకుందాం రండి..

పాలుగారే అందం కోసం..

జామపండును పాలతో కలిపి ఫేస్‌ప్యాక్‌గా ఉపయోగిస్తే చర్మం పాలుగారే అందాన్ని సొంతం చేసుకుంటుంది. ఇందుకోసం ఒక జామ పండును తీసుకొని గింజలు తొలగించి పెట్టుకోవాలి. దీంతో పాటు మరో రెండు జామ ఆకులను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో రెండు టీస్పూన్ల పాలు కూడా చేర్చి మిక్సీ పట్టుకోవచ్చు. ఆఖరున తయారైన పేస్ట్‌లో అర టీస్పూన్ పాల పొడి వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా అప్త్లె చేసుకోవాలి. ఓ పావుగంట పాటు అలాగే ఉంచుకొని కడిగేస్తే సరి. ఈ ప్యాక్‌ని తరచూ వేసుకోవడం వల్ల చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

స్క్రబ్‌లా కూడా..

జామ పండును ఫేస్‌ప్యాక్‌లోనే కాదు.. స్క్రబ్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక జామ పండు, రెండు జామ ఆకులను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఓట్‌మీల్ కూడా వేసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్త్లె చేసుకొని సున్నితంగా రుద్దుకోవాలి. గుండ్రంగా రుద్దుతూ ఉండడం వల్ల మృతకణాలన్నీ తొలగిపోతాయి. ఇలా పది నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. ఈ స్క్రబ్‌ని ఉపయోగించడం వల్ల మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గి నవయవ్వనంగా కనిపించే వీలుంటుంది.

మృదువైన చర్మానికి..

మృదువైన చర్మం సొంతం చేసుకోవడానికి కూడా జామ పండు ఫేస్‌ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. దీనికోసం అరకప్పు క్యారట్ ముక్కలు, ఒక జామ పండు తీసుకొని రెండూ కలిపి మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కూడా చేర్చుకోవచ్చు. ఈ పేస్ట్‌ని ముఖానికి అప్త్లె చేసుకొని పావుగంట పాటు ఉంచుకొని కడిగేస్తే సరి.. మృదువైన చర్మం సొంతమవడమే కాదు.. మచ్చలు కూడా తగ్గుతాయి.

లోషన్‌గానూ..

జామపండుతో కేవలం ఫేస్‌ప్యాక్స్, స్క్రబ్‌లు మాత్రమే కాదు.. బాడీ లోషన్ కూడా తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం ఒక రెండు జామ పండ్లని పొట్టు, గింజలు తొలగించి రసం మాదిరిగా మిక్సీ పట్టుకొని ఉంచాలి. మరోవైపు కొద్దిగా బీస్‌వ్యాక్స్ తీసుకొని మైక్రోవేవ్ సాయంతో వేడి చేసి పెట్టుకోవాలి. ఈ వ్యాక్స్‌లో అరకప్పు ఆలివ్ ఆయిల్‌ని వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఇందాక మిక్సీ పట్టుకున్న జామకాయ రసాన్ని వేసి బాగా కలిపి మరోసారి వేడి చేసుకుంటే సరి.. లోషన్ సిద్ధమవుతుంది. ఇలా తయారైన లోషన్‌ని ఒక గాలిచొరబడని డబ్బాలో పోసి చల్లార్చి ఉపయోగించవచ్చు. ఇది రెండు నెలల వరకూ పాడవకుండా ఉంటుంది.

మెరిసే ముఖం కోసం..

కొంతమందికి చలికాలంలో చర్మం నల్లబడుతూ ఉంటుంది. నల్లబడకపోయినా ఈ కాలంలో చాలామంది చర్మం డల్‌గా మారడం గమనిస్తుంటాం. దీన్ని తొలగించుకోవడానికి కూడా జామ పండు ప్యాక్స్ ఉపయోగపడతాయి. ఇందుకోసం అరటి పండు, జామ పండ్లను సమాన పాళ్లలో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు, టీస్పూన్ తేనె వేసి బాగా కలిపి ముఖానికి అప్త్లె చేసుకోవాలి. అరగంటయ్యాక ముఖం కడుక్కుంటే సరి.. ఇలా తరచూ చేస్తుంటే ముఖం తాజాగా, మెరిసిపోతూ కనిపిస్తుంది.

ముడతలు తొలగించేలా..

ముడతలు తొలగించేందుకు కూడా జామ పండును ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక జామ పండు, రెండు జామ ఆకులు తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్‌లో ఒక గుడ్డు లేదా అందులోని తెల్ల సొనను తీసుకొని బాగా బీట్ చేయాలి. ఇలా బీట్ చేసిన తర్వాత వాసన రాకుండా అందులో ఏదైనా ఒక ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో జామకాయ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి అప్త్లె చేసుకొని పావుగంట పాటు ఉంచుకుంటే సరి.. ఆ తర్వాత నీళ్లలో తడిపిన గుడ్డను రెండు నిమిషాల పాటు ముఖంపై వేసి ప్యాక్ కాస్త మెత్తబడ్డాక నీటితో కడిగేసుకోవాలి. దీంతో చర్మంపై ఉన్న ముడతలు తొలగిపోవడమే కాదు.. నవయవ్వనమైన కాంతిని తిరిగి పొందే వీలుంటుంది.
చూశారుగా.. జామకాయను చర్మ పరిరక్షణకు ఎలా ఉపయోగించవచ్చో.. అసలే ఇది జామ పండ్ల సీజన్ కూడానూ..! మరి, మీరూ ఈ ప్యాక్స్‌ని ఓసారి ప్రయత్నించేయండి..


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని