Summer Tips: అనాసతో అందంగా.. ఆరోగ్యంగా..!
కొంతమంది అనాస పండుని తొక్క తీసేసి నేరుగా తినడానికి ఇష్టపడితే మరికొందరు జ్యూస్ తాగడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ప్రత్యేకించి వేసవిలో దీనివల్ల అటు ఆరోగ్యపరంగానే కాకుండా ఇటు సౌందర్యపరంగా కూడా....
కొంతమంది అనాస పండుని తొక్క తీసేసి నేరుగా తినడానికి ఇష్టపడితే మరికొందరు జ్యూస్ తాగడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ప్రత్యేకించి వేసవిలో దీనివల్ల అటు ఆరోగ్యపరంగానే కాకుండా ఇటు సౌందర్యపరంగా కూడా అనేక ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.
చర్మం మెరిసేలా..
అనాసలో ఉండే విటమిన్ సి మరియు అమైనో యాసిడ్స్ చర్మంలో కొలాజెన్ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేసి తద్వారా చర్మం బిగుతుగా, పటుత్వం కోల్పోకుండా చేస్తాయి. అలాగే చర్మంపై పేరుకొనే మృతకణాలను తొలగించి కాంతివంతంగా మారుస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల మొటిమలు తగ్గుముఖం పట్టడమే కాకుండా వాటి వల్ల ఏర్పడిన మచ్చలు కూడా క్రమంగా చర్మఛాయలో కలిసిపోతాయి. ఫలితంగా ప్రకాశవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
దీని కోసం తొక్క చెక్కిన పైనాపిల్ ముక్క ఒకటి తీసుకుని నేరుగా చర్మంపై రుద్దుకోవాలి. కాసేపు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
జుట్టు రాలకుండా..
ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ బాధపెడుతున్న సమస్య- జుట్టు రాలడం. అనాసలో పుష్కలంగా ఉండే విటమిన్ సి జుట్టు రాలడం నివారించడంలో సమర్థంగా పని చేస్తుంది. అయితే ఈ ప్రయోజనాన్ని పొందాలంటే ప్యాక్స్, జ్యూస్‌ల రూపంలో కాకుండా పైనాపిల్‌ని రోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. అప్పుడే సత్ఫలితాలను ఆశించే అవకాశం ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా..
అనాసలో విటమిన్ సితో పాటు పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడమే కాదు.. చర్మం నవయవ్వనంతో నిగనిగలాడేలా కూడా చేస్తాయి.
అదనపు ప్రయోజనాలు..
⚛ అనాస గుజ్జులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి పెదాలకు రాసుకుంటే అధరాల్లో తేమ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. ఫలితంగా పెదవులు పొడిబారకుండా ఉంటాయి.
⚛ పాదాలపై ఉండే పగుళ్లు తగ్గడానికి కూడా పైనాపిల్ బాగా సహాయపడుతుంది.
⚛ అనాసలో ఉండే మాంగనీస్ శరీరంలో ఎముకల ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఫలితంగా ఎముకలు బలంగా తయారవడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇది చక్కని ఫలితాలనిస్తుంది. ఎముకల సంబంధిత సమస్యలేవీ దరి చేరకుండా సంరక్షిస్తుంది.
⚛ పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల నెలసరికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా పిరియడ్స్ సమయంలో బాగా నొప్పితో సతమతమయ్యేవారు పైనాపిల్ జ్యూస్ తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.