అందానికీ కావాలి.. ఈ గింజలు..!

చర్మాన్ని లోలోపలి నుంచి మెరిపించే సహజసిద్ధమైన పదార్థాల్లో సబ్జా గింజలు ఒకటి. కాస్త తడి తగిలితే చాలు ఉబ్బిపోయే వీటిని ఆహారంగా తీసుకుంటే జీవక్రియలన్నీ సజావుగా సాగుతాయి. ఈ గింజలను తీసుకోవడం ద్వారా.....

Published : 08 May 2023 20:37 IST

చర్మాన్ని లోలోపలి నుంచి మెరిపించే సహజసిద్ధమైన పదార్థాల్లో సబ్జా గింజలు ఒకటి. కాస్త తడి తగిలితే చాలు ఉబ్బిపోయే వీటిని ఆహారంగా తీసుకుంటే జీవక్రియలన్నీ సజావుగా సాగుతాయి. ఈ గింజలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యపరంగానే కాదు.. సౌందర్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలు పొందచ్చంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

డీటాక్సిఫికేషన్..

వాహనాల నుంచి వెలువడే పొగ, కాలుష్యం కారణంగా.. చర్మం కాంతిని కోల్పోతుంది. దుమ్ము, ధూళి ప్రభావం వల్ల చర్మంపై మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువ. అయితే కాలుష్యం ప్రభావాన్ని తగ్గించడానికి చర్మాన్ని లోలోపలి నుంచి శుభ్రం చేయాలంటే సబ్జా గింజలు అందుకు సరైన ఎంపిక అంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే సహజ డీటాక్స్ గుణాలు చర్మం లోపలి పొరల్లో చేరిన టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. దీనివల్ల సౌందర్య సమస్యలు తగ్గి చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

ఇన్ఫెక్షన్లు రాకుండా..

కొంతమందిలో చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చాయంటే ఓ పట్టాన తగ్గవు. అలాంటివారు క్రమం తప్పకుండా సబ్జా గింజలను ఆహారంగా తీసుకోవడం మంచిది. వీటిలో ఉన్న యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ బయోటిక్ గుణాలు చర్మానికి ఇన్ఫెక్షన్లు కలిగించే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిములను నశింపచేస్తాయి. దీనివల్ల చర్మం ఇన్ఫెక్షన్లకు గురవ్వకుండా ఉంటుంది.

కాంతివంతంగా..

సబ్జా గింజల్లో చర్మానికి మేలు చేసే విటమిన్ 'ఇ' పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మానికి అవసరమైన పోషణనిచ్చి, కాంతివంతంగా మారేలా చేస్తుంది. అలాగే ఈ గింజల్లో విటమిన్ 'ఎ', విటమిన్ 'సి', పొటాషియం, మెగ్నీషియం, కాపర్.. లాంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ చర్మ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసేవే. దీంతో చర్మానికి తగినంత పోషణ అంది ఆరోగ్యంగా, మృదువుగా మారుతుంది.

ముడతలు పడకుండా..

ఇరవైల నుంచి ముప్ఫైల్లోకి రాగానే మహిళలంతా ఎదుర్కొనే సమస్య చర్మం ముడతలు పడడం. దీనివల్ల తక్కువ వయసులోనే ఉన్నా.. పెద్దవారిలా కనిపిస్తారు. అయితే ఇలా కనిపించకుండా ఉండటం కోసం చాలామంది యాంటీఏజింగ్ క్రీంలను రాస్తూ ఉంటారు. అయితే ఈ సమస్యకు సబ్జా గింజలు మేలైన పరిష్కారం చూపుతాయంటున్నారు నిపుణులు. వీటితో తయారుచేసిన ఫేస్‌ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. చెంచా కొబ్బరి నూనెలో సరిపడినంత సబ్జా గింజల పొడిని కలపాలి. దీన్ని ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది.

కురులు దృఢంగా..

సబ్జా గింజలు చర్మానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా మేలు చేస్తాయి. దీనిలో విటమిన్ 'కె', బీటాకెరోటిన్, ప్రొటీన్లు అధికంగా లభిస్తాయి. ఇవి వెంట్రుకలు, కుదుళ్లు దృఢంగా మారేలా చేస్తాయి. అలాగే ఇవి కురులకు పోషణను అందించి పట్టులా, మృదువుగా మారేలా చేస్తాయి. సబ్జా గింజలను రోజూ ఆహారంలో భాగంగా చేసుకున్నట్త్లెతే జుట్టు రాలే సమస్య నుంచి కూడా విముక్తి పొందచ్చంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్