Published : 24/01/2023 20:31 IST

అందానికి.. ఆరోగ్యానికి.. తులసి!

తులసి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం వింటూనే ఉంటాం.. అటు అందానికి, ఇటు ఆరోగ్యానికి ఈ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ క్రమంలో ప్రత్యేకించి జుట్టు, దంత సంరక్షణకు వీటిని ఎలా వాడాలో చూద్దాం..

దంత సంరక్షణకు..

ఎండిన తులసి ఆకులను పొడి చేసి గాలి చొరబడని డబ్బాలో పెట్టుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ పొడిని నీళ్లతో కలిపి పళ్లపై పది నిమిషాలు రుద్దాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం దంత సంరక్షణకు సహకరిస్తుంది.

కేశాల ఆరోగ్యానికి..

తులసి చర్మం, దంతాలకే కాదు.. కేశ సౌందర్యానికి, ఆరోగ్యానికి కూడా ఉపయోగకరమే. తలలో చుండ్రు, దురద, చిన్న చిన్న కురుపులు రావడం వంటి సమస్యలతో కొంతమంది బాధపడుతుంటారు. ఇటువంటి వారికి తులసి నూనె చక్కటి పరిష్కార మార్గం. దీనికోసం తులసి ఆకులను పొడి చేసి (సుమారు పది స్పూన్ల పొడి), ఆ పొడిని ఒక డబ్బా కొబ్బరి నూనెతో కలిపి వేడి చేయాలి. నూనె వేడెక్కడం మొదలయ్యాక అందులో కొన్ని మెంతులు వేయాలి. మెంతులు నూనెలో ఉడికిన తరువాత స్టవ్ ఆపేసి నూనెను చల్లార్చాలి. పొడిగా ఉన్న సీసాలో ఈ నూనెను భద్రపరచుకొని వారానికి రెండుసార్లు దీంతో మర్దనా చేసుకొని గంట తరువాత తలస్నానం చేస్తే సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. మెంతులు, తులసి కలిసి ఉండడం వల్ల శిరోజాలు ఆరోగ్యవంతంగా కూడా తయారవుతాయి.

వీటికి సైతం..

రోజూ కొన్ని తులసి ఆకులను నమలడం వల్ల జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

తులసి ఆకులు, గుడ్డు తెల్లసొన కలిపి పేస్ట్‌లా తయారుచేసి 20 నిమిషాలు ముఖానికి పట్టించి కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే చర్మం బిగుతుగా మారి ముఖం కాంతిని సంతరించుకుంటుంది.

తులసి రసాన్ని తాగడం వల్ల చర్మానికి, శిరోజాలకు, పళ్లకు చాలా మంచిది. అలాగే శరీరంలో వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని