Published : 25/06/2022 18:39 IST

తులసితో తళతళలాడే అందం!

అది అకేషన్‌ అయినా, కాకపోయినా.. అందం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు ఈతరం అమ్మాయిలు. అయితే ఇందుకోసం రసాయనాలు కలగలిసిన సౌందర్య ఉత్పత్తుల్ని వాడడం కంటే.. సహజసిద్ధమైన పదార్థాలే సమర్థంగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇంట్లో పెరిగే తులసి మొక్కతో అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చంటున్నారు. అదెలాగో తెలుసుకుందాం రండి..

మొటిమలకు ఔషధం..

తాజా తులసి ఆకులను తినడం వల్ల రక్తం శుద్ధి అయి మొటిమలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఈ ఆకుల్ని మెత్తగా చేసుకొని మొటిమలపై రాసినా ఫలితం ఉంటుంది. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి.. చల్లారాక ఆ నీటిని టోనర్‌గా వాడుకోవచ్చు. దీనివల్ల మొటిమలు తగ్గడమే కాదు.. ముఖ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. తులసి పొడిని రోజ్‌వాటర్‌తో కలిపి ముఖానికి పట్టిస్తే చర్మరంధ్రాలు తెరుచుకొని మొటిమలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా తులసి ఆకుల రసానికి పుదీనా ఆకుల రసం కలిపి ముఖానికి పట్టిస్తే మొటిమల నుంచి ఉపశమనం కలుగుతుంది.

నల్లమచ్చలకు నివారణ..

ముఖంపై ఏర్పడిన నల్ల మచ్చల్ని నివారించడంలో తులసి బాగా పనిచేస్తుంది. తులసి ఆకుల రసానికి అంతే మోతాదులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. అరగంటయ్యాక చల్లని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా రోజుకు ఒకసారి చేయడం వల్ల ముఖంపై ఉన్న నల్లమచ్చలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతంగా మారుతుంది.

దంతాల మెరుపుకు..

దంతాలపై పాచి తొలగి తిరిగి తళతళా మెరిసిపోవాలంటే.. అందుకు తులసి ఆకుల పొడి చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు సౌందర్య నిపుణులు. ఈ క్రమంలో ఎండిన తులసి ఆకులను పొడి చేసి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ పొడిని నీళ్లతో కలిపి పళ్లపై పది నిమిషాలు రుద్దాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

తులసి నూనెతో..

తులసి చర్మానికే కాదు.. శిరోజాల సంరక్షణకూ అవసరం. కొంతమంది కుదుళ్లలో చెమట, చుండ్రు, దురద, చిన్న చిన్న కురుపులు రావడం.. వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇటువంటి వారికి తులసి నూనె చక్కటి పరిష్కార మార్గం. దీనికోసం చేయాల్సిందల్లా తులసి ఆకులను పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి నూనెలో తులసి పొడి, మెంతులు వేసి వేడి చేయాలి. ఇది చల్లారాక పొడిగా ఉన్న సీసాలో భద్రపరచుకొని.. వారానికి రెండుసార్లు ఈ నూనెతో కుదుళ్లను మర్దన చేసుకోవాలి. గంట తరువాత తలస్నానం చేస్తే సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. ఈ చిట్కా కేశ సంపదను సైతం పెంచుతుంది.

ఇవి కూడా!

* రోజూ 2, 3 తులసి ఆకులను నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. పొడి చర్మం, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

* తులసి ఆకులు, గుడ్డు తెల్లసొన కలిపి పేస్ట్‌లా తయారుచేసి.. ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే చర్మం బిగుతుగా మారుతుంది. ముఖం కాంతిని సంతరించుకుంటుంది.

* తులసి రసాన్ని తాగడం వల్ల చర్మానికి, శిరోజాలకు, దంతాలకు చాలా మంచిది. అలాగే శరీరంలో వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని