‘టీ’తో సౌందర్యం..
close
Published : 30/01/2022 08:46 IST

‘టీ’తో సౌందర్యం..!

కొంతమంది తమ రోజును బ్లాక్‌ లేదా గ్రీన్‌టీతో ప్రారంభిస్తారు. కానీ అదే టీని మన సౌందర్య సంరక్షణ కోసం ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసా..!

* చర్మం పొడిబారినప్పుడు నిర్జీవంగా కనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు చల్లని గ్రీన్‌టీతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మురికి తొలగిపోయి, చర్మం పొడిబారే సమస్య కూడా తగ్గుతుంది. దీంతో చర్మం తాజాగా కనిపిస్తుంది.

* వాడేసిన టీ-బ్యాగులను కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి వాటిని కాసేపు కళ్లపై పెట్టుకొని చూడండి. ఇలా చేయడం వల్ల కళ్ల వాపు తగ్గుతుంది. నల్లటి వలయాల సమస్య కూడా దూరం అవుతుంది.

* తలస్నానం చేసే ముందు బ్లాక్ టీని తలంతా రాసుకోవాలి. పది, పదిహేను నిమిషాల తరువాత షాంపూతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే జుట్టు చిట్లడం తగ్గుతుంది. అలాగే జుట్టు బాగా పెరుగుతుంది.

* వ్యాక్సింగ్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు చర్మం ఎర్రగా కందిపోయి దురదగా అనిపించొచ్చు. సమస్య ఉన్నచోట చల్లని టీ-బ్యాగుల్ని కాసేపు ఉంచడం వల్ల ఉపశమనంగా అనిపిస్తుంది.

* కొందరిలో పాదాలకు ఎక్కువ చెమట పట్టడం వల్ల వాటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇలాంటివారు పెద్ద గిన్నెడు నీళ్లలో రెండు కప్పుల గ్రీన్‌టీ డికాక్షన్‌ వేసి బాగా వేడి చేయాలి. ఆ నీటిని టబ్బులో వేసి పాదాల్ని కాసేపు అందులో ఉంచాలి. ఇలా చేయడం వల్ల చెమట సమస్యతో పాటు పాదాల పగుళ్లు కూడా తగ్గుతాయి.


Advertisement

మరిన్ని