Updated : 22/10/2021 18:32 IST

Beauty Pageant: పెళ్లి కాకూడదు.. పిల్లలుండకూడదు.. ఇవేం నిబంధనలు?

(Image for Representation)

బాహ్య సౌందర్యాన్ని మించిన అంతః సౌందర్యానికి పట్టం కట్టేవే అందాల పోటీలు. ఈ విషయం తెలిసినా ఇప్పటికీ అందాల పోటీల్ని నిర్వహించే కొన్ని కంపెనీలు.. చర్మ ఛాయ తెల్లగా ఉండాలి, నాజూగ్గా ఉండాలి, ఇంత ఎత్తు-బరువు ఉండాలి, పెళ్లి కాకూడదు/పిల్లలుండకూడదు.. ఇలా అందానికి పలు ప్రమాణాలు నిర్ణయిస్తున్నాయి. మితిమీరిన వివక్షతో ఎంతోమంది పోటీదారుల కలల సౌధాన్ని కూల్చుతున్నాయి. తాజాగా మిస్‌ ఫ్రాన్స్‌ అందాల పోటీల నిర్వాహకులు చేసింది కూడా ఇదే! లేనిపోని ప్రమాణాలు/కొలతలు విధించి పోటీదారుల కలల్ని కూలదోయడమే కాదు.. అక్కడి స్త్రీవాదుల ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఇలాంటి అర్థం పర్థం లేని ఆంక్షల్ని ఎత్తివేయాలని వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో అందాల పోటీల విషయంలో ఆడవారిపై కొనసాగుతోన్న వివక్ష మరోసారి తెరమీదకొచ్చింది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఇలాంటి కొన్ని ఘటనల్ని గుర్తు చేసుకుందాం..!

పెళ్లి కాకూడదు/పిల్లలుండకూడదు!

మిస్‌ ఫ్రాన్స్‌ పోటీలు.. ఈ ఏడాది డిసెంబర్‌ 19న జరగనున్న ఈ పోటీల కోసం ప్రస్తుతం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఈవెంట్‌ని నిర్వహించే Endemol Production కంపెనీ. ఈ క్రమంలోనే దరఖాస్తులో కొన్ని కచ్చితమైన ప్రమాణాలను నిర్దేశించారు. అవేంటంటే..!

* పోటీదారులు కనీసం 5’5’’ ఎత్తుండాలి.

* పెళ్లి కాకూడదు/పిల్లలుండకూడదు.

* హెయిర్‌ ఎక్స్‌టెన్షన్స్‌ వాడకూడదు.

* శరీరంపై ట్యాటూలు ఉండకూడదు.

* ధూమపానం చేయని వారు మాత్రమే ఈ పోటీలకు అర్హులు.

* అల్లికల దుస్తులు (Wearing Weaves) ధరించాలి. అలాగే వేసుకునే దుస్తుల సైజ్‌ కూడా ముఖ్యమే.

* పోటీకి ఎంపికయ్యాక ఒకవేళ శారీరక మార్పులేవైనా చోటు చేసుకుంటే 5 వేల యూరోలు (సుమారు రూ. 4.35 లక్షలు) జరిమానా కట్టాల్సి ఉంటుంది.

ఇలా ఈ నిబంధనలన్నీ దరఖాస్తు ఫారంలో పొందుపరిచింది సదరు సంస్థ.

అది చట్టవిరుద్ధం!

అయితే ఇలాంటి అర్థం పర్థం లేని ప్రమాణాలు, నిబంధనలపై అక్కడి స్త్రీవాదులు, కొంతమంది పోటీదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ఫ్రెంచ్‌ ఉపాధి చట్టం ప్రకారం.. పోటీదారులు తమకు నచ్చిన ఉద్యోగం చేయచ్చు.. ఈ క్రమంలో లింగ వివక్ష, లైంగిక పరమైన అంశాలు, కుటుంబ పరిస్థితులు/జన్యుపరమైన లక్షణాలు.. ఇలా వారిపై ఎలాంటి వివక్ష అయినా అది చట్టవిరుద్ధం. ఈ నేపథ్యంలోనే అందాల పోటీ నిర్వాహకులు పెట్టిన నిబంధనల్ని ఎత్తివేయాలని వారు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఈ ఈవెంట్‌ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందాల పోటీల్లో పాల్గొనే అమ్మాయిలపై కొనసాగుతోన్న వివక్షను మరోసారి తెరమీదకు తెచ్చింది.

 

మిసెస్‌ కాదని తెలిసి..!

అందాల పోటీలకు దరఖాస్తు చేసుకునే క్రమంలోనే కాదు.. కిరీటం వరించాక కూడా కొన్ని నిబంధనలు మహిళలపై ఈ సమాజానికి ఉన్న వివక్షను కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ‘మిసెస్‌ శ్రీలంక’ పోటీల్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఈ పోటీల్లో పుష్పక డిసిల్వాను విజేతగా ప్రకటించారు న్యాయనిర్ణేతలు. దీంతో గతేడాది విజేత అయిన కరోలిన్‌ జ్యూరీ ఆమెకు కిరీటాన్ని అలంకరించింది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి కరోలిన్‌ గబగబా స్టేజి మీదకు వచ్చి.. మైక్రోఫోన్‌ పట్టుకొని.. ‘కిరీటానికి పెళ్లైన వాళ్లే అర్హులు.. విడాకులు తీసుకున్న వాళ్లు కాదు!’ అన్న నిబంధన పోటీల్లో ఉందని, ఈ నేపథ్యంలోనే తొలి రన్నరప్‌కు కిరీటం దక్కుతుందని ప్రకటించింది. అంతేకాదు.. ఆ వెంటనే పుష్పక తలపై నుంచి కిరీటం తొలగించి.. ఫస్ట్‌ రన్నరప్‌ ఛౌలా పద్మేంద్ర తలపై అలంకరించింది. దీంతో తీవ్ర అవమానానికి గురైన పుష్పక కన్నీళ్లు పెట్టుకుంది. అక్కడితో ఆగకుండా తనను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించింది. నిజానికి పుష్పక పలు వ్యక్తిగత కారణాల రీత్యా తన భర్తతో కలిసి ఉండట్లేదు.. అంతేకానీ వాళ్లిద్దరూ విడాకులు తీసుకోలేదు. ఇదే విషయం తెలుసుకున్న పోటీ నిర్వాహకులు ఆమెకు క్షమాపణలు చెప్పడం, కిరీటాన్ని తిరిగి అందించడంతో వివాదం సద్దుమణిగింది.

 

తెలుపే అందమా?

మెరిసేదంతా బంగారం కాదన్నట్లు.. చర్మ ఛాయ తెల్లగా ఉన్న వాళ్లే అందగత్తెలా? అంటే.. కాదన్న సమాధానమే వస్తుంది చాలామంది దగ్గర్నుంచి! అందాల పోటీల్లో బాహ్య సౌందర్యానికే కాదు.. అంతః సౌందర్యానికీ పెద్ద పీట వేస్తుంటారు నిర్వాహకులు. అయితే 2019 మిస్‌ ఇండియా పోటీల ఫైనలిస్టుల ఫొటోలు పత్రికలో ప్రచురించడం అప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఈ అమ్మాయిలు ఫెయిర్‌గా ఉండడం, జుట్టు పొడవుగా, చూడ్డానికి ఒకేలా, అందరూ ఒకే ఎత్తులో కనిపించడంతో.. కేవలం తెల్లగా, చూడ్డానికి అందంగా ఉన్న వాళ్లను మాత్రమే తుది పోటీలకు ఎంపిక చేశారన్న అభిప్రాయాలు వెల్లువెత్తాయి. ఇక మరికొంతమందేమో.. వీళ్లంతా గతేడాది పోటీదారుల్లాగే ఉన్నారంటూ తమ స్పందనను తెలియజేశారు. ఇలా ఆ ఏడాది అందాల పోటీల్లో సౌందర్య ప్రమాణాలు, చర్మ ఛాయ గురించిన వివక్ష మరోసారి చర్చనీయాంశమైంది.

 

తల్లి అని తెలిసి కిరీటం తీసేసుకున్నారు !

ఉక్రెయిన్‌కు చెందిన 24 ఏళ్ల వెరోనికా డిడుసెంకోకు చిన్నతనం నుంచి మోడల్‌గా రాణించాలని కోరిక. ఈ క్రమంలోనే 2018లో మిస్‌ ఉక్రెయిన్‌ అందాల కిరీటం గెలిచి ప్రపంచ పోటీలకు అర్హత సాధించింది. ఇక ప్రపంచం తన ముందే ఉంది అనుకుంది. అయితే ఇంతలోనే ఓ వార్త ఆమెను విస్తుపోయేలా చేసింది. మిస్‌ ఉక్రెయిన్‌ కిరీటాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు మిస్‌ వరల్డ్‌ అందాల పోటీ నిర్వాహకులు ఆమెకు తెలిపారు. అందుకు కారణం ఆమె ఐదేళ్ల కుమారుడికి తల్లి కావడమే! నియమ నిబంధనల ప్రకారం ఒక తల్లిగా అందాల పోటీలో పాల్గొనడానికి ఆమె అనర్హురాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోటీ నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు మిస్‌ వరల్డ్‌ పోటీలో కూడా ఆమె పాల్గొనరాదని తెలిపారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన ఆమె.. కోర్టును ఆశ్రయించింది. ఇలాంటి అర్థం పర్థం లేని నిబంధనను మార్చాలని డిమాండ్‌ చేసింది. #righttobeamother హ్యాష్‌ట్యాగ్‌ వేదికగా సోషల్‌ మీడియాలోనూ ఉద్యమించింది. అయితే తన పోరాటం ముఖ్యోద్దేశం తన కిరీటాన్ని తిరిగి తీసుకోవడం కాదని, మహిళలపై ఉన్న వివక్షను మార్చడానికే తన పోరాటం అంకితం అంటోంది వెరోనికా. ఇప్పటికీ పలు సందర్భాల్లో ఈ నిబంధనలపై స్పందిస్తుంటుందీ అందాల తార.

ఇక 2018 మిస్‌ మసాచుసెట్స్‌ పోటీల్లో మీటూ ఉద్యమాన్ని అపహాస్యం చేస్తూ నిర్వహించిన ఓ స్కిట్‌కు వ్యతిరేకంగా గళమెత్తడమే కాదు.. తన ‘Miss Plymouth County’ కిరీటాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేసి నిరసన తెలిపింది Maude Gorman. 13 ఏళ్ల వయసులో అత్యాచారానికి గురైన ఆమె.. స్త్రీలపై జరిగే ఇలాంటి అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. అయితే ఆ తర్వాత నిర్వాహకులు తమ తప్పు తెలుసుకొని క్షమాపణ కోరడంతో వివాదం సద్దుమణిగింది.

ఇవన్నీ చదువుతుంటే.. అందాల పోటీల్లో రాణించాలంటే.. తోటి పోటీదారుల్ని జయించడమే కాదు.. ఇలాంటి వివక్షనూ దాటాలన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది కదూ! మరి, అందమంటే కేవలం శరీరానికి పరిమితం కానప్పుడు.. అసలెందుకీ కొలమానాలు? ఇలాంటి ప్రమాణాల్లో ఇమిడితేనే అందంగా ఉన్నట్లు లెక్కా? మీ దృష్టిలో అందమంటే ఏంటి? మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని