ఇవి పంచుకుంటున్నారా.. అయితే జాగ్రత్త!

ఆపాదమస్తకం అందంగా మెరిసిపోవాలని అందరికీ ఉంటుంది. అందుకోసం మేకప్‌ను కూడా ఆశ్రయిస్తూ ఉంటాం. ఈ క్రమంలో కొందరు మేకప్ ఉత్పత్తులు, అందులో ఉపయోగించే బ్రష్‌లను సైతం ఇతరులతో పంచుకొంటూ ఉంటారు. మీరూ అంతేనా? అయితే జాగ్రత్త!

Published : 03 Jun 2024 12:08 IST

ఆపాదమస్తకం అందంగా మెరిసిపోవాలని అందరికీ ఉంటుంది. అందుకోసం మేకప్‌ను కూడా ఆశ్రయిస్తూ ఉంటాం. ఈ క్రమంలో కొందరు మేకప్ ఉత్పత్తులు, అందులో ఉపయోగించే బ్రష్‌లను సైతం ఇతరులతో పంచుకొంటూ ఉంటారు. మీరూ అంతేనా? అయితే జాగ్రత్త! అలా చేయడం వల్ల చర్మానికి హాని కలిగే అవకాశాలు చాలానే ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి, సౌందర్య సంరక్షణలో భాగంగా ఏయే ఉత్పత్తులను ఇతరులతో పంచుకోకూడదో తెలుసుకుందామా..

స్నేహితులు లేదా బంధువుల్లో ఎవరివైనా లిప్‌స్టిక్/ లిప్‌గ్లాస్/ మేకప్ బ్రష్.. ఇలా ఏది కనిపించకపోయినా వెంటనే పక్కనున్న వాళ్లు 'ఇదిగో.. నాది తీసుకో..' అంటూ అందించడం లేదంటే మనమే వాళ్లను అడగడం సర్వసాధారణమే. అయితే ఆ క్షణానికి అందంగా కనిపించడానికి అది ఉపయోగపడినా ముందు ముందు మాత్రం సౌందర్యపరంగా చాలా నష్టాలే ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే సౌందర్య సంరక్షణలో భాగంగా కొన్ని ఉత్పత్తులను ఇతరులతో అస్సలు పంచుకోకూడదు.

పౌడర్ రూపంలో ఉంటే..

మేకప్‌లో ఉపయోగించే ఫౌండేషన్, ఐ షాడో.. వంటివి కొన్ని పౌడర్ రూపంలో కూడా ఉంటాయి. అయితే వీటిని ఒకరి కంటే ఎక్కువమంది చేతితో తాకినా లేదా బ్రష్‌తో అప్త్లె చేసుకున్నా అందులో బ్యాక్టీరియా చేరే అవకాశాలు ఎక్కువ. ఫలితంగా మొటిమలు రావడం, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు దరిచేరడం.. వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి పౌడర్ రూపంలో ఉన్న ఉత్పత్తులను ఇతరులతో అస్సలు పంచుకోకూడదు.

లిప్‌స్టిక్/ లిప్‌గ్లాస్..

చాలామంది రంగు బాగుందనో లేక మంచి లుక్ ఇస్తుందనో ఇతరుల లిప్‌స్టిక్/ లిప్‌గ్లాస్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇతరులవి మనం ఉపయోగించడం వల్ల వాటిపై ఉన్న బ్యాక్టీరియా మన అధరాల పైకి చేరే అవకాశాలు లేకపోలేవు. అలాగే మన అధరాలపై ఉన్న తేమలో ఉండే బ్యాక్టీరియా కూడా వాటికి తోడై పెదాలకు హాని కలిగించవచ్చు. కాబట్టి ఇవి కూడా ఎవరివి వారే ఉపయోగించుకోవడం శ్రేయస్కరం.

కళ్ల సంబంధిత ఉత్పత్తులు..

ఐ షాడో, మస్కారా, ఐ లైనర్.. వంటి ఐ మేకప్ ఉత్పత్తులను చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇతరుల ఐ మేకప్ ఉత్పత్తులు ఉపయోగించేటప్పుడు వారికి ఏమైనా కళ్ల సంబంధిత ఇన్ఫెక్షన్లు ఉంటే అవి మనకు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేవు. అలాగే ఆ ఉత్పత్తుల్లోని బ్యాక్టీరియా వల్ల కళ్లు ఎర్రబడడం, నీళ్లు కారడం, మండడం.. వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.

మూతలు ఉండేవి..

కొన్ని రకాల క్రీమ్‌లు, పౌడర్లు.. మూతలు ఉండే చిన్న చిన్న సీసాల్లో లభ్యమవుతుంటాయి. వీటిని కూడా ఇతరులతో పంచుకోకూడదు. అలా షేర్ చేసుకోవడం వల్ల వారు ఉపయోగించినప్పుడు వారి చేతుల్లో ఉండే హానికారక బ్యాక్టీరియా ఈ ఉత్పత్తుల్లోకి చేరుతుంది. అవి మనం వాడడం వల్ల మన చర్మానికి కూడా నష్టం వాటిల్లుతుంది.

మేకప్ బ్రష్‌లు..

మేకప్ వేసుకోవడానికి ఉపయోగించే బ్రష్‌లను కూడా ఇతరులతో పంచుకోకూడదు. ఇతరులు వాటిని ఉపయోగించినప్పుడు వారి చర్మం మీద ఉండే బ్యాక్టీరియా, క్రిములు.. వంటివి మేకప్ ఉత్పత్తుల్లోకే కాదు.. వాటిని తిరిగి మనం ఉపయోగించినప్పుడు మన చర్మం మీదకు కూడా చేరతాయి. కాబట్టి మేకప్ వేసుకోవడానికి ఉపయోగించే బ్రష్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడంతో పాటు ఇతరులతో పంచుకోకుండా ఉండడం మంచిది.

ఇవి కూడా..

లిక్విడ్ ఫౌండేషన్, లిక్విడ్ ఐ లైనర్, క్రీమ్ రూపంలో ఉండే ఉత్పత్తులు, నెయిల్‌పాలిష్, హెయిర్ బ్రష్‌లు, క్లెన్సింగ్‌కి ఉపయోగించే స్పాంజ్‌లు, మేకప్ వేసుకోవడానికి వాడే పఫ్‌లు, ఐ లాష్ కర్లర్, ట్వీజర్స్, ప్లక్కర్స్, లిప్‌బామ్, స్నానానికి ఉపయోగించే ఉత్పత్తులు, సాధనాలు.. మొదలైనవన్నీ ఇతరులతో పంచుకోకుండా ఉండడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్