Published : 11/01/2022 20:44 IST

కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే..!

ముఖసౌందర్యంలో కనుబొమ్మలదీ ప్రత్యేక పాత్రే! ఇవి ఒత్తుగా, నల్లగా ఉన్నప్పుడే మోము అందం ఇనుమడిస్తుంది. అయితే కనుబొమ్మలు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటించాలంటున్నారు సౌందర్య నిపుణులు.

* కొబ్బరి పాలను కనుబొమ్మలకు రాయడం ద్వారా అవి దళసరిగా పెరుగుతాయి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొన్నాళ్లకు మార్పును గమనించచ్చు.

* రోజూ కాస్తంత ఆముదాన్ని నిద్రపోయే ముందు కనుబొమ్మల చుట్టూ రాయండి. ఇలా చేయడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి. ఇది పాత చిట్కానే అయినా చక్కగా పనిచేస్తుంది.

* కొబ్బరి నూనె తరచూ అప్లై చేయడం వల్ల కూడా కనుబొమ్మలు బాగా పెరుగుతాయి.

* రాత్రి నానబెట్టిన మెంతుల్ని ఉదయాన్నే పేస్ట్ చేసి కనుబొమ్మలపై రాయాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.

* కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి కలబంద కూడా సహకరిస్తుంది. ఇందుకోసం ఇంట్లో పెరిగే కలబంద మొక్క గుజ్జును ఉపయోగించచ్చు.. లేదంటే మార్కెట్లో దొరికే అలొవేరా జెల్స్‌నైనా వాడచ్చు. దీన్ని కనుబొమ్మల చుట్టూ రాస్తే కొన్ని రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది.

* ఒక చిన్న గిన్నెలో పాలు తీసుకొని అందులో కాటన్‌ను ముంచి కనుబొమ్మల చుట్టూ అద్దాలి. ఇలా తరచూ చేస్తుంటే కొన్నాళ్లకు కనుబొమ్మలు ఒత్తుగా రావడం గమనించచ్చు.

* కనుబొమ్మలపై నిమ్మ చెక్కతో రుద్దినా ఆ ప్రదేశంలో వెంట్రుకలు దట్టంగా పెరుగుతాయి.

* పెట్రోలియం జెల్లీ రాయడం వల్ల కనుబొమ్మలకు పూర్తి తేమ అందడమే కాకుండా అవి దృఢంగా మారేందుకు సహకరిస్తుంది. ఒకవేళ కనుబొమ్మలు ఊడిపోతూ పలుచబడుతున్నట్లనిపిస్తే రోజుకు 2 నుంచి 3 సార్లు కొద్దిగా పెట్రోలియం జెల్లీని కనుబొమ్మలపై రాసుకోవడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

* ఆలివ్ నూనె, బాదం నూనె కూడా కనుబొమ్మల ఎదుగుదలకు చాలా మంచివి. ఇవి కనుబొమ్మల వెంట్రుకలకు కావాల్సిన దృఢత్వాన్ని అందించి అవి రాలిపోకుండా చేస్తాయి.

* ఉల్లిపాయలో సల్ఫర్ అధిక మొత్తంలో ఉంటుంది కాబట్టి అది రక్త ప్రసరణ బాగా జరిగేలా ప్రేరేపిస్తుంది. క్రమం తప్పకుండా ఉల్లిపాయ రసాన్ని కనుబొమ్మల చుట్టూ రాయడం వల్ల అవి ఒత్తుగా పెరిగేలా చేయచ్చు.

* విటమిన్‌ లోపం వల్ల కూడా వెంట్రుకల ఎదుగుదల ఆగిపోతుంది. కాబట్టి ‘బి’, ‘సి’, ‘ఇ’.. వంటి విటమిన్లు అధికంగా లభించే ఆహార పదార్థాలను రోజూ తీసుకోవాలి. అలాగే వైద్యుల సలహా మేరకు విటమిన్‌ సప్లిమెంట్స్‌ కూడా వాడచ్చు.

* ఈ చిట్కాలతో పాటు రోజూ తగినంత నీరు తాగాలి. దీని వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు వెళ్లి పోవడమే కాకుండా.. రక్తప్రసరణ బాగా జరగడానికి సహాయపడుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని