Published : 22/11/2022 21:05 IST

చర్మం జిడ్డుగా ఉందా...?

ఆయిలీ స్కిన్.. ఈ సమస్యతో బాధపడే అమ్మాయిలు చాలామందే ఉంటారు. ఏం చేసినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జిడ్డుదనాన్ని పూర్తిగా అరికట్టలేకపోవచ్చు. ఫలితంగా మొటిమలు, మచ్చలు.. వంటి సమస్యలు చుట్టుముడతాయి. అందుకే ఈ సమస్యని ఇంట్లోనే సులభంగా పరిష్కరించుకునే చిట్కాలు మీకోసం..

చర్మం లోపల ఉండే సెబేషియస్ గ్రంధులు అవసరమైన దాని కంటే ఎక్కువగా స్రావాల్ని ఉత్పత్తి చేయడమే ఈ సమస్యకు ప్రధాన కారణం. ఆయిలీ స్కిన్‌తో బాధపడేవారు మొటిమలు, మచ్చలు.. వంటి ఇతర సమస్యలతో కూడా సతమతమవ్వాల్సి ఉంటుంది. 

⚛ పాలు ముఖానికి రాసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత కడిగేసుకోవాలి. పాలు చర్మంలో పేరుకుపోయిన జిడ్డుదనాన్ని బయటకు లాగేస్తాయి.

⚛ తేనెతో చాలా ప్రయోజనాలున్నాయని మనందరికీ తెలుసు. వాటిలో జిడ్డుదనాన్ని తగ్గించడం కూడా ఒకటి. తేనె చేతుల్లోకి తీసుకుని ముఖానికి పూత పూసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జిడ్డుదనం తగ్గుతుంది.

⚛ ముఖాన్ని శుభ్రపరుచుకునే నీళ్లలో నిమ్మరసం కలుపుకొన్నా.. లేక ఐస్‌తో ముఖమంతా రుద్దుకున్నా చక్కటి ఫలితం కనిపిస్తుంది.

క్లెన్సింగ్

⚛ గుడ్డులోని తెల్లసొన, ద్రాక్ష, నిమ్మరసాల మిశ్రమాన్ని కలుపుకొని ముఖానికి పూసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు దాన్ని అలాగే ఉంచి తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తేడా వెంటనే తెలుస్తుంది. నిమ్మ న్యాచురల్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది, గుడ్డులోని తెల్లసొన చర్మం బిగుతుగా అవడానికి, ద్రాక్ష చర్మం మృదువుగా మారడానికి ఉపకరిస్తాయి.

⚛ కొబ్బరి పాలు కూడా ఉపయోగించి ఆయిలీనెస్‌ని తగ్గించుకోవచ్చు.

⚛ సాధారణంగా ఆయిలీ స్కిన్ ఉన్నవారు ఎక్కువసార్లు ముఖం కడుక్కుంటూ ఉంటారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే సోప్ లేదా లిక్విడ్‌లో ఉండే రసాయనాలు చర్మం మీద ఎక్కువ ప్రభావం చూపించి డ్రైగా మార్చేస్తాయి. ఫలితంగా చర్మం అంతా పాలిపోయినట్లు కళ తప్పిపోయినట్లవుతుంది.

⚛ ఒకవేళ ముఖాన్ని కడుక్కోవాలనుకుంటే వేడినీళ్లతో ముఖం కడుక్కోవడం ఒక చక్కటి ఉపాయం. దీనివల్ల చర్మంలో ఉన్న అదనపు జిడ్డు సులభంగా బయటకు పోతుంది.

⚛ నీళ్లలో చెంచా ఉప్పు కలిపి ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకుని దగ్గర పెట్టుకోండి. రోజులో ఒకటి లేదా రెండుసార్లు ఆ నీటిని ముఖం మీద స్ప్రే చేసుకుని ముఖం అంతా సమానంగా పరచాలి. కాసేపు అలాగే ఆరనివ్వాలి. తేడా మీకే తెలుస్తుంది.

⚛ ఈ చిట్కాలన్నీ పాటిస్తున్నా; చర్మం నుంచి ఎక్కువగా వచ్చే జిడ్డుదనాన్ని ఎప్పటికప్పుడు తొలగించడానికి బ్లాటింగ్ లేదా టిష్యూ పేపర్స్‌ని మీతో ఉంచుకోవడం మరచిపోకండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని