Monsoon Tips : ఈ ఫేస్‌ప్యాక్స్‌తో.. అందంగా మెరిసిపోదాం!
వర్షాన్ని ఆస్వాదించడం వరకు బాగానే ఉంటుంది. కానీ వర్షం ప్రభావం అందం పైన కూడా పడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు ఎండ ప్రభావం కూడా.....
వర్షాన్ని ఆస్వాదించడం వరకు బాగానే ఉంటుంది. కానీ వర్షం ప్రభావం అందం పైన కూడా పడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు ఎండ ప్రభావం కూడా ఉంటుంది. ఇలాంటి భిన్నమైన వాతావరణంలో వర్షంలో తడిస్తే చర్మం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. అయితే కొన్ని ఫేస్‌ప్యాక్‌లు వేసుకోవడం ద్వారా ఈ కాలంలో చర్మ సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు.
రోజ్‌వాటర్‌తో..
పావుకప్పు రోజ్‌వాటర్‌ని తీసుకొని దానికి టేబుల్‌స్పూన్ చందనం పొడి, పావు చెంచా పసుపుని జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసుకొని అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ట్యాన్, పొక్కులు.. వంటివి తొలగిపోయి ముఖం నిగారింపును సంతరించుకుంటుంది. పసుపు, చందనంలో ఉన్న ఔషధ గుణాలు చర్మ సంబంధిత అలర్జీలు రాకుండా చేస్తాయి.
గ్రీన్‌టీతో..
రెండు టేబుల్‌స్పూన్ల గ్రీన్ టీ పొడి తీసుకోవాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ పెరుగు, రెండు చుక్కల బాదం నూనె జత చేసి బ్లెండర్‌తో బాగా మెత్తగా అయ్యే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ మిశ్రమంలో బాదం నూనెకు బదులు మీ చర్మతత్వానికి సరిపడే ఇతర అత్యవసర నూనెల్ని సైతం ఉపయోగించవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్ వేసుకోవడం వల్ల దురద, ఇతర చర్మ సంబంధిత సమస్యలు దరిచేరవు.
పుదీనాతో..
గుప్పెడు పుదీనా ఆకులను తీసుకొని మెత్తగా చేసుకోవాలి. అరటిపండులో సగభాగాన్ని తీసుకొని దాన్ని కూడా మెత్తగా చేసుకోవాలి. ఈ రెండింటినీ బ్లెండర్‌తో బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసుకోవాలి. ఫేస్‌ప్యాక్ బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అరటి చర్మానికి పోషణనిచ్చి తేమను కోల్పోకుండా చేస్తుంది. అలాగే బ్యాక్టీరియా నుంచి చర్మాన్ని రక్షించే గుణాలు పుదీనాలో ఉన్నాయి.
ముల్లంగితో..
ముల్లంగిలో సగభాగం తీసుకొని దాన్ని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం జత చేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత కాసేపు మృదువుగా మర్దన చేసుకోవాలి. అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ముఖ చర్మానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నిమ్మలో ఉన్న విటమిన్ 'సి' చర్మానికి పోషణనివ్వడంతో పాటు అలర్జీలు రాకుండా చూస్తుంది. ముల్లంగిలో ఉన్న సుగుణాలు ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో సహకరిస్తాయి.
కోడిగుడ్డు తెల్లసొనతో..
గుడ్డులోని తెల్లసొనకు చెంచా తేనె జతచేసి బ్లెండర్‌తో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి దట్టంగా పట్టించాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం క్లెన్సర్‌గా పనిచేసి ముఖాన్ని శుభ్రం చేస్తుంది. జిడ్డుదనాన్ని తగ్గిస్తుంది.
గంజితో..
వర్షాకాలంలో వాతావరణ ప్రభావం వల్ల కొన్ని రకాల చర్మ సంబంధిత అలర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇవి రాకుండా చాలామంది రకరకాల యాంటీబయోటిక్స్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మనకు అందుబాటులో ఉండే గంజి కూడా బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను దరి చేరనివ్వదట. అలాగే మూసుకుపోయిన చర్మరంధ్రాలను తెరచుకునేలా చేస్తుంది. తద్వారా ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.