Updated : 08/10/2021 16:34 IST

పోషకాల గని.. ఆరోగ్యపు నిధి.. 'కోడిగుడ్డు'!

ఉడికించిన కోడిగుడ్డు, పాలు అల్పాహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. ఇతర అల్పాహారాల్లో లభించని పోషకాలు ఇందులో నిక్షిప్తమై ఉండడమే ఇందుకు కారణం. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు.. ఇవన్నీ కోడిగుడ్డులో పుష్కలంగా లభిస్తాయి. ఇలా ఎన్నో రకాల పోషకాలు కలిగిన చవకైన ఆహారం కాబట్టే ఎక్కడ చూసినా రోజుకు కొన్ని లక్షల గుడ్ల వినియోగం జరుగుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్ని ఇతర దేశాలతో పోల్చితే ఇది తక్కువే కావడం గమనార్హం. 'ప్రపంచ గుడ్డు దినోత్సవం' నేపథ్యంలో కోడిగుడ్డులో ఉండే పోషకాలేంటి? అవి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం రండి..

పోషకాలు ఇవీ!

ఉడికించిన కోడిగుడ్డు నుంచి రోజూ మన శరీరానికి అందే పోషకాల శాతం ఎంతో మీకు తెలుసా?

* ఫోలేట్ - 5 శాతం

* సెలీనియం - 22 శాతం

* ఫాస్ఫరస్ - 9 శాతం

* విటమిన్ ఎ - 6 శాతం

* విటమిన్ బి2 - 15 శాతం

* విటమిన్ బి5 - 7 శాతం

* విటమిన్ బి12 - 9 శాతం

అలాగే 60 గ్రాముల కోడిగుడ్డు నుంచి ప్రొటీన్ - 7.9 గ్రాములు, శక్తి - 103 కేలరీలు, ఇనుము - 1.26 మి.గ్రా, ఫాస్పరస్ - 132 మి.గ్రా, క్యాల్షియం - 36 గ్రా, కొవ్వులు - 7.9 గ్రా లభిస్తాయి.

వీటితో పాటు క్యాల్షియం, జింక్.. వంటి ఖనిజాలు; బి6, డి, ఇ, కె.. విటమిన్లు కూడా కోడిగుడ్లలో సమృద్ధిగా లభిస్తాయి.

* పిల్లలకు అందించే ఆహారంలో కోడిగుడ్డు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో ఉండే విటమిన్ ఎ; ల్యూటిన్, జియాక్సాంథిన్.. లాంటి యాంటీఆక్సిడెంట్లు కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడడంతో పాటు రేచీకటి నుంచి విముక్తి కలిగిస్తాయి.

* ఒక కోడిగుడ్డులో 1.5 గ్రాముల పచ్చసొన, 213 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్, 75 క్యాలరీలు ఉంటాయి. మనం రోజూ తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ 300 మిల్లీగ్రాములకు మించకూడదు. కాబట్టి రోజూ ఒక గుడ్డు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్‌లో అధిక మొత్తం లభించినట్లే.

* జీవక్రియలు సక్రమంగా సాగడంతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి కోడిగుడ్డులోని ప్రొటీన్లే కారణం. అలాగే ఇందులో విటమిన్ సి తప్ప మిగిలిన అన్ని విటమిన్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి.

* తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రొటీన్లు, ఖనిజాలు ఉండే కోడిగుడ్డు.. ఎముకలు, కండరాలు.. దృఢంగా తయారు కావడానికి తోడ్పడుతుంది. ఎత్తు పెరిగేందుకు సహాయపడుతుంది.

* కోడిగుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్లు, నియాసిన్, రైబోఫ్లేవిన్, క్లోరిన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, సల్ఫర్, జింక్.. వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే పచ్చసొనలో విటమిన్ ఎ, డి, ఇ అధికంగా ఉంటాయి. వీటితో పాటు ఫోలికామ్లం, ఐరన్, క్యాల్షియం, కాపర్, సల్ఫర్‌లు కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే గుడ్డులో లభించే ఐరన్ శరీరంలో సులభంగా కలిసిపోతుంది.

* శరీరం, గుండె ఆరోగ్యానికి అవసరమైన ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు గుడ్డులో అధిక మొత్తంలో ఉంటాయి.

 

ప్రయోజనాలెన్నో..

* కోడిగుడ్డులో లభించే ఫోలేట్ పుట్టుకతో సంక్రమించే వ్యాధులను చాలా వరకు తగ్గిస్తుంది.

* ఉదయం పూట ఇతర అల్పాహారానికి బదులు గుడ్డు తీసుకునే వారు బరువు తగ్గుతారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అలాగే గుడ్డులో ఉండే పెప్త్టెడ్స్ వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని కూడా రుజువైంది.

* మరో విషయం ఏంటంటే.. మహిళల్లో ఎవరైతే రోజూ క్రమం తప్పకుండా కోడిగుడ్డును ఆహారంలో భాగం చేసుకుంటారో వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 24 శాతం తక్కువని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. దీనికి కారణం గుడ్డులో ఉండే కోలిన్ అనే పదార్థం. ఇది మెదడు, నాడీ మండలాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా చాలా అవసరం. ఒక గుడ్డు నుంచి 20 శాతం వరకు కోలిన్ లభిస్తుంది. ఇది కాలేయ జబ్బులు తగ్గించడంలో, ధమనులు దృఢంగా ఉండడానికి తోడ్పడుతుంది.

* గుడ్డులో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. శరీరానికి ఎండ తగలకపోవటం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ప్రస్తుతం చాలామంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. దీంతో మధుమేహం, ఎముకలకు సంబంధించిన సమస్యలు పొంచి ఉంటున్నాయి. అందువల్ల గుడ్డును ఆహారంలో చేర్చుకోవటం మంచిది.

* ప్రొటీన్లతో నిండిన గుడ్డులో మనకు అవసరమైన అన్నిరకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

 

గర్భిణులకు వెరీ 'గుడ్డు'!

కాబోయే తల్లులంతా తల్లీబిడ్డలిద్దరికీ సరిపడా పోషకాలున్న సమతులాహారం తీసుకోవాలని జాతీయ ఆరోగ్య సర్వే (ఎన్‌హెచ్ఎస్) సూచిస్తోంది. వీటిలో కోడిగుడ్లు ముందు వరుసలో ఉంటాయి. అంతేకాదు.. గర్భిణులు పచ్చి గుడ్లు, సగం ఉడికించిన గుడ్లు.. వంటివి అస్సలు తీసుకోవద్దని హెచ్చరిస్తోంది కూడా..! ఇలా తీసుకోవడం వల్ల సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. మరి, గర్భిణులు రోజూ గుడ్డు తీసుకోవడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటంటే..

* కోడిగుడ్లలో అధిక మొత్తంలో ఉండే సెలీనియం, జింక్, ఎ, డి, బి విటమిన్లు, కొవ్వులు, శ్యాచురేటెడ్ ఫ్యాట్స్.. మొదలైనవన్నీ గర్భస్థ దశలో మహిళలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి.

* గుడ్లలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అవి ప్రెగ్నెన్సీ సమయంలో చాలా అవసరం. ఎందుకంటే దానివల్లే పిండం ఎదుగుదల బాగా జరుగుతుంది. కడుపులో బిడ్డ ఎదిగే క్రమంలో కణాలన్నీ ప్రొటీన్‌తోనే రూపుదిద్దుకుంటాయి. కాబట్టి గర్భిణులు ప్రొటీన్ అధికంగా లభించే గుడ్లను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం.

* ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, కోలీన్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు బిడ్డ ఎదుగుదలతో పాటు మెదడు ఆరోగ్యానికీ చాలా అవసరం. అలాగే న్యూరల్ ట్యూబ్‌లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తపడాలంటే ఈ పోషకాలన్నీ గర్భిణులు తప్పకుండా తీసుకోవాల్సిందే..!

* ఒక గుడ్డులో సాధారణంగా 70 క్యాలరీలుంటాయి. అలాగే గర్భిణులు రోజూ 200 నుంచి 300 వరకు అదనపు క్యాలరీలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది వారికి, తమ కడుపులోని బిడ్డకి సంపూర్ణ పోషణను అందిస్తుంది.

* శరీరంలో శ్యాచురేటెడ్ కొవ్వుల స్థాయుల్ని సమతులం చేయాలంటే రోజూ కోడిగుడ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే ఇందుకోసం రక్తంలో కొవ్వు స్థాయులు సాధారణంగా ఉన్న వారు ఒకటి లేదా రెండు గుడ్లను తీసుకోవాలి. ఒకవేళ రక్తంలో కొవ్వు స్థాయులు మరీ అధికంగా ఉన్నట్లయితే అలాంటివారు గుడ్డులోని తెల్లసొనను మాత్రమే తీసుకోవడం ఉత్తమం.

 

సౌందర్య పోషణలోనూ..

* కోడిగుడ్డు ఆరోగ్యానికే కాదు.. అతివల అందంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మెరిసే మేనికి, ముట్టుకుంటే పట్టులా జారిపోయే కురులను సొంతం చేసుకోవడానికి కోడిగుడ్డు తోడ్పడుతుంది. దీనికోసం కోడిగుడ్డులోని తెల్లసొనను జుట్టుకు రాసుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

* అలాగే కాంతివంతంగా మెరిసిపోయే చర్మ సౌందర్యం కోసం కోడిగుడ్డుతో ఇంట్లోనే రకరకాల ఫేస్‌ప్యాక్‌లు తయారు చేసుకోవచ్చు. ఇది చర్మంలోని మృతకణాలను తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది.

 

ఇలా తినచ్చు..

* ఉదయం పూట అల్పాహారంగా గుడ్లను తీసుకుంటే చాలాసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. ఆకలి వేయకుండా.. ఎక్కువ ఆహారం తినకుండా చేస్తాయి. ఫలితంగా బరువు తగ్గటానికీ గుడ్లు తోడ్పడతాయన్నమాట.

* కొంతమందికి పచ్చసొన వాసన అంతగా నచ్చదు. అయితే ఇప్పుడు వాసన రాని గుడ్లు కూడా లభిస్తున్నాయి. మామూలు గుడ్లతో పోలిస్తే వీటి ధర మాత్రం కొంచెం అధికం.

* ఏ విధమైన ఆరోగ్య సమస్యలూ లేనివాళ్లు రోజుకొక గుడ్డు చొప్పున తినొచ్చు. ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయులు అధికంగా ఉన్నవాళ్లు పచ్చసొనను మినహాయించి తెల్లసొనను నిరభ్యంతరంగా తినొచ్చు.

చూశారుగా.. కోడిగుడ్డులో దాగున్న ఆరోగ్య రహస్యాలేంటో.. కాబట్టి నిపుణుల సూచనల మేరకు కనీసం ఇప్పటి నుంచైనా రోజూ క్రమం తప్పకుండా కోడిగుడ్డు తిని చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని