మునగ నూనెతో అందంగా..!
వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా ఉండాలని కోరుకుంటున్నారా? సహజంగానే మీ చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా? దృఢమైన కురులు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మునగ నూనె ఉపయోగించాల్సిందే. ఎందుకంటే ఈ నూనె మంచి సౌందర్య సాధనంగా....
వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా ఉండాలని కోరుకుంటున్నారా? సహజంగానే మీ చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా? దృఢమైన కురులు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మునగ నూనె ఉపయోగించాల్సిందే. ఎందుకంటే ఈ నూనె మంచి సౌందర్య సాధనంగా పనిచేస్తుంది. అందంతో పాటు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేసే ఈ తైలం వల్ల సౌందర్యపరంగా మరెన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..
మునక్కాయల్లో ఉండే గింజలను ఎండబెట్టి, వాటి నుంచి తీసిన నూనే ఈ మునగ నూనె. దీన్ని ఉపయోగించడం వల్ల అటు ఆరోగ్యపరంగానే కాదు.. ఇటు సౌందర్యపరంగా కూడా ప్రయోజనాలు పొందచ్చు. అవేంటంటే..
మెరిసే చర్మానికి..
మునగ నూనె చర్మానికి రాసుకోవడం వల్ల తేమ అందడంతో పాటు కాలుష్యం కోరల్లో చిక్కుకొని పాడైన చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చు. అలాగే రోజువారీ పనుల వల్ల కలిగే అలసట, ఒత్తిళ్ల నుంచి కూడా ఇది ఉపశమనం కలిగేలా చేస్తుంది. ఫలితంగా చర్మం మృదువుగా మారడమే కాకుండా ప్రకాశవంతంగా కూడా కనిపిస్తుంది. తాజా అనుభూతి కలుగుతుంది.
తేమనందిస్తుంది..!
పొడిచర్మతత్వం ఉన్న వారికి ఈ నూనె మేలు చేస్తుంది. ఇది నేరుగా చర్మం లోపలి పొరల్లోకి ఇంకి పొడిబారిపోవడం, పొలుసుల్లా రాలిపోవడం.. వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగని జిడ్డుగా కూడా అనిపించదు. అలాగే పగిలిన పెదవులకు కూడా దీన్ని అప్త్లె చేసుకుంటే అవి తిరిగి మృదువుగా మారతాయి. ఇందులో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్స్, మినరల్స్.. చర్మానికి తగినంత తేమతో పాటు పోషణ కూడా అందిస్తాయి.
వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా..
మునగ నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మం నవయవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. అలాగే ఇందులోని విటమిన్ ‘సి’ కొలాజెన్ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేసి చర్మం ముడతలు పడకుండా సంరక్షిస్తుంది. కాబట్టి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు.. ఒకవేళ ముఖంపై సన్నటి గీతలుంటే అది కూడా తగ్గుముఖం పట్టి తాజాగా, అందంగా కనిపించే చర్మం మీ సొంతమవుతుంది. స్నానం చేసిన తర్వాత ఈ నూనెతో చర్మానికి మృదువుగా మర్దన చేసుకోవడం వల్ల రోజంతా తేమ నిలిచి ఉండేలా చేస్తుంది. పగటి పూట ఇబ్బంది అనుకునేవారు రాత్రి పూట నిద్రపోయే ముందు కూడా ఈ నూనెను చర్మానికి రాసుకోవచ్చు.
మచ్చలు పోతాయ్!
మునగ నూనెలో విటమిన్ సి, ఇ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి చర్మంపై ఉండే మచ్చలు పూర్తిగా తొలగిపోయేలా చేస్తాయి. కాబట్టి చర్మంపై ఉండే నల్లమచ్చలు, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, పిగ్మెంటేషన్.. వంటి సమస్యలకు చక్కని పరిష్కారంగా దీన్ని ఉపయోగించవచ్చు. అలాగే ఈ నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ గుణాల వల్ల చర్మంపై కాలిన మచ్చలు, గాయాలు.. వంటివి త్వరగా నయమవుతాయి.
కురులకు కూడా..
మునగ నూనె కేవలం చర్మానికే కాదు.. కురులకు కూడా తగినంత తేమని అందిస్తుంది. ఇందుకోసం కాస్త మునగ నూనె తీసుకొని కేశాలు తడిగా ఉన్నప్పుడు కుదుళ్లలోకి చేరేలా మృదువుగా మర్దన చేయాలి. ఈ నూనెని తరచూ ఉపయోగించడం ద్వారా దృఢమైన కురులు మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే చుండ్రు, చిట్లిన చివర్లు.. వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందచ్చు.
ఇవి కూడా!
❀ మునగ నూనెని ఫేషియల్ క్లెన్సర్‌గా కూడా ఉపయోగించవచ్చు.
❀ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండడం వల్ల ఇది ఎండ వల్ల కమిలిపోయిన చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తుంది.
❀ దీన్ని హెయిర్ సీరమ్‌గా కూడా వినియోగించవచ్చు.
❀ రాత్రి పడుకునే ముందు ఈ నూనెను కురులకు, చర్మానికి అప్త్లె చేసుకోవడం వల్ల చక్కగా నిద్ర పట్టేలా చేయడంతోపాటు రక్తపోటుని కూడా ఇది నియంత్రిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.