కుంకుమ పువ్వు.. బిడ్డ చర్మ ఛాయను పెంచుతుందా?

పుట్టబోయే బిడ్డ తెల్లగా ఉండాలని.. కొంతమంది గర్భిణిగా ఉన్నప్పుడు కుంకుమ పువ్వును ఆహారంలో చేర్చుకోవడం తెలిసిందే. మరి, నిజంగానే ఇది పుట్టబోయే బిడ్డ చర్మ ఛాయను మెరిపిస్తుందా? అంటే.. ఇది అవాస్తవం అంటున్నారు నిపుణులు.

Updated : 08 Jul 2024 15:44 IST

పుట్టబోయే బిడ్డ తెల్లగా ఉండాలని.. కొంతమంది గర్భిణిగా ఉన్నప్పుడు కుంకుమ పువ్వును ఆహారంలో చేర్చుకోవడం తెలిసిందే. మరి, నిజంగానే ఇది పుట్టబోయే బిడ్డ చర్మ ఛాయను మెరిపిస్తుందా? అంటే.. ఇది అవాస్తవం అంటున్నారు నిపుణులు. కడుపులో పెరిగే బిడ్డ చర్మ రంగుకు, కుంకుమ పువ్వుకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. అయితే గర్భిణులు కుంకుమ పువ్వును రోజూ తీసుకోవడం మాత్రం మంచిదే అంటున్నారు. ఎందుకో తెలుసుకుందాం రండి..

జీన్స్‌ని బట్టే రంగు..!

గర్భిణులు డాక్టర్‌ సలహా మేరకు కుంకుమ పువ్వును రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం సహజమే! పుట్టబోయే బిడ్డ చర్మ ఛాయ మెరుగుపడాలని వారు అలా చేస్తుంటారు. కానీ బిడ్డ చర్మ ఛాయ.. తల్లిదండ్రుల జీన్స్‌ని బట్టి ఉంటుందని, ఈ సమయంలో తీసుకునే ఆహారాన్ని బట్టి కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే గర్భం ధరించిన మహిళలు కుంకుమ పువ్వును రోజూ తీసుకోవడం మాత్రం మంచిదే అంటున్నారు.

అది కూడా డాక్టర్‌ సలహా మేరకు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల తల్లీబిడ్డలిద్దరికీ బహుళ ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు.

ఆరోగ్యానికి.. అందానికీ!

గర్భం ధరించిన మహిళల్లో జీర్ణ వ్యవస్థ పనితీరు నెమ్మదిగా సాగుతుంది. తద్వారా కొన్నిసార్లు అజీర్తి, వికారం, వాంతులు, మలబద్ధకం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. కుంకుమ పువ్వు వీటన్నింటినీ దూరం చేస్తుంది. కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగినా, ఇతర ఆహార పదార్థాల్లో భాగం చేసుకున్నా సమాన ఫలితం ఉంటుంది.

మూడ్‌ స్వింగ్స్‌, యాంగ్జైటీ, ఒత్తిడి, ఆందోళన.. వంటి మానసిక సమస్యలు గర్భిణుల్లో సహజం. వీటిని అదుపు చేసుకొని మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోవాలంటే కుంకుమ పువ్వును రోజూ తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇందులో ఒత్తిడిని దూరం చేసే కారకాలుంటాయి. ఇవే మనసును తిరిగి ఉత్తేజపరుస్తాయి.

గర్భం ధరించాక తొలి త్రైమాసికంలో చాలామంది వేవిళ్లతో ఇబ్బంది పడుతుంటారు. దీన్నుంచి ఉపశమనం పొందాలన్నా కుంకుమ పువ్వు ఒక మార్గమంటున్నారు నిపుణులు. అయితే మొదటి త్రైమాసికంలో దీన్ని తీసుకోవచ్చా? లేదా? అన్న సందేహం కొంతమందిలో ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

కొంతమంది గర్భిణుల్లో అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. దీనివల్ల గర్భాశయానికి రక్త ప్రసరణ తక్కువగా జరుగుతుంది. ఇది కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి తల్లికి రక్తప్రసరణ అదుపులో ఉండాలన్నా, బిడ్డకు రక్త ప్రసరణ సరిగ్గా అందాలన్నా.. తల్లి రోజువారీ ఆహారంలో కుంకుమ పువ్వు చేర్చుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

కడుపులో పిండం ఎదిగే కొద్దీ.. గర్భిణుల్లో నడుం భాగంలోని కండరాలు, చర్మం సాగుతాయి. ఈ క్రమంలో నడుం, కటి వలయంలో నొప్పి వస్తుంది. దీన్నుంచి ఉపశమనం కలిగించడంలోనూ కుంకుమ పువ్వు చక్కగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.

చాలామంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతుంటారు. ఈ క్రమంలో ఐరన్‌ సప్లిమెంట్లు వాడే వారూ కొందరుంటారు. వీటితో పాటు ఐరన్‌ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం, కుంకుమ పువ్వును ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఫలితం ఉంటుందట!

మూడో త్రైమాసికంలో పొట్ట పెరిగిపోవడం వల్ల చాలామంది గర్భిణులు ఆయాసపడుతుంటారు. కొంతమంది గర్భిణుల్లో ఉదయం లేవగానే శ్వాస అందనట్లుగా అనిపిస్తుంది. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే రాత్రి పడుకునే ముందు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ చిట్కా వల్ల రాత్రి నిద్ర చక్కగా పడుతుంది.. సౌకర్యవంతంగానూ ఉండచ్చు.

గర్భం ధరించిన మహిళల్లో రోగనిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. ఫలితంగా అలర్జీలు, ఇన్ఫెక్షన్లు త్వరగా చుట్టుముట్టే ప్రమాదం ఉంది. అందుకే రోజూ కుంకుమ పువ్వు తీసుకొని ఇమ్యూనిటీని పెంచుకోమంటున్నారు నిపుణులు.

గర్భిణుల్లో ఆరోగ్యపరంగానే కాదు.. అందం పరంగానూ పలు సమస్యలు తలెత్తుతుంటాయి. మొటిమలు, పిగ్మెంటేషన్‌.. వంటివి వాటిలో కొన్ని! ఈ సమస్యలు తొలగిపోవాలన్నా కుంకుమ పువ్వును రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం అవసరం అంటున్నారు నిపుణులు.

ఐరన్‌ లోపం వల్ల గర్భిణుల్లో జుట్టు రాలే సమస్య కూడా పెరుగుతుంది. అదే కుంకుమ పువ్వును తీసుకుంటే ఐరన్ స్థాయులు బ్యాలన్స్‌ అయి.. జుట్టు రాలదు.. కేశాలు ఆరోగ్యంగానూ ఉంటాయి.


ఎంత తీసుకోవాలి?

కుంకుమ పువ్వుతో ఇన్ని ప్రయోజనాలున్నాయి కదా అని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కడుపులో పెరిగే బిడ్డకు ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనిలో వేడి చేసే గుణాలు ఎక్కువని, ఫలితంగా అబార్షన్‌ అయ్యే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు. కాబట్టి డాక్టర్‌ సలహా మేరకు ఎంత తీసుకోవాలి?, ఏ త్రైమాసికం నుంచి తీసుకోవడం మంచిది? అన్న విషయాలన్నీ తెలుసుకున్నాకే దీన్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిది. రోజుకు 2-3 పూరేకల్ని ఒక గ్లాసు పాలలో వేసుకొని తీసుకుంటే చాలంటున్నారు నిపుణులు. అయితే కొంతమంది శరీరతత్వానికి కుంకుమ పువ్వు పడకపోవచ్చట! ఈ క్రమంలో అలర్జీ, వికారం, యాంగ్జైటీ.. వంటి లక్షణాలు కనిపించచ్చట! కాబట్టి ముందు ఒకసారి శాంపిల్‌గా ప్రయత్నించాకే రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిదని గుర్తుంచుకోవాలి. మరో విషయం ఏంటంటే.. ప్రస్తుతం మార్కెట్లో కుంకుమ పువ్వు సప్లిమెంట్స్‌ కూడా దొరుకుతున్నాయి. అయితే గర్భిణులు వీటిని వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్