భాగస్వామి చెంతనుండగా.. నిదుర సమస్యలు ఏలనో..!
‘ఆకలి రుచెరుగదు.. నిద్ర సుఖమెరుగదు’ అంటుంటారు. అంటే.. బాగా ఆకలేసినప్పుడు ఎలాంటి ఆహారమైనా జిహ్వకు రుచించినట్లే.. ఎక్కువగా అలసిపోతే ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సుఖంగా నిద్రపోతామని అర్థం! నిద్ర మనల్ని శారీరకంగా, మానసికంగా......
‘ఆకలి రుచెరుగదు.. నిద్ర సుఖమెరుగదు’ అంటుంటారు. అంటే.. బాగా ఆకలేసినప్పుడు ఎలాంటి ఆహారమైనా జిహ్వకు రుచించినట్లే.. ఎక్కువగా అలసిపోతే ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సుఖంగా నిద్రపోతామని అర్థం! నిద్ర మనల్ని శారీరకంగా, మానసికంగా పునరుత్తేజితం చేస్తుంది. అయితే అలాంటి నిద్ర ఈ రోజుల్లో కరువవుతోందని చెప్పచ్చు. ఇందుకు బోలెడు కారణాలున్నా.. సుఖనిద్ర కోసం నానా పాట్లూ పడుతుంటాం. ఇకపై అంత శ్రమ పడిపోకుండా ఓ చిన్న పని చేయమంటోంది తాజా అధ్యయనం. భాగస్వామితో కలిసి నిద్రించడం వల్ల నిద్రకు సంబంధించిన ప్రతి సమస్యనూ దూరం చేసుకోవచ్చని ప్రత్యక్షంగా రుజువు చేసింది కూడా! ఇటీవల కొన్ని జంటలపై జరిపిన ఈ అధ్యయనంలో భాగంగా.. సుఖ నిద్ర, దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి బోలెడన్ని ఆసక్తికర విశేషాలు వెల్లడయ్యాయి. మరి, ఏంటా విషయాలు? భాగస్వామితో కలిసి నిద్ర పోవడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!
SHADES స్టడీ ఏం చెబుతోంది?!
నిద్ర, ఆరోగ్యం, ఆహారం, వాతావరణం, సామాజీకరణ (SHADES).. వీటినే ప్రధానాంశాలుగా తీసుకొని అరిజోనా యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధకులు ఇటీవలే ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందుకోసం పెన్సిల్వేనియాకు చెందిన వెయ్యి మంది మధ్య వయస్కుల్ని ఎంపిక చేశారు. ఈ క్రమంలో వారు తమ భాగస్వామితో కలసి నిద్రపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందారు? వాళ్లలో నిద్ర నాణ్యత ఎలా ఉంది? నిద్రకు సంబంధించిన సమస్యలతో ఏమైనా బాధపడుతున్నారా? అనే విషయాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విశేషాలు వెల్లడయ్యాయి.
❀ భాగస్వామితో కలిసి నిద్రకు ఉపక్రమించిన వారిలో నిద్ర నాణ్యత పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ క్రమంలో నిద్రలేమి, స్లీప్ ఆప్నియా (నిద్రలో శ్వాస సంబంధిత సమస్యలు రావడం).. వంటివి తగ్గి ఆరోగ్యం మెరుగుపడినట్లు నిర్ధారణకు వచ్చారు.
❀ తామెంతో ఇష్టపడే భాగస్వామితో కలిసి నిద్ర పోవడం వల్ల నిద్రలేమితో పాటు అలసట, నీరసం.. వంటివి కూడా దూరమైనట్లు రుజువైంది. అలాగే వాళ్లు ఎలాంటి అంతరాయం లేకుండా ఎక్కువ సమయం సుఖంగా నిద్రపోయినట్లు పరిశోధకులు గుర్తించారు.
❀ వీరిలో కొన్ని జంటలు తమ భాగస్వామితో కలిసి పడుకోవడం వల్ల అతి తక్కువ సమయంలోనే నిద్రలోకి జారుకున్నట్లు తెలిపారు.
❀ ఇక ఈ అధ్యయనంలో భాగంగా.. మరికొంతమందిని తమ పిల్లలతో కలిసి నిద్రపోయేలా చేశారు పరిశోధకులు. అయితే వీళ్లంతా మధ్యమధ్యలో నిద్రకు అంతరాయం కలిగినట్లు, నిద్రలేమితో సతమతమైనట్లు వెల్లడించడం గమనార్హం.
❀ ఇక ఒంటరిగా పడుకున్న వారి నిద్ర సమయాల్ని పరిశీలించగా.. వాళ్లలో నిద్ర సమయం తగ్గినట్లు, తద్వారా ఒత్తిడి, ఆందోళనలు, అనుబంధాల్లో సంతృప్తి.. ఇలా చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లు తేలింది.
ఏదేమైనా.. భాగస్వామితో కలిసి నిద్రపోవడం వల్ల సుఖనిద్రను ఆస్వాదించగలమని, ఇది ఆరోగ్యపరంగానూ మేలు చేస్తుందని ఈ అధ్యయనం చెబుతోంది.
ఆరోగ్యానికి.. అనుబంధానికీ..!
అయితే భాగస్వామితో కలిసి నిద్రకు ఉపక్రమించడం వల్ల నిద్ర సమస్యలు దూరమవడమే కాదు.. ఇంకా బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..!
❀ భాగస్వామితో కలిసి నిద్ర పోవడం వల్ల శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో శరీరంలో విడుదలయ్యే లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్ వల్ల బీపీ అదుపులో ఉంటుంది. అలాగే ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయులూ తగ్గుతాయి. ఇది శరీరంలో వాపు, ఒంటి నొప్పులు, ఇతర మానసిక సమస్యల్ని దూరం చేస్తుంది. ఇక సుఖంగా నిద్రపోతాం కాబట్టి రోగనిరోధక శక్తీ పెరుగుతుంది.
❀ ఇలా రాత్రుళ్లు సుఖంగా నిద్రపోవడం వల్ల ఒక కచ్చితమైన నిద్ర సమయాల్ని మెయింటెయిన్ చేయచ్చు. ఇది ఆరోగ్యకరం కూడా! అలాగే కలిసి నిద్రలోకి జారుకునే ముందు ఇద్దరూ కలిసి కాసేపు సమయం కూడా గడపచ్చు. ఇది ఇద్దరి మధ్య అనుబంధాన్ని దృఢం చేస్తుందంటున్నారు నిపుణులు. ఫలితంగా ఎన్నేళ్లైనా సంసార సాగరాన్ని నిత్య నూతనం చేసుకోవచ్చు.
❀ నచ్చిన వారితో కలిసి పడకను పంచుకోవడం వల్ల డోపమైన్, సెరటోనిన్.. వంటి హ్యాపీ హార్మోన్లు అధికంగా ఉత్పత్తవుతాయట! తద్వారా అలసట, నీరసం తగ్గి శరీరంలో శక్తిస్థాయులు పెరుగుతాయి.
❀ ఒంటరిగా పడుకుంటే ఏవేవో అనవసర ఆలోచనలతో నిద్ర సరిగ్గా పట్టదు. అదే భాగస్వామితో కలిసి పడుకుంటే.. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకోవచ్చు. ఇది ఒత్తిడి, ఆందోళనలు, ఇతర మానసిక సమస్యలను దూరం చేస్తుంది.
❀ భాగస్వామిని దగ్గరగా హత్తుకొని పడుకోవడం వల్ల వాతావరణం ఎంత చల్లగా ఉన్నా.. ఆ వెచ్చదనానికి మరింత త్వరగా, సుఖంగా నిద్రలోకి జారుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
❀ భాగస్వామితో కలిసి నిద్ర పోవడం వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయులు పెరుగుతాయట! ఫలితంగా ఇవి గాఢ నిద్రకు ప్రేరేపిస్తాయని పలు అధ్యయనాలు రుజువు చేశాయి.
❀ ఇలా సుఖంగా నిద్రపోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా.. అందం ఇనుమడిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.