‘స్కిన్‌ ఫ్లడింగ్’.. చర్మానికి ఎందుకు మంచిదో తెలుసా?

చర్మం పొడిబారడం.. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సౌందర్య సమస్య ఇది. ఒక్క పొడి చర్మమే కాదు.. దాదాపు అన్ని చర్మతత్వాలదీ ఇదే పరిస్థితి! వాతావరణ కాలుష్యం, వాడే సౌందర్య సాధనాల్లోని రసాయనాలు, తీసుకునే సౌందర్య చికిత్సలు, వయసు పైబడడం.. ఇలా కారణమేదైనా ఇది దీర్ఘకాలంలో ఎగ్జిమా వంటి చర్మ సమస్యలకు దారితీసే అవకాశం ఎక్కువంటున్నారు నిపుణులు.

Published : 12 Aug 2023 12:42 IST

చర్మం పొడిబారడం.. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సౌందర్య సమస్య ఇది. ఒక్క పొడి చర్మమే కాదు.. దాదాపు అన్ని చర్మతత్వాలదీ ఇదే పరిస్థితి! వాతావరణ కాలుష్యం, వాడే సౌందర్య సాధనాల్లోని రసాయనాలు, తీసుకునే సౌందర్య చికిత్సలు, వయసు పైబడడం.. ఇలా కారణమేదైనా ఇది దీర్ఘకాలంలో ఎగ్జిమా వంటి చర్మ సమస్యలకు దారితీసే అవకాశం ఎక్కువంటున్నారు నిపుణులు. పరిస్థితి ఇంతదాకా రాకూడదంటే చర్మానికి తేమనందించడం తప్పనిసరి అని చెబుతున్నారు. ఇందుకోసం ‘స్కిన్‌ ఫ్లడింగ్‌’ ప్రక్రియ చక్కగా ఉపయోగపడుతుందంటున్నారు. మరి, ఇంతకీ ఏంటీ స్కిన్‌ ఫ్లడింగ్‌? చర్మానికి తేమనందించడంలో ఇది ఎలా పనిచేస్తుంది? దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుందాం రండి..

ఏంటీ స్కిన్‌ ఫ్లడింగ్?

శరీరంలో నీటి స్థాయులు తగ్గిపోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతాం. దీని ప్రభావం చర్మం పైనా పడుతుంది. ఇదొక్కటనే కాదు.. అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణ కాలుష్యం, వయసు పెరగడం, మెనోపాజ్‌, సౌందర్య సాధనాల్లో ఉండే రసాయనాలు.. వంటివీ కొంతమందిలో చర్మం పొడిబారేలా చేస్తాయి. అయితే ఇలాంటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగడం, మాయిశ్చరైజర్లు వాడడం.. వంటి చిట్కాలతో చర్మానికి తిరిగి తేమనందిస్తాం. స్కిన్‌ ఫ్లడింగ్‌ కూడా ఇదే ప్రక్రియను పోలి ఉంటుందంటున్నారు నిపుణులు. రసాయనాలు లేని కొన్ని ప్రత్యేకమైన సౌందర్య ఉత్పత్తుల్ని ఒక దాని తర్వాత ఒకటి లేయర్లుగా అప్లై చేస్తూ.. చర్మానికి తేమనందించడమే ఈ పద్ధతి ముఖ్యోద్దేశం అంటున్నారు.

నాలుగంచెల చికిత్స!

స్కిన్‌ ఫ్లడింగ్‌తో చర్మానికి తేమనందించే క్రమంలో నాలుగు దశలుంటాయి.

1. క్లెన్సింగ్ - చర్మ సంరక్షణలో క్లెన్సింగ్‌ ప్రక్రియ తప్పనిసరి! అయితే ఇక్కడ చర్మాన్ని శుభ్రం చేసుకోవడానికి జెంటిల్‌ క్లెన్సర్‌ వాడాల్సి ఉంటుంది. ఫలితంగా చర్మం విడుదల చేసే సహజ నూనెలు తొలగిపోకుండా.. తేమను లాక్‌ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ముఖం శుభ్రం చేసుకునే ఎలాంటి క్లెన్సర్‌ వాడకుండా సాధారణ నీటితో ముఖం కడుక్కోవచ్చు.

2. టోనింగ్ - ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత టవల్‌తో ముఖాన్ని పైపైన అద్దాలి. తద్వారా ముఖంపై కాస్త తేమ అలాగే ఉంటుంది. ఈ సమయంలో టోనర్‌ లేదా ఫేషియల్‌ మిస్ట్‌ని స్ప్రే చేసి.. ముఖమంతా పరచుకునేలా చేయాలి. టోనింగ్‌ ప్రక్రియగా పిలిచే ఇదీ చర్మం తేమను కోల్పోకుండా సంరక్షిస్తుంది.

3. హైడ్రేటింగ్ - ఫేషియల్‌ మిస్ట్‌ అప్లై చేసుకొని చర్మం కాస్త ఆరిపోయాక.. నీటి ఆధారిత సీరమ్‌తో మరోసారి చర్మానికి తేమనందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రెండు మూడు చుక్కల సీరమ్‌ను ముఖానికి అప్లై చేసుకొని.. కాసేపు మృదువుగా రుద్దుకోవాలి. ఇది చర్మపు పొరల్లో నీటి శాతాన్ని లాక్‌ చేసి మృదుత్వాన్ని అందిస్తుంది.

4. మాయిశ్చరైజింగ్ - ఇక ఆఖర్లో మాయిశ్చరైజర్‌ను చర్మానికి రాసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం షియా బటర్‌, విటమిన్‌ ఇ.. వంటి పదార్థాలతో తయారుచేసిన మాయిశ్చరైజర్లు వాడచ్చు.. లేదంటే కొబ్బరి నూనె, ఓట్‌మీల్‌-తేనె మాస్క్‌, ఆలివ్‌ నూనె.. వంటి సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగించచ్చు. ఇవీ చర్మంలోని తేమను లాక్‌ చేసి పొడిబారకుండా చేస్తాయి.

అయితే పొడి, సున్నితమైన చర్మం ఉన్న వారు.. రోజూ రాత్రి పూట ఈ సౌందర్య పద్ధతిని పాటించడం మంచిదంటున్నారు నిపుణులు. ఇక జిడ్డు, సాధారణ చర్మతత్వం గల వారు వారానికోసారి ఈ పద్ధతి పాటిస్తే సరిపోతుందంటున్నారు. అయితే ఈ సౌందర్య ప్రక్రియ పూర్తయిన తర్వాత బయటికి వెళ్లాలనుకునే వారు.. SPF 30 విలువ గల మాయిశ్చరైజర్‌ తప్పకుండా రాసుకోవాలని సూచిస్తున్నారు.

చర్మ ఆరోగ్యానికీ!

వివిధ కారణాల రీత్యా చర్మం కోల్పోయిన తేమను తిరిగి పొందేలా చేయడంలో స్కిన్‌ ఫ్లడింగ్ ప్రక్రియ సమర్థంగా పనిచేస్తుంది. తద్వారా చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.

కొంతమందికి చిన్న వయసులోనే చర్మంపై ముడతలు, గీతలు ఏర్పడి.. చూడ్డానికి పెద్ద వాళ్లలా కనిపిస్తుంటారు. ఇలాంటి వృద్ధాప్య ఛాయలు దూరం చేయడంలోనూ ఈ సౌందర్య పద్ధతి చక్కగా పని చేస్తుందంటున్నారు నిపుణులు.

పొడి వాతావరణం, అతిగా ముఖం శుభ్రం చేసుకోవడం, అలర్జీ, డయాబెటిస్‌, మూత్రపిండ సమస్యలు.. వంటి కారణాల వల్ల కొంతమంది చర్మం పదే పదే పొడిబారిపోతుంటుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టి చర్మాన్ని నిరంతరాయంగా తేమగా ఉంచడానికి స్కిన్‌ ఫ్లడింగ్‌ తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. ఫలితంగా చర్మం నవయవ్వనంగా కనిపిస్తుంది.

పగటి పూట కంటే రాత్రి పూట నిద్రించే సమయంలో మన చర్మం ఎక్కువ తేమను కోల్పోతుందట! ఈ సమయంలో చర్మం ఉష్ణోగ్రత పెరగడమే ఇందుకు కారణం. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికీ స్కిన్‌ ఫ్లడింగ్‌ మంచి పరిష్కారం అంటున్నారు నిపుణులు.

కొంతమందిలో చర్మంపై అక్కడక్కడా నల్ల మచ్చలుంటాయి. స్కిన్‌ ఫ్లడింగ్‌ ప్రక్రియ ఈ సమస్యనూ దూరం చేస్తుంటున్నారు నిపుణులు. చర్మంలో తేమ నిలిచి ఉండడం వల్ల ముఖ ఛాయ పెరుగుతుంది.

గమనిక : స్కిన్‌ ఫ్లడింగ్‌ ప్రక్రియతో చర్మం తేమను సంతరించుకోవడం మంచిదే అయినా.. ఈ క్రమంలో వాడే హైడ్రేటింగ్‌ ఉత్పత్తుల వల్ల కొంతమందిలో మొటిమలొచ్చే అవకాశాలూ ఉన్నాయంటున్నారు నిపుణులు. కాబట్టి ముందుగా చర్మ సంబంధిత నిపుణుల సలహా తీసుకొని ఆపై.. వారి సూచనల మేరకు ఈ ప్రక్రియను ఫాలో అయితే మరింత మెరుగైన ఫలితాలు పొందచ్చంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని