అక్కడ అమ్మలకెంతో ప్రాధాన్యం!

అమ్మవడమనేది పెద్ద బాధ్యత. అయితే అన్ని అంశాలూ అనుకూలంగా ఉంటే ఈ బాధ్యతలను మరింత సమర్థంగా, ఆనందకరంగా నిర్వర్తించచ్చు కదూ. ఈ క్రమంలో గర్భిణులు, తల్లులు, పిల్లల గురించి శ్రద్ధ వహిస్తూ.. వారి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చేలా.....

Published : 07 May 2022 18:34 IST

అమ్మవడమనేది పెద్ద బాధ్యత. అయితే అన్ని అంశాలూ అనుకూలంగా ఉంటే ఈ బాధ్యతలను మరింత సమర్థంగా, ఆనందకరంగా నిర్వర్తించచ్చు కదూ. ఈ క్రమంలో గర్భిణులు, తల్లులు, పిల్లల గురించి శ్రద్ధ వహిస్తూ.. వారి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చేలా చేసేందుకు అనేక దేశాలు ఎన్నో రకాల సదుపాయాలను కల్పిస్తున్నాయి. అలాంటి కొన్ని దేశాల గురించి తెలుసుకుందాం...

నార్వే

తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రపంచంలోనే ముందున్న దేశం నార్వే. ఇక్కడ శిశు మరణాల రేటు వెయ్యికి రెండు కంటే తక్కువగానే ఉంది. ఇక మాతృ మరణాల రేటైతే ప్రతి లక్ష మందికి రెండుగా ఉంది. అన్ని ఆరోగ్య సూచికల్లోనూ నార్వే మంచి స్థానాన్ని సాధించింది. అలాగే ఇక్కడ తల్లి కాబోయే మహిళలకు 49 వారాల పాటు మెటర్నిటీ లీవ్‌ని మంజూరు చేస్తారు. వంద శాతం జీతంతో ఈ సెలవులను తీసుకోవచ్చు. అంతేకాదు.. నార్వేలో పిల్లలందరూ మంచి విద్య, ఆరోగ్యం పొందగలుగుతారు. ఎందుకంటే పిల్లలందరికీ వీటిని అక్కడి ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.

ఫిన్లాండ్‌

ఫిన్లాండ్ పార్లమెంట్‌లో 45 శాతం మంది మహిళలే. అందుకేనేమో ఆ దేశంలో మహిళలకు ఎంతో స్వేచ్ఛను కల్పిస్తారు. ఆ దేశంలో పుట్టే ప్రతి పాపాయి తల్లికి ప్రభుత్వం మెటర్నిటీ కేర్ కిట్‌ని అందజేస్తుంది. దీనివల్ల అక్కడి పిల్లలకు చక్కటి ఆరోగ్యం అందుతోందట. అందుకే ఫిన్లాండ్ మాతృత్వానికి అనువైన దేశాల్లో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ కూడా మాతృ, శిశు మరణాల రేటు తక్కువగానే ఉంది. ఇకపోతే ఇక్కడ ఉద్యోగం చేసే తల్లులకు 105 రోజులకు మెటర్నటీ అలవెన్స్ ఇస్తుంటారు.

ఐస్‌ల్యాండ్

ఐస్‌ల్యాండ్‌లో ప్రభుత్వం కుటుంబ వ్యవస్థ గురించి ఎక్కువ జాగ్రత్త తీసుకుంటుంది. అక్కడి తల్లులు తమ పిల్లల గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరమేమీ ఉండదు. ఎందుకంటే అక్కడి కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టమైంది కాబట్టి పిల్లలను పెద్దవారు దగ్గరుండి చూసుకుంటారు. అంతేకాదు.. ప్రీస్కూల్స్‌కి చాలా తక్కువ ఖర్చుతో పంపే అవకాశం ఉండడంతో పిల్లల గురించి తల్లులు హైరానా పడరు. ఇక ఇక్కడి లీవ్స్‌ విషయానికొస్తే.. తల్లిదండ్రులిద్దరికీ కలిపి 12 నెలల పాటు పేరెంటల్ లీవ్స్‌ ఇస్తుంటారు. అయితే ఇందులో ఒకరి సెలవులను మరొకరికి బదలాయించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు తల్లి 7 నెలలు లీవ్‌ తీసుకుంటే తండ్రి 5 నెలలు తీసుకోవచ్చు.

డెన్మార్క్

డెన్మార్క్‌లో పిల్లలున్న ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ అలవెన్స్ అందుతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం తల్లికి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. పిల్లల అవసరాలన్నీ తీర్చేందుకు గాను తల్లికి దీన్ని ప్రతి మూడు నెలలకోసారి అందిస్తుంది. వీటితో పాటు చైల్డ్ కేర్ అలవెన్స్, స్పెషల్ చైల్డ్ అలవెన్స్, సబ్సిడీలు ఇలా ఎన్నో అందిస్తుంది ఇక్కడి ప్రభుత్వం. ఇవన్నీ పిల్లల వయసును బట్టి కొనసాగుతాయి. గరిష్ఠంగా వారికి ఇరవయ్యేళ్లు వచ్చే వరకు ఈ అలవెన్సులను అందిస్తారు. ఇక్కడ పేరెంటల్ లీవ్ కూడా మొత్తంగా 46 వారాలుండడంతో పిల్లల సంరక్షణ కోసం తల్లులు ఎక్కువ సెలవులు తీసుకోవచ్చు.

స్వీడన్

గర్భం ధరించిన వారికి కూడా ప్రత్యేక ప్రయోజనాలు అందించే దేశం బహుశా స్వీడన్ ఒక్కటేనేమో.. ఇక్కడ గర్భిణులకు ఇచ్చే సాధారణ బెనిఫిట్స్ కాకుండా కష్టతరమైన పని చేసేవారికి మరిన్ని సదుపాయాలను కల్పిస్తుంది ప్రభుత్వం. ఇక్కడ మహిళలు 390 రోజుల పాటు ప్రసూతి సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలకు విద్య, ఆరోగ్యం రెండూ ఉచితం. అంతేకాదు.. ప్రభుత్వం పిల్లల కోసం నెలవారీ అలవెన్సులను కూడా అందిస్తుంది. చంటి పిల్లలతో ఉన్నవారు ఇక్కడ బస్సులు, రైళ్లలో ఉచితంగా ప్రయాణించే వీలుంటుంది. పిల్లలు అనారోగ్యం పాలైతే వారిని జాగ్రత్తగా చూసుకునేందుకు తల్లులు చైల్డ్‌కేర్ లీవులు కూడా తీసుకోవచ్చు. పిల్లలకు 12 సంవత్సరాలు వచ్చే వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత మెడికల్ సర్టిఫికెట్ ఉంటే సెలవు మంజూరు చేస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్