Published : 11/12/2022 10:58 IST

ఆస్తమా.. ఆహారం పైనా..!

ఆరోగ్యపరంగా మనిషిని కుంగదీసే సమస్యల్లో ‘ఆస్తమా’ (ఉబ్బసం) ఒకటి. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడమనేది మనం తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. స్థూలకాయం ఎన్నో అనారోగ్యాలకు ఆలవాలం. అయితే ఇది ఆస్తమాకూ కారణమవుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. అందులోనూ స్థూలకాయం ఉన్న వారిలో ఆస్తమాకు చికిత్స చేయడం కూడా కష్టమంటున్నారు నిపుణులు. కాబట్టి బరువు అదుపులో ఉంచుకుంటూ, పోషకాహారం తీసుకోవడం పైన దృష్టి పెట్టాలంటున్నారు.

ఇవి చేర్చుకోవాలి!

⚛ క్యారట్స్‌, చిలగడదుంపలు, ఆకుకూరలు.. వంటి పదార్థాల్లో విటమిన్‌ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది. ఇది శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ఉబ్బసంతో బాధపడే వారు రోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు.

⚛ విటమిన్‌ ‘డి’ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి విముక్తి పొందచ్చు. ఈక్రమంలో పాలు, గుడ్లు, సాల్మన్ చేపలు.. వంటివి తీసుకోవాలి.

⚛ పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే అరటిపండ్లు కూడా ఆస్తమా బాధితులకు మేలు చేస్తాయి.

⚛ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని, వాటి పనితీరును మెరుగుపరచడంలో యాపిల్ కూడా మంచి పని చేస్తుందంటున్నారు నిపుణులు.

⚛ ఆస్తమా రోగులకు ఉపశమనం కలిగించడంలో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో ఈ ఖనిజం ఎక్కువగా లభించే గుమ్మడి గింజలు, సాల్మన్ చేపలు, డార్క్‌ చాక్లెట్‌.. వంటివి తీసుకోవచ్చు.

వీటికి దూరంగా..

⚛ ఆస్తమాతో బాధపడుతున్న వారు కడుపులో గ్యాస్‌ని ఉత్పత్తి చేసే క్యాబేజీ, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మసాలాలు, కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌.. వంటి వాటికి దూరంగా ఉండాలి.

⚛ ప్రాసెస్‌ చేసిన పదార్థాలు, ప్యాకింగ్‌ చేసిన ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి, రుచి, వాసన కోసం సల్ఫైట్‌ వంటి రసాయనాలు వాడతారు. వీటివల్ల శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి.

⚛ కొన్ని రకాల మూలికలు, మసాలాలు కొంతమంది ఉబ్బసం రోగులకు పడకపోవచ్చు. ఇలాంటివాళ్లు వీటికి దూరంగా ఉండడం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని