Updated : 20/07/2021 18:14 IST

తిండి లేక కేవలం ఉప్పు, రోటీలతోనే సరిపెట్టుకునేవాళ్లం..!

భారతీ సింగ్‌... బుల్లితెర ‘కామెడీ క్వీన్‌’గా మనందరికీ బాగా తెలిసిన పేరు. సందర్భానికి తగ్గట్టుగా కామెడీ పంచులు వేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించడంలో ఆమె సిద్ధహస్తురాలు. ‘ద గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌’, ‘కామెడీ సర్కస్‌’, ‘ద కపిల్‌ శర్మ షో’ తదితర టీవీ షోలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ లాఫ్టర్‌ క్వీన్.

ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి!

అయితే ఎప్పుడూ నవ్వుతూ, పక్కవారికి ఆనందం పంచే ఈ కమెడియన్‌ వెనక ఎవరికీ కనిపించని కన్నీళ్లు కూడా ఉన్నాయట. తన రెండేళ్ల వయసున్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఆర్థిక సమస్యలు తన కుటుంబాన్ని చుట్టుముట్టాయంటోందీ కామెడీ క్వీన్‌. ఈ నేపథ్యంలో పొట్టకూటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడ్డామంటూ ఇటీవల ఓ సందర్భంలో తన కన్నీటి గాథను పంచుకుంది.

పరాఠాలతోనే కడుపు నింపుకొనేవాళ్లం!

‘నా రెండేళ్ల వయసులోనే నాన్న చనిపోయారు. నేను ఆయన ముఖాన్ని కూడా సరిగా చూడలేకపోయాను. దీంతో నాకు అమ్మ, అక్కే ఆధారమయ్యారు. వారు ఓ గార్మెంట్‌ ఫ్యాక్టరీలో దుప్పట్లు కుట్టే పనికి చేరారు. ఆ జీతంతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. దీంతో పాటు అమ్మ ఇతరుల ఇళ్లలో వంట పనులకు కూడా వెళ్లేది. ఆ సమయంలో మేం బ్లాక్‌ టీ, పరాఠాలతోనే కడుపు నింపుకొనేవాళ్లం. కొన్నిసార్లయితే కేవలం రోటీలు, ఉప్పుతోనే సరిపెట్టుకునేవాళ్లం’..

21 ఏళ్ల పాటు!

‘ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వచ్చాక కూడా అమ్మ, అక్క దుప్పట్లు కుట్టే పనుల్లో నిమగ్నమయ్యేవారు. ఆ సమయంలో కుట్టు మిషన్ల నుంచి పెద్ద ఎత్తున శబ్దం వెలువడేది. ఒకటి కాదు...రెండు కాదు సుమారు 21 ఏళ్ల పాటు నేను ఆ కుట్టు మిషన్ల శబ్దాల మధ్యనే గడిపాను. జీవితంలో మళ్లీ ఆ దీన పరిస్థితి రాకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’.

అమ్మను అసభ్యంగా తాకేవారు!

‘ఇక మాకు అప్పిచ్చిన వాళ్లు అమ్మతో ఎంతో నీచంగా ప్రవర్తించేవారు. ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వచ్చేవారు. కొందరు అమ్మ చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించేవారు. మరికొందరు ఆమె భుజంపై చేతులు వేసేవారు. ‘నాకు భర్త లేడు...చిన్న పిల్లలున్నారు.. మీకు సిగ్గుగా అనిపించడం లేదా?.. ఇంత నీచంగా ప్రవర్తిస్తారా?’ అని అమ్మ వారితో తగవులాడేది. అయితే వాళ్లు అమ్మతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చిన్న పిల్లలమైన మాకు అప్పుడు అర్థమయ్యేది కాదు.’

ఆ కూపన్లు దాచి పండ్లు కొనేదాన్ని!

‘నాకు షూటింగ్‌, ఆర్చరీలోనూ ప్రావీణ్యముంది. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు జాతీయ స్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లోనూ పాల్గొన్నాను. సాధారణంగా అథ్లెట్లు సన్నగా, నాజూగ్గా ఉంటారు. కానీ 12 ఏళ్ల వయసులో ఎంతో బొద్దుగా ఉన్నప్పటికీ షూటింగ్‌ పోటీల్లో పాల్గొన్నాను. అందుకే కొందరు స్నేహితులు అప్పుడప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తుంటే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక షూటింగ్ శిక్షణ సమయంలో ప్రభుత్వం మాకు ఉచితంగా ఆహార వసతి కల్పించేది. ఇందులో భాగంగా 5 రూపాయల కూపన్లను రోజుకు మూడు చొప్పున అందించేది. అయితే నేను మాత్రం రోజూ ఒక కూపన్‌ మాత్రమే వినియోగించుకునేదాన్ని. దాని ద్వారా వచ్చిన గ్లాస్‌ జ్యూస్‌ తాగి గంటల పాటు షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేసేదాన్ని. దాచిపెట్టుకున్న కూపన్లతో నెలాఖరులో ఇంటికి పండ్లను తీసుకెళ్లేదాన్ని’ అని అప్పటి అనుభవాలను గుది గుచ్చిందీ బుల్లితెర బ్యూటీ.

అదే నా ప్రార్థన!

‘ది కపిల్‌ శర్మ షో’ ద్వారా తన పాపులారిటీని మరింత పెంచుకున్న భారతి ప్రస్తుతం ఈ షో తర్వాతి సీజన్‌ కోసం సిద్ధమవుతోంది. ‘ఇప్పటికీ నాకు పెద్దగా కోరికలేమీ లేవు. అయితే ఇప్పటివరకు నేను సంపాదించుకున్నవేవీ దూరం కాకూడదని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇప్పటికీ మేమంతా సాధారణ జీవితమే గడుపుతున్నాం. రోటీల్లోకి ఉప్పు బదులు కూరగాయలు, పప్పులు వాడుతున్నాం. ఇప్పటికీ కూరగాయలు కొనడానికి వెళ్లినప్పుడు కాస్త కొత్తిమీర ఎక్కువగా వస్తే అమ్మ ఎంతో సంతోషిస్తుంది’ అని చెప్పుకొచ్చిందీ కామెడీ క్వీన్.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి