పోలియోను ఓడించి.. తను గెలిచింది!
పన్నెండు నెలల ప్రాయంలోనే పోలియో...శస్త్రచికిత్సకు వెళ్లినా విఫలం...నవ్వుతూ గెంతులేయాల్సిన వయసులో వీల్‌చైర్‌కే పరిమితం... ఇలా బాల్యంలోనే సుడిగుండాల్లాంటి సమస్యలను ఎన్నో ఎదుర్కొంది భవీనా. అయినా టేబుల్ టెన్నిస్‌పై ప్రేమను పెంచుకుని దానినే కెరీర్‌గా మల్చుకుంది. అద్భుత ప్రదర్శనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. తాజాగా టోక్యో పారాలింపిక్స్‌లోనూ భారత్‌కు మొదటి పతకాన్ని ఖాయం చేసింది.
పన్నెండు నెలల ప్రాయంలోనే పోలియో...శస్త్రచికిత్సకు వెళ్లినా విఫలం... నవ్వుతూ గెంతులేయాల్సిన వయసులో వీల్‌చైర్‌కే పరిమితం... ఇలా బాల్యంలోనే సుడిగుండాల్లాంటి సమస్యలను ఎన్నో ఎదుర్కొంది భవీనా. అయినా టేబుల్ టెన్నిస్‌పై ప్రేమను పెంచుకుని దానినే కెరీర్‌గా మల్చుకుంది. అద్భుత ప్రదర్శనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. తాజాగా టోక్యో పారాలింపిక్స్‌లోనూ భారత్‌కు మొదటి పతకాన్ని ఖాయం చేసింది.
ఫైనల్‌కు చేరుకుని!
టోక్యోలో మళ్లీ మన త్రివర్ణ పతాకం రెపరెపలాడనుంది. పారాలింపిక్స్ మహిళల సింగిల్స్ క్లాస్-4 టేబుల్ టెన్నిస్ విభాగంలో 34 ఏళ్ల భవీనా బెన్ పటేల్ ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. మొదటి రౌండ్ మ్యాచ్‌లోనే ఓటమిపాలైన ఆమె నిరాశపడకుండా తన పోరాటపటిమను కొనసాగించింది. తనకంటే మెరుగైన ర్యాంకింగ్స్ ఉన్న ప్రత్యర్థులను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో కనీసం రజత పతకం మన ఖాతాలో చేరినట్లయింది. ఆదివారం జరిగే పసిడి పోరులో వరల్డ్ నంబర్ వన్ వింగ్ ఝౌతో తలపడనుంది భవీనా.
మొదటి భారతీయ క్రీడాకారిణిగా!
జాతీయ, అంతర్జాతీయ టీటీ పోటీల్లో ఎన్నో పతకాలు సాధించిన భవీనా 2016 రియో పారాలింపిక్స్‌కు కూడా ఎంపికైంది. అయితే కొన్ని సాంకేతిక కారణాలు ఆమెను పోటీలకు దూరం చేశాయి. అలా 5 ఏళ్ల క్రితం కోల్పోయిన పతకాన్ని తాజాగా టోక్యో వేదికగా ఒడిసి పట్టుకుందీ పారా అథ్లెట్. తద్వారా పారాలింపిక్స్ టీటీలో భారత్‌కు మొదటి పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
పోలియోను ఓడించి..!
గుజరాత్‌లోని సుంధియా గ్రామానికి చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది భవీనా. దురదృష్టవశాత్తూ 12 నెలల ప్రాయంలోనే పోలియో బారిన పడింది. ఆర్థిక సమస్యల కారణంగా తండ్రి ఆమెకు వెంటనే చికిత్స చేయించలేకపోయాడు. ఎన్నో ఆపసోపాలు పడి విశాఖపట్నం తీసుకువచ్చి శస్త్రచికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. క్రమంగా భవీనా నడుము కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితమైంది. ఈ క్రమంలో వీల్‌చైర్‌లో ఉంటూనే తన గ్రామంలోని పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది. 2004లో భవీనా తండ్రి అహ్మదాబాద్ బ్లైండ్ పీపుల్స్ అసోసియేషన్‌లో ఆమెకు సభ్యత్వం ఇప్పించాడు. అక్కడ చదువుకుంటూనే ఫిట్‌నెస్ కోసం సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడడం మొదలుపెట్టింది. క్రమంగా ఆ ఆటనే కెరీర్‌గా మల్చుకుంది.
నేషనల్ ఛాంపియన్‌గా ఎదిగి!
కోచ్ లలన్ జోషి పర్యవేక్షణలో మూడేళ్ల పాటు తీవ్రంగా కష్టపడిన భవీనా నేషనల్ ఛాంపియన్‌గా ఎదిగింది. ఆ తర్వాత 2011లో థాయిలాండ్ పారా టేబుల్ టెన్నిస్ ఓపెన్‌లో చైనా అగ్రశ్రేణి క్రీడాకారులను ఓడించి వెండి పతకం సాధించింది. అప్పటి నుంచి ఆమెకు తిరుగులేకుండా పోయింది. 2013 ఏషియన్ రీజనల్ ఛాంపియన్‌షిప్‌లో వెండి పతకం, జోర్డాన్, తైవాన్, చైనా, దక్షిణ కొరియా, జర్మనీ, ఇండోనేషియా, స్లోవేనియా, థాయిలాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, ఈజిఫ్ట్ తదితర దేశాల్లో జరిగిన టోర్నీల్లో లెక్కలేనన్ని పతకాలు గెల్చుకుంది. రియో ఒలింపిక్స్‌లో దురదృష్టం వెక్కిరించినా 2018 ఏషియన్ పారా గేమ్స్‌లో డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించింది. 2019 థాయిలాండ్ ఇంటర్నేషనల్ పారా టీటీ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకం గెల్చుకుంది.
లాక్‌డౌన్‌లో రోబోతో ప్రాక్టీస్!
కరోనా కారణంగా గతేడాది పెద్దగా టోర్నమెంట్లలో ఆడలేకపోయింది భవీనా. పూర్తిగా ఇంటికే పరిమితమైంది. అయితే లాక్‌డౌన్‌లో ఆటపై పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఆమె ఏకంగా రోబోతో సాధన చేయడం విశేషం. భర్త నికుల్ పటేల్ దగ్గరుండి మరీ ఆమెకు అవసరమైన సహాయ సహకారాలు అందించాడు.
‘భవీనా కోసం రూ.50 వేలు పెట్టి సెకండ్ హ్యాండ్ రోబోను కొన్నాం. టీటీ ప్రాక్టీస్‌కు అనుగుణంగా దానికి మరికొన్ని మార్పులు చేశాం. లాక్‌డౌన్‌లో ఈ రోబోనే మాకు వరంలా కనిపించింది. దీని సహాయంతోనే నా భార్య రోజు కనీసం 8 నుంచి 12 గంటల పాటు టీటీ ప్రాక్టీస్ చేసింది. ఆమె కష్టానికి తగ్గ ప్రతిఫలం పారాలింపిక్స్ పతక రూపంలో దక్కింది’ అని చెప్పుకొచ్చాడు నికుల్.
ఆల్ ది బెస్ట్ భవీనా!
ఆదివారం జరిగే పసిడి పోరు కోసం భవీనాతో పాటు యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె బంగారు పతకంతో తిరిగిరావాలని ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ట్వీట్లు పెడుతున్నారు. ‘కంగ్రాట్స్ భవీనా! అద్భుతంగా ఆడావు. రేపటి మీ విజయం కోసం యావత్ దేశం ప్రార్థిస్తోంది. మీ విజయాలు దేశ ప్రజలందరికీ స్ఫూర్తినిస్తాయి’ అంటూ ట్విట్టర్ వేదికగా భవీనాకు సందేశం పంపించారు మోదీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.