Updated : 14/01/2023 17:55 IST

ఎంబ్రాయిడరీ.. ఆమె వ్యాపార మంత్రం!

ఓ పెళ్లికెళ్లాలంటే.. భారీగా డిజైన్‌ చేసిన డిజైనర్ శారీ ధరించాలనిపిస్తుంది..

తమ ప్రేమకావ్యాన్ని అందమైన దృశ్యకావ్యంగా తమ దుస్తులపై తీర్చిదిద్దుకోవడానికి ప్రేమికులు పడే ఆరాటం అంతా ఇంతా కాదు.

సెలబ్రిటీల ఫ్యాషనబుల్‌ డిజైన్లను ఫాలో అవుతూ నలుగురిలోనూ ప్రత్యేకంగా మెరిసిపోవాలనుకుంటారు మరికొంతమంది.. అందులోనూ ‘మనసు దోచుకునే ఎంబ్రాయిడరీ డిజైన్లంటే మహిళలందరికీ మక్కువే.. అయితే ఒక్కోసారి ఇవి బాగా ఖర్చుతో కూడుకుని ఉంటాయి. ఈక్రమంలో మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసే అలాంటి యంత్రమేదో మన దగ్గరే ఉంటే..?’ అనుకునే సందర్భాలు ఎన్నో ఉంటాయి.

ఇలాంటి ఎందరో అతివల మనసును చదివారు హైదరాబాద్‌కు చెందిన గుమ్మడి భవ్య. వ్యక్తిగత అభిరుచిని బట్టి ఎలాంటి ఎంబ్రాయిడరీ డిజైన్‌ అయినా గంటల్లో డిజైన్‌ చేసుకునేందుకు వీలుగా ఉండే పూర్తి స్థాయి ఆటోమేటిక్‌గా నడిచే ‘రోబోటిక్‌ ఎంబ్రాయిడరీ మెషీన్స్‌’ విక్రయించే వ్యాపారం ప్రారంభించారామె. అందుబాటు ధరల్లో ఈ పరికరాల్ని విక్రయిస్తూనే.. ఎంబ్రాయిడరీ శిక్షణతో ఎంతోమంది మహిళల్ని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతోన్న భవ్య.. తన బిజినెస్ జర్నీని ‘వసుంధర.నెట్‌’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

మాది హైదరాబాద్.. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక ఉన్నతోద్యోగంలో స్థిరపడ్డాను. ఐటీ రంగంలో ఎనిమిదేళ్లు పనిచేశా. చక్కటి జీతం, టెన్షన్‌ లేని ఉద్యోగం.. తొలుత ఇవి చాలనిపించేది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఈ రొటీన్‌ లైఫ్‌స్టైల్‌ బోరింగ్‌గా అనిపించేది. ఉద్యోగానికి తోడు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. అది కూడా ఎప్పటికీ స్థిరంగా కొనసాగే బిజినెస్‌ చేయాలనిపించింది.

ఆ ఆలోచనతోనే..!

ఒక మహిళే మరో మహిళను ముందుకు నడిపించగలదన్న సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తిని నేను. అందుకే నా వ్యాపారంతో మరింతమంది మహిళల్ని స్వయం ఉపాధి దిశగా నడిపించాలనుకున్నా. ఈ క్రమంలోనే మహిళలకు బాగా సుపరిచితమైన కుట్లు, అల్లికలు గుర్తొచ్చాయి. వీటికి విద్యతో సంబంధం లేదు. ఎవరైనా అటు ఇంటి పనులు చేసుకుంటూనే.. ఇటు వ్యాపారాన్నీ నిర్వహించుకోవచ్చనిపించింది. అయితే దీని గురించి మావారితో చర్చించి.. ఈ ఆలోచనను యథావిధిగా కాకుండా.. ఎంబ్రాయిడరీ మెషీన్స్‌ రూపంలో తీసుకురావాలనుకున్నా. అదీ కంప్యూటర్‌ టెక్నాలజీ సహాయంతో, పూర్తి స్థాయి ఆటోమేటిక్‌గా నడిచే యంత్రాల్ని అందుబాటు ధరల్లోనే వినియోగదారులకు చేరువ చేయాలనుకున్నా. ఈ మేథోమథనమే 2017లో ‘ఎంటీసీ (మల్టీ నేషనల్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌) ఎంబ్రాయిడరీ మెషీన్స్‌’ సంస్థకు తెరతీసింది. చైనా, జర్మనీ, జపాన్‌.. వంటి దేశాల్లో ఎంబ్రాయిడరీ మెషీన్స్‌ని తయారుచేసే సంస్థలతో టై అప్‌ అయ్యి.. వీటిని దిగుమతి చేసుకొని తక్కువ ధరకు వినియోగదారులకు అందించడమే మా సంస్థ ముఖ్యోద్దేశం. తద్వారా మరింతమంది మహిళల్ని సాధికారత దిశగా నడిపించాలన్న ఆలోచన, ఆచరణతోనే గత ఆరేళ్లుగా ముందుకు సాగుతున్నాం.

నాలుగు దశల్లో..!

ఈ మెషీన్స్‌ కోసం వినియోగదారులు సులభంగా వాడేలా యూజర్‌ ఫ్రెండ్లీ సాఫ్ట్‌వేర్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేయించుకున్నాం. మా మెషీన్స్‌ సహాయంతో నాలుగంటే నాలుగే దశల్లో ఎంత భారీ ఎంబ్రాయిడరీ డిజైన్‌ అయినా సులభంగా, అదీ తక్కువ సమయంలో వేసేసుకోవచ్చు. ముందుగా ఫ్రేమ్‌ పరిమాణాన్ని బట్టి (16×24, 20×32, 20×48) క్లాత్‌ను సెట్‌ చేసుకోవాలి. ఆపై డిజైన్‌ను ఎంచుకోవడం, సైజును బట్టి చిన్నగా/పెద్దగా/ఒకే డిజైన్‌ ఎక్కువసార్లు వచ్చేలా.. డిజైన్‌ను ఎడిట్‌ చేసుకోవడం, కలర్‌ కాంబినేషన్స్‌ ఎంచుకోవడం, క్లాత్‌పై మార్కింగ్‌ పెట్టిన ఫ్రేమ్‌లో డిజైన్‌ వచ్చేలా మెషీన్‌ని సెట్‌ చేసుకోవడం.. ఇలా ఈ నాలుగు దశలు పూర్తయ్యాక.. స్టార్ట్‌ బటన్‌ ప్రెస్‌ చేస్తే చాలు.. మన ప్రమేయం లేకుండా మెషీన్‌ దానంతటదే కుట్టేస్తుంది. ఒకవేళ మధ్యలో దారం తెగినా, ఇతర సమస్యలేవైనా వచ్చినా.. బీప్‌ సౌండ్‌ వస్తుంది. మనం చెక్‌ చేసుకొని తిరిగి దారం ఎక్కించడం.. వంటివి చేస్తే తిరిగి కుట్టడం ప్రారంభిస్తుంది. స్టిచ్‌ కౌంట్‌ని బట్టి సాధారణ బ్లౌజులైతే రోజుకు మూడు నాలుగు సులభంగా పూర్తవుతాయి. అదే కాస్త భారీ ఎంబ్రాయిడరీ ఉంటే ఒకటి లేదా రెండు పూర్తి చేసుకోవచ్చు. ఇలా కేవలం బ్లౌజులే కాదు.. కుర్తీస్‌, లెహెంగాలు, చీరలు.. వంటి అన్ని రకాల దుస్తులతో పాటు బ్యాగ్స్‌, చెప్పులు, క్యాప్‌.. వంటి యాక్సెసరీస్‌ దాకా మా మెషీన్స్ ద్వారా కావాల్సిన ఎంబ్రాయిడరీ డిజైన్‌ను నీట్‌గా తీర్చిదిద్దుకోవచ్చు. ఈ మెషీన్స్ ఉపయోగించి నెట్‌, జీన్స్‌, లెదర్‌, సిల్క్‌, కాటన్‌.. ఇలా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్‌పై డిజైన్స్‌ వేసుకోవచ్చు.

మేమూ డిజైన్‌ చేస్తాం!

కంప్యూటర్‌ ఎంబ్రాయిడరీ యంత్రాల్ని విక్రయించడమే కాదు.. ఓ బొతిక్‌ కూడా నిర్వహిస్తున్నా. ఇందులో భాగంగా.. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా కస్టమైజ్‌డ్‌ ప్రిమియర్‌ లెహెంగాలు డిజైన్‌ చేయడం, ఫొటో ఎంబ్రాయిడరీ చేయడం ఎంబ్రాయిడరీ జ్యుయలరీ రూపొందించడం.. వంటివెన్నో మా వద్ద అందుబాటు ధరల్లోనే అందిస్తున్నాం. ఇక పెయింటింగ్‌ ప్యాడ్స్‌, డబుల్‌ సీక్విన్‌.. వంటి కొత్త కొత్త పరికరాలూ అందుబాటులోకి తెస్తున్నాం. మా వద్ద కస్టమైజ్‌డ్‌ మోడల్స్‌ ఎంబ్రాయిడరీ మెషీన్స్‌ ఎక్కువగా దొరుకుతాయి. వినియోగదారుల అవసరాన్ని బట్టి ఆయా మెషీన్స్‌ని ఎంచుకున్నాక.. వాటి పనితీరు గురించి వారికి శిక్షణ ఇస్తాం. అలాగే ఆ మెషీన్స్‌లో సుమారు మూడు వేలకు పైగా డిజైన్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసి.. లాంగ్వేజ్‌ సెట్‌ చేసి.. వారితో ఓసారి ప్రాక్టీస్‌ చేయించాక.. కస్టమర్స్‌కి అందిస్తాం. అంతేకాదు.. సుమారు 500లకు పైగా రంగుల్లో దారాలు, సూదులు, బాబిన్స్‌, బీడ్స్‌, ఫ్యూజన్‌ పేపర్స్‌.. ఇలా ఎంబ్రాయిడరీకి సంబంధించిన సర్వం మా వద్ద లభిస్తాయి. ఇండస్ట్రియల్‌ ప్రొడక్ట్స్‌ పేరుతో.. టెక్స్‌టైల్‌ మెషినరీ, స్టిచ్చింగ్‌, పీకో వర్క్‌కు సంబంధించిన మెషినరీని కూడా సరఫరా చేస్తున్నాం. మా మెషీన్స్‌కి ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందిస్తున్నాం. ఇక మెషీన్స్‌లో సమస్య ఎదురైతే పరిష్కరించడానికి మా వద్ద ప్రత్యేక నిపుణుల బృందం ఉంది.

వచ్చే ఐదేళ్లలో..!

ఇప్పటివరకు సుమారు 500లకు పైగా ఎంబ్రాయిడరీ మెషీన్స్ విక్రయించాం.. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకూ మా సేవల్ని విస్తరించాలనుకుంటున్నాం. వచ్చే ఐదేళ్లలో మరో 5000 మంది మహిళా వ్యాపారవేత్తల్ని తయారుచేయాలని.. లక్ష్యంగా పెట్టుకున్నా. అలాగే పెద్ద పెద్ద స్టోర్స్‌ని తెరిచి మహిళలకు కావాల్సిన ఎంబ్రాయిడరీ మెటీరియల్‌, దుస్తులకు మ్యాచింగ్‌గా ఉండే మెటీరియల్‌, ఇతర యాక్సెసరీస్.. అందుబాటులో ఉంచాలని ఆశిస్తున్నా. వీటికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఎగ్జిబిషన్లలో కూడా పాల్గొన్నాం. పలు అవార్డులూ అందుకున్నాం. ఇక త్వరలోనే ఓ ఫ్యాషన్‌ షో చేయాలన్న యోచన కూడా ఉంది.

రుణానికి తోడ్పాటు!

వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో బ్యాంకు రుణాల విషయంలో పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే వీహబ్‌లో చేరాక.. ఇది సులువైంది. కేవలం ఫండింగ్‌ విషయంలోనే కాదు.. మార్కెటింగ్ నైపుణ్యాలు పెంపొందించుకోవడం, ప్రమోషన్‌లో భాగంగా సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవడం.. వంటి విషయాల్లో అవగాహన పెంచుకునేందుకు ఈ వేదిక ఎంతో తోడ్పడింది. అలాగే ఎంబ్రాయిడరీ వర్క్‌లో ఔత్సాహిక మహిళలకు శిక్షణ ఇచ్చే విషయంలోనూ వీ-హబ్‌ ప్రోత్సహించింది.

కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటికి రండి!

కొత్తగా ఏదైనా చేద్దామనుకుంటే.. ఈ సమాజం మనల్ని వెనక్కి లాగాలని చూస్తుంది. నా విషయంలోనూ ఇలాంటి అనుభవాలెన్నో! కానీ ఎవరేమన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.. కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటికొచ్చి సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం చేయాలి. ఓపికతో ఒడిదొడుకుల్ని ఎదుర్కోవాలి. వినియోగదారుల్ని ఆకట్టుకునే నైపుణ్యాలతో పాటు సమయపాలన పాటించడమూ ముఖ్యమే! ఇక ప్రాధాన్యతల్ని బట్టి పనుల్ని విభజించుకుంటే ఇంటిని, వృత్తిని సులభంగా బ్యాలన్స్‌ చేసుకోగలం. ఇక ప్రతికూల సమయాల్లో సంయమనం పాటించడం ముఖ్యం. నేను నమ్మే సూత్రమిదే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని