Bhumi Pednekar: నా బరువుని అదుపులో ఉంచే సీక్రెట్ ఇదే..!
బ్రేక్‌ఫాస్ట్ అయినా, వర్కవుట్ అయినా.. కాఫీ తర్వాతే అంటోన్న బాలీవుడ్ అందాల తార భూమి పెడ్నేకర్. అందానికి, ఆరోగ్యానికి ఉదయాన్నే తాను పాటించే రొటీన్‌తో పాటు తన ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ని కూడా పంచుకుంది. ఆ విశేషాలన్నీ తన మాటల్లోనే..!
(Photos: Instagram)
ఉదయం నిద్ర లేవగానే ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటుంటుంది. కొంతమంది కాఫీ, టీ తాగందే అడుగు ముందుకు వేయలేరు.. మరికొందరు నేరుగా బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తారు. అయితే తాను మాత్రం కాఫీ కోసమే ఆసక్తిగా నిద్ర లేస్తానంటోంది బాలీవుడ్ అందాల తార భూమి పెడ్నేకర్. ఈ పానీయం తనను ఉత్తేజితం చేయడంతో పాటు రోజంతటికీ కావాల్సిన శక్తినిస్తుందంటూ ఇటీవలే ఓ సందర్భంలో కాఫీపై తనకున్న ఇష్టాన్ని వెలిబుచ్చిందామె. బ్రేక్‌ఫాస్ట్ అయినా, వర్కవుట్ అయినా.. కాఫీ తర్వాతే అంటోన్న ఈ ముద్దుగుమ్మ.. అందానికి, ఆరోగ్యానికి ఉదయాన్నే తాను పాటించే రొటీన్‌తో పాటు తన ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ని కూడా పంచుకుంది. ఆ విశేషాలన్నీ తన మాటల్లోనే..!
ఇది నా స్టైల్ బుల్లెట్ కాఫీ!
ఉదయాన్నే మనం పాటించే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లతోనే ఆ రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం. నా విషయానికొస్తే.. నన్ను రోజంతా యాక్టివ్‌గా ఉంచడంలో కాఫీ ముందుంటుంది. ఎందుకంటే కాఫీ కోసమే ఎంతో ఆసక్తిగా నిద్ర లేస్తుంటా. అయితే నేను ఎంచుకునేది సాధారణ కాఫీ కాదు.. ఆరోగ్యకరమైన బుల్లెట్ కాఫీ. ఆరోగ్యకరమైన పదార్థాలతో నా స్టైల్‌లో దీన్ని తయారుచేసుకొని తాగుతుంటా. వేడి నీళ్లలో.. స్వచ్ఛమైన నెయ్యి, సహజంగా తయారుచేసిన కాఫీ పొడి.. కొద్ది మోతాదుల్లో వేసుకొని, అందులోనే చిటికెడు చొప్పున దాల్చిన చెక్క పొడి, పసుపు.. కలుపుకొని ప్రత్యేకంగా బుల్లెట్ కాఫీ తయారుచేసుకుంటా. ఇది నా బరువును అదుపులో ఉంచడమే కాదు.. ఆహారపు కోరికల్ని తగ్గించి.. అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లకు దూరంగా ఉంచుతుంది.. అలాగే జీవక్రియల పనితీరునూ మెరుగుపరుస్తుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతా. అందుకే ఇంట్లో ఉన్నప్పుడే కాదు.. షూటింగ్స్ కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినా.. కాఫీ ముడి సరుకులన్నీ నా వెంటే పట్టుకెళ్తా.
బ్రేక్‌ఫాస్ట్ మానను!
సినిమా షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా బ్రేక్‌ఫాస్ట్ మాత్రం మానను. ఇది కడుపులో పడితే తప్ప వర్కవుట్లు కూడా చేయలేను. ఈ క్రమంలో పాలలో సెరల్స్ వేసుకొని తీసుకుంటా. ఆపై గోధుమ బ్రెడ్, మూడు కోడిగుడ్ల తెల్లసొనలు తిన్న తర్వాత.. ఏదో ఒక పండు రసం తాగుతా. ఇక మధ్యాహ్నం రోటీ-పప్పన్నం తీసుకున్నా.. రాత్రి మాత్రం సలాడ్స్‌కే ప్రాధాన్యమిస్తా. మూడు పూటలా తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటా. ఎందుకంటే ఇది వర్కవుట్ చేసే శక్తిని అందించడంతో పాటు.. రోజంతా కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.. ఫలితంగా బరువూ అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి అన్నం సరైన ఆహారం కాదనుకుంటారు చాలామంది. కానీ ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు బరువు తగ్గడంలో సహకరించడమే కాదు.. పొట్ట ఆరోగ్యానికీ మంచివి.
ఫిట్‌నెస్ అంటే సైజు కాదు!
బరువు విషయంలో నేను విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు చాలా తక్కువ. నా తొలి చిత్రం ‘దమ్ లగా కే హైసా’ సమయంలో నేను చాలా బొద్దుగా ఉన్నా. అయినా పాత్రకు తగినట్లున్నానంటూ అందరూ నన్ను ప్రశంసించారే తప్ప.. విమర్శించిన వారు చాలా తక్కువ. అయితే ఫిట్‌నెస్ అంటే చాలామంది నాజూగ్గా ఉండడం అనుకుంటారు. నిజానికి నాకు నచ్చని పదం అది. నా దృష్టిలో ఫిట్‌నెస్ అంటే నడుం చుట్టుకొలత కాదు.. కండరాల దృఢత్వం. అందుకే బరువులెత్తే వ్యాయామాలు ఎక్కువగా చేస్తా.. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారానికే అధిక ప్రాధాన్యమిస్తా. బరువు తూచే మెషీన్‌పై పదే పదే బరువు కొలుచుకోవడం నాకు అస్సలు నచ్చదు. మహా అయితే రెండేళ్లకోసారి దీన్ని ఉపయోగిస్తానేమో! షూటింగ్ హడావిడి లేకపోతే.. కార్డియో, పిలాటిస్ సాధన చేస్తా. లేదంటే కనీసం పది నిమిషాలైనా వెచ్చించి.. స్కిప్పింగ్ రోప్ వర్కవుట్ చేస్తా.
ఆ అలవాటు మానుకోలేకపోతున్నా!
ఉదయం నిద్ర లేవగానే చాలామంది చేసే పని.. ఫోన్ చెక్ చేసుకోవడం. ఈ అలవాటు నాకూ ఉంది. నిజానికి దీన్ని మానుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నా.. కానీ నా వల్ల కావట్లేదు. ఒక్కోసారైతే కళ్లు తెరవగానే నా చూపు ఫోన్‌నే వెతుకుతుంటుంది. ఎప్పటికైనా ఈ అలవాటును తగ్గించుకుంటా. పాజిటివ్‌గా నిద్ర లేస్తే.. ఆ రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది.
అందానికి.. ఆ రెండూ!
నా బ్యూటీ రొటీన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. చర్మాన్ని లోలోపలి నుంచి సంరక్షిస్తే.. బయటికి ప్రకాశవంతంగా కనిపించచ్చని నేను నమ్ముతా. అందుకే నీళ్లు ఎక్కువగా తాగుతా. బయటికి వెళ్లిన ప్రతిసారీ సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటా. ఇక షూటింగ్స్ లేకపోతే.. ఉదయం లేవగానే ముఖం శుభ్రం చేసుకోవడానికి ఫేస్‌వాష్ వాడను.. ఎందుకంటే రాత్రంతా చర్మంపై ఉత్పత్తైన సహజసిద్ధమైన నూనెల్ని పూర్తిగా తొలగించకుండా.. కాసేపు అలాగే ఉంచితే చర్మం ప్రకాశవంతంగా మారుతుందనేది నా నమ్మకం. అలాగే షూటింగ్స్ లేనప్పుడు మేకప్‌కు దూరంగా ఉంటా..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.