Spider Girls: ఒకరిని మించి ఒకరు గోడలెక్కేస్తున్నారు!

మృదువుగా ఉన్న గచ్చుపై నడవడానికే ఇబ్బంది పడుతుంటాం. ఎక్కడ జారిపడతామో అని అడుగులో అడుగేస్తాం.. అలాంటిది నిలువుగా ఉండే గోడలు, పిల్లర్లు ఎక్కే సాహసం చేయగలమా? కానీ బిహార్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు ఇలాంటి అరుదైన సాహసమే చేస్తున్నారు. గ్రానైట్‌, మార్బుల్‌తో తయారుచేసిన పిల్లర్లు, గోడల్ని ఎలాంటి ఆధారం లేకుండా......

Published : 16 Mar 2022 20:19 IST

మృదువుగా ఉన్న గచ్చుపై నడవడానికే ఇబ్బంది పడుతుంటాం. ఎక్కడ జారిపడతామో అని అడుగులో అడుగేస్తాం.. అలాంటిది నిలువుగా ఉండే గోడలు, పిల్లర్లు ఎక్కే సాహసం చేయగలమా? కానీ బిహార్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు ఇలాంటి అరుదైన సాహసమే చేస్తున్నారు. గ్రానైట్‌, మార్బుల్‌తో తయారుచేసిన పిల్లర్లు, గోడల్ని ఎలాంటి ఆధారం లేకుండా నేలపై నడిచినట్లే అలవోకగా ఎక్కేస్తున్నారు. ఇది చూసి ఈ చిన్నారుల తల్లిదండ్రులు ఆశ్చర్యపోవడమే కాదు.. వీళ్ల ప్రతిభకు ప్రతి ఒక్కరూ ముగ్ధులవుతున్నారు. మరి, ఇంతకీ ఎవరీ అమ్మాయిలు? అసలు ఇదంతా వీళ్లకెలా సాధ్యమైంది? రండి.. తెలుసుకుందాం..!

పాట్నాలోని దనాపూర్‌లో అజీత్‌ గుప్తా, సంగీతా గుప్తా అనే దంపతులున్నారు. వారి ఇద్దరు కూతుళ్లే అక్షిత, కృపిత. వరుసగా 11 ఏళ్లు, తొమ్మిదేళ్ల వయసున్న ఈ అమ్మాయిలు చదువులోనే కాదు.. స్పైడర్‌మ్యాన్‌లా గోడలెక్కడం, పిల్లర్లు పట్టుకొని పాకడంలోనూ ప్రావీణ్యం సంపాదించారు. స్వీయ సాధనతోనే ఇదంతా సాధ్యమైందంటున్నారీ అమ్మాయిలు.

అవే మాకు స్ఫూర్తి!

అక్షితకు చిన్నప్పట్నుంచీ కార్టూన్‌ క్యారక్టర్లంటే ఇష్టం. అందులోనూ స్పైడర్‌మ్యాన్‌ కార్టూన్‌ షోలు తరచూ చూసేది. దానికి సంబంధించిన పుస్తకాలు కూడా బాగా చదివేది. ఈ ఆసక్తే స్పైడర్‌మ్యాన్‌లా పాకేలా చేసిందంటోందీ బిహార్‌ అమ్మాయి.
‘చిన్నప్పట్నుంచీ స్పైడర్‌మ్యాన్‌ కార్టూన్‌ షోలు, పుస్తకాలు బాగా ఫాలో అయ్యేదాన్ని. అలా గోడలు పట్టుకొని అలవోకగా పాకుతుంటే ఆశ్చర్యపోయేదాన్ని. ఇదంతా ఎలా సాధ్యమవుతుందని ఆలోచించేదాన్ని. నాకూ అలాగే పాకాలని కోరిక కలిగింది. అనుకున్నదే తడవుగా ఇంట్లోనే పిల్లర్లు, గోడలు పట్టుకొని పాకడం సాధన చేశా. నాకు ఐదేళ్లున్నప్పటుంచే ఈ ప్రాక్టీస్‌ మొదలుపెట్టా. ఇప్పుడు ఇందులో పూర్తిగా పట్టొచ్చింది. గోడలు, గ్రానైట్‌-మార్బుల్‌తో రూపొందించిన పిల్లర్లు.. వంటి మృదువైన ఉపరితలాల పైనా ఎలాంటి ఆధారం లేకుండా అలవోకగా పాకగలను. సీలింగ్‌ను తాకి, పిల్లర్‌ చుట్టూ చకచకా తిరగగలను. నన్ను చూసి చెల్లి కూడా ఈ విద్య నేర్చుకుంది.

అమ్మానాన్న వారించారు!

అయితే అమ్మానాన్న ఆఫీసుకు వెళ్లాకే మా సాధన మొదలుపెట్టేవాళ్లం. ఎందుకంటే మేము ఎక్కడ కింద పడిపోతామోనని వాళ్లు పదే పదే వద్దని వారించేవారు. కానీ ఇప్పుడు మా నైపుణ్యాలు చూశాక వాళ్లే ఆశ్చర్యపోతున్నారు. మమ్మల్ని ప్రశంసిస్తున్నారు. అంతేకాదు.. మా ఫ్రెండ్స్‌, బంధువులు మమ్మల్ని స్పైడర్‌ గర్ల్స్‌ అని పిలుస్తున్నారు. భలే సంతోషమేస్తోంది.. ఇక ఈ క్రమంలోనే నాకు మౌంటెనీరింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. భవిష్యత్తులో పర్వతారోహకురాలిగా స్థిరపడాలని ఉంది.. ఏదో ఒకరోజు కచ్చితంగా ఎవరెస్ట్‌ని అధిరోహిస్తా..’ అంటోంది అక్షిత. ప్రస్తుతం ఆమె అక్కడి సెయింట్‌ కారెన్స్‌ సెకండరీ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది.

గర్వంగా ఉంది!

ఇక మరోవైపు తమ ఇద్దరు పిల్లల నైపుణ్యాలు చూసి గుప్తా దంపతులు పొంగిపోతున్నారు. ‘మొదట్లో వీళ్లిద్దరూ ఎక్కడ కింద పడిపోతారోనని వద్దని వారించాం. కానీ ఇప్పుడు నా ఇద్దరు కూతుళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది. వాళ్లిద్దరూ భవిష్యత్తులో పర్వతారోహకులుగా మారాలనుకుంటున్నారు. ఈ క్రమంలో తగిన ప్రోత్సాహం అందిస్తాం..’ అంటున్నారు ఈ స్పైడర్‌ గర్ల్స్‌ తల్లిదండ్రులు. ప్రస్తుతం ఈ పిల్లలిద్దరి స్పైడర్‌ విన్యాసాలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ చిన్నారుల నైపుణ్యాలు చూసి అందరూ ఔరా అంటున్నారు.. మరికొందరు ‘కీప్‌ ఇట్‌ అప్‌’ అంటూ ప్రోత్సహిస్తున్నారు.

గతంలో ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌కు చెందిన ఏడేళ్ల యశర్థ్‌ సింగ్‌ గౌర్‌ కూడా ఎలాంటి సపోర్ట్‌ లేకుండా స్పైడర్‌ మ్యాన్‌లా గోడలు పట్టుకొని అలవోకగా పాకడం, దూకడం నేర్చుకున్నాడు. కాగా, ఈ బుడతడి విన్యాసాలకు సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది.

గమనిక:

అయితే చిన్నారుల్లో ఇలాంటి నైపుణ్యాలు ఉండడం మంచిదే.. కానీ ఒకరిని చూసి మరొకరు అనుకరించే అలవాటు చాలామంది పిల్లల్లో ఉంటుంది. అది ఒక్కోసారి ప్రమాదకరం కావచ్చు.. కాబట్టి మీరూ మీ పిల్లల్ని ఓ కంట కనిపెడుతూ ఉండండి.. లేదంటే మీ కళ్లు గప్పి వారు ఇతర ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశమూ లేకపోలేదు..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్