Bipasha Basu: మాకు అమ్మాయే పుట్టాలని కోరుకుంటున్నాం!
‘కంటే కూతుర్నే కనాలం’టున్నారు బాలీవుడ్ హాట్ కపుల్ బిపాసా బసు-కరణ్ సింగ్ గ్రోవర్ జంట. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ కొన్ని వారాల క్రితం.. తాము త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామంటూ ప్రకటించారీ క్యూట్ కపుల్. ఇక అప్పట్నుంచి పుట్టబోయే పాపాయి...
‘కంటే కూతుర్నే కనాలం’టున్నారు బాలీవుడ్ హాట్ కపుల్ బిపాసా బసు-కరణ్ సింగ్ గ్రోవర్ జంట. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ కొన్ని వారాల క్రితం.. తాము త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామంటూ ప్రకటించారీ క్యూట్ కపుల్. ఇక అప్పట్నుంచి పుట్టబోయే పాపాయి కోసం ఆతృతగా ఎదురుచూస్తూ.. గర్భిణిగా తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటోంది బిప్స్. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సీమంతం వేడుక నిర్వహించారు ఆమె కుటుంబ సభ్యులు. బెంగాలీ సంప్రదాయంలో జరిగిన ఈ వేడుకలో సీమంతపు కళతో మెరిసిపోయిందీ బాలీవుడ్ అందం. ఆ ఫొటోల్ని ఈ జంట సోషల్ మీడియాలో పంచుకోగా అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఆడదానికి అమ్మతనం ఓ వరం. అందుకే ఈ ప్రత్యేక సందర్భాన్ని వివిధ వేడుకలతో సెలబ్రేట్ చేసుకుంటుంటారు అతివలు. అందులో సీమంతం ఒకటి. ఇటీవలే గర్భం దాల్చిన బాలీవుడ్ డస్కీ బ్యూటీ బిపాసా బసు కోసం ఆమె కుటుంబ సభ్యులు తాజాగా ఈ వేడుకను నిర్వహించారు. బెంగాలీ సంప్రదాయం ప్రకారం ఈ వేడుకను ‘షాధ్’గా పిలుస్తారు. పూర్తిగా బెంగాలీ సంప్రదాయంలో జరిగిన ఈ వేడుకలో బిప్స్ ముఖంలో ప్రెగ్నెన్సీ కళ ఉట్టిపడిందని చెప్పచ్చు.
ఇద్దరం బాగా ఆకలితో ఉన్నాం!
తన సీమంతం కోసం బిపాసా-కరణ్ జంట సంప్రదాయబద్ధమైన దుస్తుల్ని ఎంచుకుంది. ఈ క్రమంలో బిప్స్ గులాబీ రంగు బనారసీ చీర-టెంపుల్ జ్యుయలరీలో మెరిసిపోగా.. కరణ్ తెలుపు రంగు కుర్తా ధరించాడు. ఇక ఈ వేడుకలో భాగంగా.. తన కోసం తయారుచేయించిన ఫలహారాల్ని ఆస్వాదిస్తూ సందడి చేసిందీ కాబోయే అమ్మ.
‘నేను, నా బేబీ మాంచి ఆకలితో ఉన్నాం.. మా అమ్మ చేతి వంట మా ఇద్దరి ఆకలిని తీర్చింది..’ అంటూ థాలీ తరహాలో తాను చేసిన భోజనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని సోషల్‌మీడియాలో పంచుకుందీ చక్కనమ్మ. మరోవైపు తన భర్త, కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోల్నీ షేర్ చేస్తూ మురిసిపోయింది. ప్రస్తుతం ఈ జంట ఫొటోలు ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్నాయి.
మాకు పాపే కావాలి!
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే తమ ఆరో వివాహ వార్షికోత్సవం జరుపుకొన్నారు బిప్స్-కరణ్ జంట. 2016లో ప్రేమ పెళ్లితో ఒక్కటైన ఈ జంట.. తమ ఇన్నేళ్ల ఎదురుచూపులకు త్వరలోనే పాపాయి రాకతో తెర పడనుందంటోంది. గర్భిణిగా తాను ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తున్నానని, తన జీవనశైలిలో పలు మార్పులూ చేసుకున్నానంటూ ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంటూ మురిసిపోయిందీ కాబోయే అమ్మ.
‘పెళ్లైనప్పట్నుంచే నేను, కరణ్ మా సంతానం విషయంలో ఓ స్పష్టమైన అవగాహనతో ఉన్నాం. అయితే ఇన్నేళ్లు ఎందుకు ఆలస్యమైందన్న దాని గురించి నేను ఆలోచించట్లేదు. ఎందుకంటే ఏదీ మన చేతిలో ఉండదు కదా! మేం పేరెంట్స్ కావడానికి ఇదే సరైన సమయం అనుకుంటా.. అందుకే త్వరలోనే మా కోరిక నెరవేరబోతోంది. మాకు పిల్లలు కావాలనిపించినప్పుడల్లా అమ్మాయే పుట్టాలని కోరుకునేవాళ్లం.. ఇప్పుడూ ఆ కోరికే ఉంది. పాపే పుడుతుందన్న నమ్మకమూ ఉంది.. అందుకే తను కడుపులో పడినప్పట్నుంచే తనను ప్రతి విషయంలో ‘ఆమె’ అని సంబోధించడం మొదలుపెట్టాం..’ అంటోందీ బాలీవుడ్ బ్యూటీ.
మానసికంగా దృఢంగా ఉన్నా!
గర్భం ధరించాక మహిళలు తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం పరిపాటే! అలాగే తానూ గర్భిణిని అని తెలిశాక తన లైఫ్‌స్టైల్‌లో పలు మార్పులు-చేర్పులు చేసుకున్నానని చెబుతోంది బిప్స్. ‘గర్భం ధరించాక ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కొంతమంది ఈ సమయంలోనూ సాధారణంగానే తమ పనులన్నీ చేసుకుంటుంటారు. మరికొంతమంది కొన్ని పనులకు దూరంగా ఉంటారు. డాక్టర్ సలహా మేరకు నేనూ శారీరకంగా కొన్ని పనులకు దూరంగా ఉంటున్నా.. ఇందుకు కారణం.. తొలి త్రైమాసికంలో పలు సమస్యలు ఎదురవడం వల్లే! అయినా ప్రస్తుతం నేను మానసికంగా దృఢంగా ఉన్నా. పాపాయికి ఏది ఆరోగ్యకరం, అనుకూలమో.. ఆ పనులే చేస్తున్నా. ఆహారం విషయంలోనూ శ్రద్ధ వహిస్తున్నా. ఇక కరణ్ కూడా రాబోయే పాపాయి కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. ఇంట్లో చాలా పనుల్ని తనే చూసుకుంటున్నాడు. ఇలా ప్రెగ్నెన్సీ జర్నీ మా అనుబంధాన్ని మరింత దృఢం చేస్తోంది..’ అంటోందీ అందాల తార.
వాళ్ల మాటలు పట్టించుకోను!
సాధారణంగా పెళ్లయ్యాక పిల్లలు పుట్టడం ఆలస్యమైనా, లేటు వయసులో గర్భం ధరించినా.. అన్నీ తమకే కావాలన్నట్లుగా వ్యవహరిస్తుంటుందీ సమాజం. ఇదో విడ్డూరంగా చూస్తుంటుంది. అమ్మతనం గురించి తానూ ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నానంటోంది బిపాసా. ‘ఈ రోజుల్లో మన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొని తమ నిర్ణయాలు మనపై రుద్దే వారు పెరిగిపోయారు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఇందుకు వేదికగా చేసుకుంటున్నారు. నేనూ ఈ బాధితురాలినే! అయినా ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. మనసు మీదికి తీసుకోను. దానివల్ల మానసిక ఒత్తిడి తప్ప మరే ప్రయోజనం ఉండదు. ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. వారి విషయంలో ఏది మంచి, ఏది చెడు అనేది వారికే ఎక్కువగా తెలిసుంటుంది. ప్రతి విషయంలో నిర్ణయాలు తీసుకునే హక్కూ వారికే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లడం మంచిది. ఇక అమ్మయ్యాక కెరీర్‌ను వదులుకోకూడదనేది నా అభిప్రాయం. కావాలంటే కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని.. అన్నీ సర్దుకున్నాక తిరిగి పనిలో కొనసాగడం మంచిది. నేనూ ఇదే చేయాలనుకుంటున్నా.. అటు అమ్మగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఇటు కెరీర్‌నూ కొనసాగిస్తా..’ అంటూ తన మనసులోని మాటల్ని బయటపెట్టిందీ బాలీవుడ్ బేబ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.