Published : 05/12/2022 20:14 IST

రోగ నిరోధక శక్తిని పెంచే ‘బ్లాక్‌ ఫుడ్స్’!

ఆరోగ్యంగా ఉండాలన్న తాపత్రయంతో మనం తీసుకునే ఆహారంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటాం. కాయగూరలు, పండ్లు, నట్స్, చిరు ధాన్యాలు.. వంటివి ఎక్కువగా తీసుకుంటుంటాం. జంక్‌ఫుడ్‌ని దూరం పెట్టేస్తాం. అయితే ఇలాంటి నియమాలతో పాటు బ్లాక్‌ ఫుడ్స్‌ని కూడా ఆహారంలో చేర్చుకోమని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలో పుష్కలంగా ఉండే పోషకాలు గుండె జబ్బులు, క్యాన్సర్‌.. వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును చాలావరకు తగ్గిస్తాయంటున్నారు. అంతేనా.. రోగనిరోధక శక్తినీ పెంచుతాయట! అసలు ఇంతకీ ఏంటీ బ్లాక్‌ ఫుడ్స్‌? వాటిలో దాగున్న ఆరోగ్య రహస్యాలేంటి? రండి.. తెలుసుకుందాం..!

బ్లాక్‌ ఫుడ్స్‌.. పేరు వినగానే ఇవి నలుపు రంగులో ఉంటాయేమో అంటూ మొహం చిట్లించుకునే వారే ఎక్కువమంది ఉంటారు. అయితే నిజానికి.. ఆంథోసయనిన్స్‌ అనే పిగ్మెంట్లు ఉన్న పదార్థాలను బ్లాక్‌ ఫుడ్‌్ిగా పరిగణిస్తుంటారు. ఈ పిగ్మెంట్లు నలుపు, నీలం, పర్పుల్‌.. రంగు పదార్థాల్లో ఎక్కువగా ఉంటాయట! ఇక వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి.. ఎలాంటి అనారోగ్యంతోనైనా సమర్థంగా పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయంటున్నారు నిపుణులు.

నల్ల బియ్యం

పేరుకు తగినట్లే ఈ బియ్యం నల్లగా ఉంటాయి. ఈ ధాన్యంలో ఉండే ల్యూటిన్‌, జియాంథిన్‌ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇక ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌తో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి. ఇక ఈ రైస్‌తో పులావ్‌, బిరియానీ, ఖీర్‌, పుట్టు, దోసె, ఇడ్లీ.. వంటివి కూడా తయారుచేసుకోవచ్చు. సలాడ్‌లో భాగంగానూ తీసుకోవచ్చు.

నల్ల పప్పు

మనందరికీ సుపరిచితమైన మినుముల్నే నల్ల పప్పు (బ్లాక్‌ దాల్‌)గా పిలుస్తుంటారు. దాల్‌ మఖానీ, మినప సున్నుండలు, రోటీ.. వంటి వంటకాలతో పాటు గ్రేవీల్లోనూ ఈ పప్పును వాడుతుంటాం. అమోఘమైన రుచితో పాటు ఫైబర్‌, ఐరన్‌, ఫోలేట్‌, ప్రొటీన్‌, మెగ్నీషియం.. వంటి పోషకాలు కలగలిసిన ఈ పప్పును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు అదుపులో ఉంటాయి. ఇక ఇందులోని పొటాషియం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా!

⚜ వెల్లుల్లి అంటే తెల్లవే మనకు తెలుసు. కానీ నల్ల వెల్లుల్లి కూడా ఉంటుంది. నూడుల్స్‌, సూప్స్, వేపుళ్లు.. మొదలైన వాటిలో వీటిని ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర సుగుణాలు యాంటీ క్యాన్సర్‌ కారకాలుగా పనిచేస్తాయి.

⚜ బ్లాక్‌ ఆలివ్స్‌తో పచ్చళ్లు, పానీయాలు తయారుచేస్తుంటారు. ఇందులో మోనోఅన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులు, పాలీఫినోల్స్‌, నొప్పి నివారణ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. కంటి ఆరోగ్యానికి, చర్మ-జుట్టు సంరక్షణలో బ్లాక్‌ ఆలివ్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తాయి.

⚜ కాలేయం-పొట్ట ఆరోగ్యానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తికి నల్ల పుట్టగొడుగులు మంచివని చెబుతున్నారు నిపుణులు.

⚜ నల్ల మిరియాల్లో కొవ్వును, చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచే గుణాలున్నాయి. అలాగే క్యాన్సర్‌తో పోరాడే శక్తిని ఇవి శరీరానికి అందిస్తాయి.

⚜ ‘సి’, ‘కె’ విటమిన్లు బ్లాక్‌బెర్రీస్‌లో అధికంగా ఉంటాయి. నోటి ఆరోగ్యానికి, మెదడు చురుకుదనానికి ఈ పండ్లు ఎంతగానో దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు.

ఆరోగ్యానికి మంచిది కదా.. అని వీటిని మోతాదుకు మించి తీసుకుంటే ఇవి విషపూరితమయ్యే ప్రమాదమూ లేకపోలేదట! అందుకే ఎవరెవరు ఎంత మోతాదులో తీసుకోవాలో ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని