Published : 22/12/2021 19:19 IST

నల్ల మిరియాలతో ప్రయోజనాలెన్నో..!

పాలల్లో కాసిని మిరియాలు వేసుకుంటే... జలుబు పరార్‌! మిరియాల చారు రుచినే కాదు.. రోగనిరోధక శక్తినీ అందిస్తుంది.. సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా పిలుచుకునే నల్లమిరియాల ప్రయోజనాలు మరిన్ని..

* నల్ల మిరియాల్లో పెప్పరైన్‌, కాప్సేసిన్‌ అనే రసాయనాలు ఉంటాయి. వీటి వల్లే మిరియాలకు ఘాటైన వాసన ఉంటుంది. ఈ పెప్పరైన్‌ శ్వాసను నియంత్రించి మెదడు పనితీరుని చురుగ్గా ఉంచుతుంది.

* వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్‌-ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవే మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.

* 15 మిరియపు గింజలు, రెండు లవంగాలు, ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుని వాటిని దంచి వేణ్నీళ్లలో కాచి కొంచెం కొంచెంగా పుచ్చుకుంటే ఆయాసం, గొంతునొప్పి తగ్గుతుంది. కఫ హరంగా ఉంటుంది. ●

* నాలుగు మిరియాలని కచ్చాపచ్చాగా దంచి తేనెతో కలిపి తమలపాకులో పెట్టి పుచ్చుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది.

* మిరియాలు కాలేయాన్ని శుద్ధిచేసి దాని పనితీరును మెరుగుపరుస్తాయి. ఫ్యాటీలివర్‌ని అదుపులో ఉంచుతాయి.

ఇన్‌ఫెక్షన్లపై పోరాటం

మిరియాల్లో యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం... మిరియాల్లోని పెప్పరైన్‌కి రోగాలకు కారణమయ్యే క్రిములను లార్వా దశలోనే అంతమొందించే శక్తి ఉందని తేలింది.

* పేగులను శుభ్రపరిచి జీర్ణసంబంధ సమస్యలను నివారిస్తాయి. పొట్ట, పేగుల్లోని అదనపు గాలిని తొలగిస్తాయి.

* మిరియాలు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ఇవి రుచి మొగ్గలను ఉత్తేజితం చేయడం వల్ల జీర్ణప్రక్రియ వేగంగా జరుగుతుంది.

* భోజనంలో పావుచెంచా వాము, రెండుమూడు మిరియాలు, నెయ్యి, ఉప్పుతో కలిపి మొదటిముద్ద తింటే అజీర్ణం తగ్గుతుంది.

* పాలల్లో మిరియాలపొడి, పసుపు, శొంఠి వేసుకుని నిద్రపోయే ముందు ితాగితే ఊపిరితిత్తుల సమస్యలు ఉండవు.

జాగ్రత్తలు: కడుపులో మంట ఉన్నవారు మితంగా తీసుకోవాలి.

మిరియాల టీ

కావాల్సినవి: నీళ్లు- రెండు కప్పులు, మిరియాల పొడి- టీస్పూన్‌, తేనె- టేబుల్‌ స్పూన్‌, నిమ్మరసం- టీస్పూన్‌, సన్నగా తురిమిన అల్లం- టీస్పూన్‌, పసుపు- కొద్దిగా

తయారీ: గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించాలి. వీటిలో మిరియాల పొడి, అల్లం తురుము, తేనె, పసుపు, నిమ్మరసం అన్నీ వేసి అయిదు నిమిషాల పాటు మూత పెట్టి అలాగే ఉంచాలి. తర్వాత వడపోసి వేడివేడిగా తాగాలి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని