Published : 18/04/2022 15:50 IST

డియర్‌ బ్రెస్ట్‌.. నీకు అండగా ఉంటా!

(Photos: Instagram)

ఏ చిన్న అనారోగ్యం వచ్చినా తట్టుకోలేం.. అలాంటిది క్యాన్సర్‌ అని తెలిస్తే.. మరుక్షణమే జీవచ్ఛవంలా మారిపోతాం. ఒక్కసారిగా భవిష్యత్తంతా శూన్యంగా కనిపిస్తుంటుంది. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే ఎలాంటి మహమ్మారినైనా జయించగలం అంటోంది బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ చవీ మిట్టల్‌. నటిగా, అమ్మగా ఎంతో చలాకీగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే రొమ్ము క్యాన్సర్‌ బారిన పడింది. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని, వ్యాధిని జయించే వరకు ధైర్యంగా పోరాడతానంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది. క్యాన్సర్‌ బాధితుల్లో స్ఫూర్తి నింపుతోన్న ఆ పోస్ట్‌ సారాంశమేంటో తెలుసుకుందాం రండి..

చవీ మిట్టల్‌.. బాలీవుడ్‌ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరిది. ‘ఘర్‌ కీ లక్ష్మీ బేటియాన్‌’, ‘బాందిని’, ‘నాగిన్‌’.. వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం అమ్మగా, సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా కొనసాగుతోంది. ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుంటూ.. ఎప్పుడూ నవ్వుతూ, చలాకీగా ఉండే చవీ.. ఇటీవలే రొమ్ము క్యాన్సర్‌ బారిన పడింది. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా పోరాడుతున్నానంటూ తన క్యాన్సర్‌ జర్నీ గురించి ఇన్‌స్టాలో వరుస పోస్టులు పెడుతోందీ చక్కనమ్మ.

కష్టమే.. కానీ అసాధ్యం కాదు!

మన శరీరంలో అంతర్భాగమైన ఏ అవయవానికి కష్టమొచ్చినా ఓర్చుకోలేం. అలాగని బాధపడుతూ కూర్చోకుండా దాన్ని జయించే ధైర్యాన్ని కూడగట్టుకోవాలంటోంది చవీ. ‘మన శరీర అవయవాలు మనకు ఎన్నో పనులు చేసి పెడతాయి. వాటికి కష్టమొచ్చినప్పుడు మనం కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలి. తద్వారా ఆటోమేటిక్‌గా ఆ సమస్యను అధిగమించే ఆత్మవిశ్వాసం మనకు అలవడుతుంది. నా శరీరంలో అంతర్భాగమైన నా వక్షోజాలు నా ఇద్దరు పిల్లల కడుపు నింపాయి. అలాంటి వాటిలో ఒకదానికి ఇప్పుడు కష్టమొచ్చింది.. క్యాన్సర్‌ సోకింది. ఇలాంటి ప్రతికూల సమయంలో నా గుండె ధైర్యంతో దానికి అండగా నిలవడం నా ధర్మం. ఇది గడ్డు సమయమే కావచ్చు.. అంతమాత్రాన నాలో ఆత్మవిశ్వాసాన్ని నేను కోల్పోను. అలాగే ఈ మహమ్మారి నుంచి బయటపడడం కష్టమే కావచ్చు.. అలాగని అసాధ్యం మాత్రం కాదు. గతంలోలా ఇక ముందు నేను కనిపించకపోవచ్చు.. కానీ నా ఆలోచనల్లో, ఉత్సాహంలో ఏ మార్పు ఉండదు. నా చుట్టూ ఎంతోమంది క్యాన్సర్‌ బాధితులున్నారు. వారే నాకు స్ఫూర్తి. ఈ జర్నీలో నా క్షేమం కోరుకుంటూ, నాకు అండగా నిలుస్తోన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు!’ అంటూ స్ఫూర్తి రగిలించే పోస్ట్‌ పెట్టిందీ చక్కనమ్మ.

ఆ గాయంతో సమస్య బయటపడింది!

క్యాన్సర్‌ను ధైర్యంగా ఎదుర్కోవాలంటే దాన్ని తొలినాళ్లలో గుర్తించడం ముఖ్యమంటోంది చవీ. ఈ విషయంలో తాను అదృష్టవంతురాలినని చెబుతోంది. ‘ఓసారి జిమ్‌లో వ్యాయామం చేస్తోన్న క్రమంలో ఛాతీకి చిన్న దెబ్బ తగిలింది. చికిత్స కోసం డాక్టర్‌ దగ్గరికి వెళ్లాను. అప్పుడే నా రొమ్ములో గడ్డ ఉన్న విషయం తెలిసింది. వెంటనే దాని శాంపిల్‌ను బయాప్సీకి పంపగా.. పాజిటివ్‌ వచ్చింది. ఒక రకంగా ఈ గాయం తగలడం నాకు మంచిదైంది. ఎందుకంటే దీనివల్లే తొలినాళ్లలోనే క్యాన్సర్‌ను గుర్తించగలిగాను. ఆరు నెలల పాటు PET స్కాన్లు తప్పకుండా చేయించుకోవాలన్నారు వైద్యులు. కాబట్టి మహిళలందరూ ఇంటి వద్దే క్రమం తప్పకుండా స్వీయ రొమ్ము పరీక్షలు చేయించుకోవాలి. అలాగే నిర్ణీత వ్యవధుల్లో మమోగ్రామ్‌ చేయించుకోవడం వల్ల మన జీవితాన్ని రిస్క్‌లో పెట్టకుండా కాపాడుకోవచ్చు..’ అంటూ తన అనుభవాలను పంచుకుందీ చక్కనమ్మ.

‘పాజిటివిటీ’తో ఎదుర్కోవాలి!

జీవితంలోని ప్రతికూల పరిస్థితుల్ని పాజిటివ్‌గా ఎలా ఎదుర్కోవాలో చవీని చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్‌ అని నిర్ధారణ అయ్యాక కూడా ఎంతో చలాకీగా ఉంటూ, సానుకూల దృక్పథంతో కూడిన పోస్టులు పెడుతూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోందీ అందాల అమ్మ.

‘మనకేదైనా సమస్య ఎదురైనప్పుడు మన ముందు రెండు అవకాశాలుంటాయి. మొదటిది - సానుకూల దృక్పథంతో దాన్ని ఎదుర్కోవడం, రెండోది - చేతకాక విధిని నిందించడం. నాకు రొమ్ము క్యాన్సర్‌ అని తెలిశాక నేను మొదటిదాన్ని ఎంచుకున్నా. ఏ సమస్యకైనా పరిష్కారం ఉన్నట్లే దీన్నీ ధైర్యంగా ఎదుర్కోవాలనుకున్నా. ఈ క్రమంలో రొమ్ము క్యాన్సర్‌ను జయించిన వారిని, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నిపుణుల్ని, ప్లాస్టిక్‌ సర్జన్స్‌, ఇతర డాక్టర్లను కలిశాను. వీళ్ల మాటలు నాలో స్ఫూర్తి రగిలించాయి. నాతో పాజిటివిటీ దిశగా అడుగులేయించాయి. క్యాన్సర్‌ మనల్ని శారీరకంగా దెబ్బతీస్తుంది.. అలాగని మన భావోద్వేగాలతో దానికి గెలిచే అవకాశం ఇవ్వకూడదు. మరో విషయం ఏంటంటే.. రెండు క్యాన్సర్‌ ప్రయాణాలూ ఒకే రకంగా ఉండవు. కాబట్టి ఒకరితో ఒకరు పోల్చుకొని నిరాశ చెందకుండా సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలి. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, చుట్టూ ఉన్న వాళ్లు బాధితులకు అండగా నిలవాలి..’ అంటూ చెప్పుకొచ్చిందీ డేరింగ్‌ బ్యూటీ.

ఇలా వరుస పోస్టులతో ఎంతోమందిలో పాజిటివిటీని, ధైర్యాన్ని నింపుతోన్న ఈ బాలీవుడ్‌ బ్యూటీ ఆత్మవిశ్వాసాన్ని అటు ప్రముఖులతో పాటు, ఇటు నెటిజన్లూ ప్రశంసిస్తున్నారు. ‘మీరు త్వరగా తిరిగి కోలుకోవాలం’టూ కామెంట్లు పెడుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని