Egg Freezing: అండాల్ని భద్రపరచుకున్నారు.. అమ్మలయ్యారు!

కెరీర్‌, ఇతర కారణాల రీత్యా అమ్మతనాన్ని వాయిదా వేస్తున్నారు ఈ కాలపు మహిళలు. తీరా పిల్లల్ని కనాలనుకునే సరికి.. వయసు దాటి పోవడం, అండాల నిల్వ-నాణ్యత తగ్గిపోవడం.. వంటి సమస్యలొస్తున్నాయి. కొంతమందిలో పలు అనారోగ్యాల రీత్యా సంతానానికీ నోచుకోలేని....

Updated : 05 Apr 2023 12:39 IST

(Photos: Instagram)

కెరీర్‌, ఇతర కారణాల రీత్యా అమ్మతనాన్ని వాయిదా వేస్తున్నారు ఈ కాలపు మహిళలు. తీరా పిల్లల్ని కనాలనుకునే సరికి.. వయసు దాటి పోవడం, అండాల నిల్వ-నాణ్యత తగ్గిపోవడం.. వంటి సమస్యలొస్తున్నాయి. కొంతమందిలో పలు అనారోగ్యాల రీత్యా సంతానానికీ నోచుకోలేని పరిస్థితి. అలాంటి వారికి ‘ఎగ్‌ ఫ్రీజింగ్‌’ పద్ధతి వరంగా మారిందని చెప్పచ్చు. వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన/నాణ్యమైన అండాల్ని శీతలీకరించుకొని.. ఆపై నచ్చినప్పుడు పిల్లల్ని కనే ఈ పద్ధతిని తానూ పాటించానని ఇటీవలే వెల్లడించింది గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా. గతేడాది జనవరిలో సరోగసీ విధానంలో మాల్తీ అనే పాపకు జన్మనిచ్చిన ఈ అందాల తార.. ఇందుకోసం తాను తన 30 ఏళ్ల వయసులో శీతలీకరించిన అండాల్నే వాడానంటోంది. పీసీనే కాదు.. మరికొందరు తారలూ ఈ విధానాన్ని అనుసరించి అమ్మలయ్యారు. మరి, వాళ్లెవరో తెలుసుకుందాం రండి..

అసలేంటీ.. ఎగ్‌ ఫ్రీజింగ్?

మహిళల వయసు పెరిగే కొద్దీ అండాల నిల్వ-నాణ్యత తగ్గిపోతాయి. ఇలాంటి అండాల్లో క్రోమోజోమ్‌ సంబంధిత అసాధారణతలు ఉండే అవకాశాలు ఎక్కువ. ఈ క్రమంలో పుట్టబోయే పిల్లల్లో అవకరాలు, ఇతర శారీరక/మానసిక లోపాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అలాగని అప్పటికప్పుడు పిల్లల్ని కనడానికి కొంతమంది సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇలాంటి వారికి ‘ఎగ్‌ ఫ్రీజింగ్‌’ చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. వయసులో ఉన్నప్పుడే నాణ్యమైన అండాల్ని సేకరించి వాటిని శీతలీకరించడమే దీని ముఖ్యోద్దేశం. ఆపై కాస్త ఆలస్యంగా పిల్లల్ని కనాలనుకున్నా మహిళలు తాము దాచుకున్న ఈ ఆరోగ్యకరమైన అండాల్ని ఉపయోగించుకోవచ్చు. తద్వారా ఆరోగ్యకరమైన సంతానానికి జన్మనివ్వచ్చు.

అయితే ఇందుకోసం ముందుగా సంబంధిత మహిళ ఆరోగ్యం, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రుతుచక్రం, హార్మోన్ల స్థాయుల్ని వైద్యులు పరిశీలిస్తారు. సాధారణంగా ప్రతి నెల అండాశయం ఒకే అండాన్ని విడుదల చేస్తుంది. అలాగని ఆ ఒక్కటే శీతలీకరిస్తే సక్సెసయ్యే అవకాశాలు కచ్చితంగా ఉంటాయని చెప్పలేం. అందుకే ఒకటి కంటే ఎక్కువ అండాల్ని శీతలీకరించుకునేందుకు వీలుగా వైద్యులు మహిళలకు హార్మోన్‌ చికిత్స అందిస్తారు. ఇందులో భాగంగా ఇంజెక్షన్లతో అండాశయాలు ఎక్కువ అండాల్ని విడుదల చేసేలా చేస్తారు. ఆపై వాటిని శీతలీకరిస్తారు. ఇలా ఫ్రీజ్‌ చేసిన అండాల్ని తమకు కావాల్సినప్పుడు వినియోగించుకొని గర్భం దాల్చచ్చు.


అమ్మ సలహాతో..!

ఇలా శీతలీకరించిన అండాలతోనే గతేడాది తన పాప మాల్తీకి సరోగసీ విధానంలో జన్మనిచ్చానని ఇటీవలే ఓ సందర్భంలో బయటపెట్టింది అందాల తార ప్రియాంక చోప్రా. తన తల్లి సలహా మేరకు 30ల్లోనే తన అండాల్ని భద్రపరచుకున్నానంటోంది.
‘నా 30 ఏళ్ల వయసులోనే అమ్మ సలహా మేరకు నా అండాల్ని శీతలీకరించుకున్నాను. నిజానికి అప్పటికి నాకంటూ కొన్ని కెరీర్‌ లక్ష్యాలున్నాయి.. వాటి పైనే దృష్టి పెట్టాను. అలాగే నేను కోరుకున్న జీవిత భాగస్వామిని కూడా కలుసుకోలేదు. అందుకే ఆ తర్వాత రోజుల్లో పిల్లల్ని కనేందుకు వీలుగా ఈ పద్ధతిని అనుసరించాను. దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి నా స్నేహితులకూ వివరించాను. ఇక కెరీర్‌ లక్ష్యాలన్నీ పూర్తిచేసుకొని.. పిల్లల్ని కనడానికి సిద్ధపడ్డాకే నేను, నిక్‌ ఇందుకోసం ప్లాన్‌ చేసుకున్నాం. ఈ క్రమంలో గతేడాది జనవరిలో మాల్తీ పుట్టింది. నిజానికి వృత్తిఉద్యోగాలు, ఇతర కారణాల రీత్యా ప్రెగ్నెన్సీని వాయిదా వేయాలనుకునే వారికి ఈ పద్ధతి ఓ వరం. మీరు ఏ వయసులోనైతే అండాల్ని శీతలీకరించారో.. మీరు ఉపయోగించుకునే నాటికి కూడా అవి అదే వయసులో.. అంతే నాణ్యతతో ఉంటాయి..’ అంటూ అనుభవపూర్వకంగా చెప్పుకొచ్చింది పీసీ.


పెళ్లిపై స్పష్టత లేకపోయినా..!

బాలీవుడ్‌ దర్శక నిర్మాత ఏక్తా కపూర్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘బాలాజీ టెలీఫిల్మ్స్‌’ బ్యానర్‌పై పలు సినిమాలు, సీరియల్స్‌, టీవీ షోలు, వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తూ పాపులారిటీ సంపాదించిన ఏక్తా.. 2019లో రావి కపూర్‌ అనే కొడుక్కి సరోగసీ ద్వారా జన్మనిచ్చిన విషయం తెలిసిందే! అయితే ఇందుకోసం తాను తన 36 ఏళ్ల వయసులో అండాల్ని శీతలీకరించుకున్నానని ఓ సందర్భంలో పంచుకుందీ టీవీ క్వీన్.

‘ముందు నుంచే నాకు పెళ్లి గురించిన భవిష్యత్‌ ఆలోచనలేవీ లేవు. ఒకవేళ చేసుకున్నా లేటు వయసులో, పేరుకి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలాగని అమ్మతనాన్ని వదులుకోవాలనుకోలేదు. ఈ ఆలోచనతోనే 36 ఏళ్ల వయసులో నా అండాల్ని శీతలీకరించుకున్నాను. ఆపై పిల్లల కోసం ప్లాన్‌ చేసుకున్నప్పుడు పలుమార్లు ఐయూఐ, ఐవీఎఫ్‌ పద్ధతుల్ని పాటించినా ఫలించలేదు. అందుకే ఆఖరికి సరోగసీని ఆశ్రయించా. అలా 2019లో రావీ నా జీవితాన్ని పరిపూర్ణం చేశాడు..’ అంది ఏక్తా.


అలా నలభైల్లో పిల్లల్ని కన్నా!

సరిగ్గా ఏడేళ్ల క్రితం మాట.. 30-35 ఏళ్ల వయసులోనే పిల్లల్ని కనడానికి సంకోచించే ఆ రోజుల్లో 44 ఏళ్ల వయసులో అమ్మయింది మాజీ ప్రపంచ సుందరి డయానా హెడెన్‌. శీతలీకరించుకున్న అండాల్నే తన గర్భధారణ కోసం ఉపయోగించిన ఈ ముద్దుగుమ్మ.. తాను ఎగ్‌ ఫ్రీజింగ్‌ పద్ధతిని పాటించడానికి రెండు కారణాలున్నాయంటోంది.

‘నా 32 ఏళ్ల వయసులో అండాల శీతలీకరణ పద్ధతి గురించి విన్నా. ఆపై 34 ఏళ్ల వయసులో ఈ పద్ధతిని అనుసరించా. అయితే ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి-నేను ఆ సమయంలో కెరీర్‌ పరంగా బిజీగా ఉండడం.. రెండోది-ప్రేమ వివాహం చేసుకున్న తర్వాతే పిల్లల్ని కనాలనుకున్నా. అలా 2013లో అమెరికాకు చెందిన కోలిన్‌ డిక్‌తో నా పెళ్లైంది. నలభైల్లో ముగ్గురు పిల్లలు పుట్టారు. నిజానికి ఇలా ముందుగానే అండాల్ని భద్రపరచుకోవడం వల్ల ఒక రకమైన స్వేచ్ఛ దొరికినట్లయింది. వయసులోనే పిల్లల్ని కనాలన్న ఒత్తిడి, ఆందోళనలేవీ లేకుండా ప్రశాంతంగా అమ్మనయ్యా..’ అంది డయానా.

గమనిక: ఈ ఆర్టికల్ రెండో భాగం కోసం గురువారం (౬ ఏప్రిల్ ౨౦౨౩) నాడు ఇదే శీర్షిక చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని