అందం గురించి ఆలోచించం.. పాలివ్వడానికి సంకోచించం..!

‘తల్లిపాల వారోత్సవాల (ఆగస్టు 1-7)’ నేపథ్యంలో ఈ మధ్యే అమ్మతనంలోకి అడుగుపెట్టిన కొంతమంది అందాల తారల బ్రెస్ట్ ఫీడింగ్‌ స్టోరీస్‌ మీకోసం..!

Published : 02 Aug 2023 17:56 IST

(Photos: Instagram)

అమ్మైతే అందం తగ్గిపోతుందా? పాలిస్తే శరీరాకృతి దెబ్బతింటుందా? అందానికి తొలి ప్రాధాన్యమిచ్చే సినిమా రంగంలో అమ్మైన నటీమణులు అవకాశాలు అందుకోలేరా? అంటే.. ఇవన్నీ అపోహలేనని నిరూపిస్తున్నారు కొందరు సెలబ్రిటీ న్యూమామ్స్‌. ఓవైపు చిన్నారికి పాలిస్తూ తన ఆలనా పాలనా చూసుకోవడంతో పాటు.. మరోవైపు కెరీర్‌లోనూ రాణిస్తున్నారు. అంతేకాదు.. ఈ క్రమంలో తమ బ్రెస్ట్ ఫీడింగ్‌ అనుభవాల్ని, అనుభూతుల్ని పంచుకునే వారు కొందరైతే.. తమ చిన్నారికి పాలిచ్చే ఫొటోల్ని పంచుకుంటూ నలుగురిలో స్ఫూర్తి నింపుతున్నారు మరికొందరు. ‘తల్లిపాల వారోత్సవాల (ఆగస్టు 1-7)’ నేపథ్యంలో ఈ మధ్యే అమ్మతనంలోకి అడుగుపెట్టిన కొంతమంది అందాల తారల బ్రెస్ట్ ఫీడింగ్‌ స్టోరీస్‌ మీకోసం..!

ఇది అమ్మలకు ప్రత్యేకం!

బాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ కపుల్‌గా పేరుగాంచిన రణ్‌బీర్‌ కపూర్‌-ఆలియా భట్‌ గతేడాది నవంబర్‌లో తల్లిదండ్రులయ్యారు. అయితే గర్భిణిగా ఉన్నప్పుడు తన ప్రతి అనుభవాన్నీ సోషల్‌ మీడియాలో పంచుకున్న ఆలియా.. తల్లయ్యాకా తన చిన్నారితో తనకున్న అనుబంధం గురించి పంచుకుంటూ మురిసిపోతోంది. ముఖ్యంగా పాలు తాగేటప్పుడు తన పాప చేసే ఓ పని ముద్దుగా అనిపిస్తుందంటోంది ఆలియా.

‘రాహా పుట్టాక మా జీవితం పరిపూర్ణమైంది. తన ప్రతి కదలిక మాకు ప్రత్యేకమైన అనుభూతిని పంచుతుంటుంది. ముఖ్యంగా తనకు పాలిస్తున్నప్పుడు కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఈ సమయంలో ఓవైపు తను పాలు తాగుతూనే.. మరోవైపు నన్ను చూస్తూ నా ముఖాన్ని తడుముతుంటుంది. అప్పుడు తనెంతో ముద్దొస్తుంటుంది. నా జీవితంలో అన్నింటికంటే ఎక్కువగా నేను పొందిన మధురానుభూతి ఏదైనా ఉందంటే.. అది ఇదే!’ అంటూ ఓ సందర్భంలో తన బ్రెస్ట్‌ఫీడింగ్‌ అనుభవాల్ని పంచుకుందీ ముద్దుగుమ్మ.

ఇలా కొత్తగా తల్లైన మహిళల్ని తల్లి పాల విషయంలో ప్రోత్సహించడమే కాదు.. వారు బహిరంగ ప్రదేశాల్లోనూ సౌకర్యవంతంగా తమ చిన్నారులకు పాలిచ్చేందుకు తన ఫ్యాషన్‌ లైన్‌ ‘Edamama’ వేదికగా ప్రత్యేకమైన దుస్తుల్ని డిజైన్‌ చేయిస్తోంది ఆలియా. ‘ఈ రోజుల్లో చాలామంది తల్లులు బహిరంగ ప్రదేశాల్లో తమ పిల్లలకు పాలివ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. వారి సౌకర్యార్థం ఎక్కడైనా నిస్సంకోచంగా పాలిచ్చే విధంగా ఈ దుస్తుల్ని రూపొందించాం. బటన్‌ డౌన్‌ తరహాలో రూపొందించిన ఈ స్టైలిష్‌ వేర్‌ మహిళలకు ఫ్యాషనబుల్‌ లుక్‌నీ అందిస్తుంది..’ అంటోందీ అందాల అమ్మ.


బరువు గురించి బాధ లేదు!

తల్లయ్యాక ఎప్పుడెప్పుడు బరువు తగ్గుతామా? తిరిగి పూర్వపు స్థితికి వస్తామా? అని ఆలోచిస్తుంటారు చాలామంది మహిళలు. కానీ బరువు చింత పక్కన పెట్టి తమ బిడ్డకు పాలివ్వడం పైనే పూర్తి దృష్టి పెట్టాలంటోంది సొగసరి సోనమ్‌ కపూర్. గతేడాది ఆగస్టులో వాయు అనే కొడుక్కి జన్మనిచ్చిన ఈ బ్యూటీ.. సందర్భం వచ్చినప్పుడల్లా.. అమ్మగా తన అనుభవాల్ని పంచుకుంటూనే.. తన బ్రెస్ట్ ఫీడింగ్‌ అనుభవాల్నీ షేర్‌ చేసుకుంటోంది.

‘జెంటిల్‌ బర్త్ పద్ధతిలో నాకు సుఖ ప్రసవం కావడం వల్ల తల్లి పాలు త్వరగా ఉత్పత్తయ్యాయి. అయితే గర్భం ధరించినప్పుడు మనం ఎలాగైతే బరువు పెరుగుతామో.. ప్రసవం అయ్యాక కూడా కొన్నాళ్ల పాటు ఆ బరువు అలాగే కొనసాగుతుంది. ఈ నిజాన్ని గ్రహిస్తే.. బరువు గురించిన ఆందోళన మన మనసులోకి రాదు. కొంతమంది మహిళలు తమ పూర్వపు ఫొటోలు, వీడియోలతో పోల్చుకుంటూ.. ప్రసవానంతర బరువు గురించి అనవసరంగా బాధపడుతుంటారు. కానీ నేనైతే బరువు గురించి అస్సలు ఆలోచించట్లేదు. త్వరగా బరువు తగ్గాలన్న ఒత్తిడికీ లోను కావట్లేదు. ప్రస్తుతానికి నా పూర్తి ధ్యాసంతా నా కొడుకు వాయు పైనే ఉంది. వాడికి కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర వయసొచ్చే దాకా పాలిస్తా. ఇందుకోసం చక్కటి పోషకాహారం, విశ్రాంతి, శక్తి కావాలి. కాబట్టి ఎలాంటి ఆహార నియమాలు పాటించట్లేదు. గర్భిణిగా ఉన్నప్పుడూ వ్యాయామం చేశా.. ఇప్పుడూ చేస్తున్నా!’ అంది సోనమ్.


దేవితో.. ప్రతి ఉదయం ఇలా!

గర్భం ధరించింది మొదలు ప్రసవం అయ్యే దాకా మన శరీరంలో ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకుంటాయి.. వీటన్నింటినీ సానుకూలంగా స్వీకరించినప్పుడే అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదించగలమంటోంది డస్కీ బ్యూటీ బిపాసా బసు. గతేడాది నవంబర్‌లో దేవి అనే పాపాయికి జన్మనిచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అప్పట్నుంచి తన చిన్నారే లోకంగా తనకెదురైన ప్రతి అనుభూతినీ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అంతేకాదు.. తన బ్రెస్ట్‌ఫీడింగ్‌ అనుభవాల్ని పంచుకుంటూ మొన్నామధ్య ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ వీడియో కూడా పోస్ట్‌ చేసింది.
‘అమ్మతనం ప్రతి మహిళ జీవితంలో ఓ ప్రత్యేకమైన దశ. ప్రస్తుతం నేను ఇదే దశలో ఉన్నా. గర్భిణిగా ఉన్నప్పుడూ నా శరీరంలో వచ్చిన ప్రతి మార్పునూ స్వీకరించా. అమ్మయ్యాకా ఇదే పాజిటివిటీని కొనసాగిస్తున్నా. ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే నేను చేసే మొదటి పని దేవికి పాలివ్వడం. ఈ ప్రక్రియ ఆ రోజంతా నన్ను ఆనందంగా, ఉత్సాహంగా ఉంచుతుంది..’ అంటోంది బిప్స్.


ఆ చింతను పక్కన పెట్టండి!

బిడ్డ పుట్టాక కొంతమంది తల్లుల్లో పాలు ఆలస్యంగా ఉత్పత్తవుతుంటాయి.. ఇంకొంతమందిలో పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. తానూ ఇలాంటి అనుభవాల్నే ఎదుర్కొన్నానంటోంది బుల్లితెర బ్యూటీ దెబీనా బొనర్జీ. ఇద్దరు కూతుళ్లకు తల్లైన ఆమె.. బ్రెస్ట్‌ఫీడింగ్‌పై కొందరిలో ఉన్న అపోహల్ని, సందేహాల్ని ఓ సందర్భంలో ఇలా దూరం చేసే ప్రయత్నం చేసింది.
‘ఇద్దరు కూతుళ్లకు తల్లిగా నాకు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. ఓ కాన్పులో అసలు పాలే ఉత్పత్తి కాలేదు.. మరో కాన్పులో పాపకు సరిపడా పాలు ఉత్పత్తయ్యాయి. అయితే పాలు ఉత్పత్తి కాకపోయినంత మాత్రాన అందులో బాధపడాల్సిందేమీ లేదు. తల్లిపాలు సరిపోకపోతే నిపుణుల సలహా మేరకు పోత పాలు పట్టడంలో తప్పు లేదు. నా మొదటి కూతురు లియానా పుట్టినప్పుడూ నాకు పాలు పడలేదు. ఆ సమయంలో తను ఫార్ములా పాల పైనే ఆధారపడింది. ఇక రెండో కూతురు దివిషా పుట్టినప్పుడు తనకు సరిపడా పాలివ్వగలిగాను. పాల ఉత్పత్తిని పెంచడంలో గోంద్‌ లడ్డూ చక్కగా పని చేస్తుంది..’ అంటూ ఈతరం తల్లుల్లో స్ఫూర్తి నింపిందీ అందాల అమ్మ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని