ఐశ్వర్య తులిప్స్.. దీపిక దోసె.. మాధురి నక్షత్రం.. వీటి గురించి విన్నారా!

అభిమానించే తారల ఫొటోల్ని మొబైల్‌ వాల్‌పేపర్స్‌గా పెట్టుకోవడం, వాళ్ల సినిమాలను పదే పదే చూడడం, అరుదుగా అవకాశమొస్తే వాళ్లతో ఓ సెల్ఫీ.. సాధారణంగా మనం సినిమా తారలపై చూపించే అభిమానం ఇలాగే ఉంటుంది.. మహా అయితే మరో అడుగు ముందుకేసి.. ఇంట్లో మన పిల్లలకు వాళ్ల పేర్లు పెట్టుకుంటామేమో! అయితే సినీ పరిశ్రమలో కొందరు నటీనటుల పేర్లను ఏకంగా కొన్ని ప్రదేశాలకు, పూలకు, నక్షత్రాలకు కూడా పెట్టారంటే మీరు నమ్మగలరా?

Updated : 15 Jul 2021 19:43 IST

అభిమానించే తారల ఫొటోల్ని మొబైల్‌ వాల్‌పేపర్స్‌గా పెట్టుకోవడం, వాళ్ల సినిమాలను పదే పదే చూడడం, అరుదుగా అవకాశమొస్తే వాళ్లతో ఓ సెల్ఫీ.. సాధారణంగా మనం సినిమా తారలపై చూపించే అభిమానం ఇలాగే ఉంటుంది.. మహా అయితే మరో అడుగు ముందుకేసి.. ఇంట్లో మన పిల్లలకు వాళ్ల పేర్లు పెట్టుకుంటామేమో! అయితే సినీ పరిశ్రమలో కొందరు నటీనటుల పేర్లను ఏకంగా కొన్ని ప్రదేశాలకు, పూలకు, నక్షత్రాలకు కూడా పెట్టారంటే మీరు నమ్మగలరా? అవును ఇది నిజం.. ఇటీవలే ఈ జాబితాలో బాలీవుడ్‌ బ్యూటీ విద్యాబాలన్ కూడా చేరిపోయింది. కశ్మీర్‌ గుల్మార్గ్‌లోని ఓ మిలిటరీ ఫైరింగ్‌ రేంజ్‌కు విద్య పేరు పెట్టి ఆమెకు అరుదైన గౌరవం కట్టబెట్టింది భారత సైన్యం. ఇలా తన సేవల్ని గుర్తు చేసుకోవడంతో పాటు తనపై ఉన్న అభిమానాన్ని సైతం చాటుకుంది. కేవలం తనొక్కర్తే కాదు.. గతంలో పలువురు ముద్దుగుమ్మలూ ఇలాంటి అరుదైన గౌరవాన్నే అందుకున్నారు. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

విద్యాబాలన్ ‘ఫైరింగ్‌ రేంజ్’!

బాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్య సినిమాలకు, విభిన్న కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్ విద్యాబాలన్. తాను నటించిన ‘పరిణీత’, ‘కహానీ’, ‘తుమారీ సులూ’, ‘శకుంతలా దేవి’, ‘షేర్ని’.. వంటి సినిమాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు! ఇలా మహిళల్లో స్ఫూర్తి నింపే పాత్రలు వెండితెరపై పోషించడమే కాదు.. మహిళలకు సంబంధించిన అంశాల పైనా సూటిగా మాట్లాడడం ఈ ముద్దుగుమ్మకు అలవాటే! అంతేకాదు.. అప్పుడప్పుడూ తన వైవాహిక బంధంలోని తీపి గుర్తుల్ని గుర్తు చేసుకుంటూ నేటి జంటల్లో స్ఫూర్తి నింపుతుంటుంది విద్య. ఇలా ఆన్‌స్క్రీన్‌, ఆఫ్‌స్క్రీన్‌లో తనదైన శైలిలో దూసుకుపోతోన్న ఈ బాలీవుడ్‌ బ్యూటీ.. సినీ రంగానికి చేస్తోన్న సేవల్ని గుర్తించిన భారత సైన్యం.. ఆమెకు అరుదైన గౌరవాన్ని అందించింది.

జమ్మూకశ్మీర్‌ గుల్మార్గ్‌లోని ఓ మిలిటరీ ఫైరింగ్‌ రేంజ్‌కు ‘విద్యాబాలన్ ఫైరింగ్‌ రేంజ్‌’గా ఇటీవలే నామకరణం చేసింది. దీంతో ఈ వార్త, దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై విద్య ఇంకా స్పందించలేదు.
మరోవైపు.. ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్‌ ఆర్మీ నిర్వహించిన వింటర్‌ ఫెస్టివల్‌కు తన భర్త సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌తో కలిసి హాజరైందీ అందాల తార. ఆస్కార్‌ అవార్డుల పాలక మండలి ‘అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ సైన్సెస్‌’లో చేరాలంటూ విద్యకు ఆహ్వానం కూడా అందించింది. ఇక తను నటించిన ‘షేర్నీ’ సినిమా కూడా ఇటీవలే అమెజాన్‌లో విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంది.


దీపిక ‘దోసె’ తింటారా?!

అందానికి పర్యాయపదం, ప్రతిభకు కొలమానంలా నిలుస్తుంటుంది బాలీవుడ్‌ అందాల తార దీపికా పదుకొణె. తన నట ప్రతిభతో అంతర్జాతీయ సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ చక్కనమ్మకు.. విదేశాల్లోనూ వీరాభిమానులున్నారు. అదెంతలా అంటే.. ఓ ఆహార పదార్థానికి ఏకంగా దీపిక పేరు పెట్టేంతలా! టెక్సాస్‌ ఆస్టిన్‌లోని ‘దోసె ల్యాబ్స్’ అనే రెస్టరంట్‌లో దీపిక పేరుతో దోసె తయారుచేసి అమ్ముతున్నారట! అక్కడి మెనూలోని ‘దీపికా పదుకొణె దోసె’ చాలా ఫేమస్‌ అట! దీనికోసం అక్కడి జనాలు క్యూ కడుతుంటారట! ఈ మెనూలో దీపిక దోసె హైలైట్‌ చేసిన ఫొటో ఒకటి అప్పట్లో సోషల్‌ మీడియాలో తెగ వైరలైంది! దీంతో ఇదే మెనూ ఫొటోను దీప్స్‌ భర్త రణ్‌వీర్‌ ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంటూ ‘నేనూ దాన్ని తింటాను!’ అంటూ క్యాప్షన్‌ పెట్టాడు. రణ్‌వీర్ ఇలా రొమాంటిక్‌గా క్యాప్షన్‌ పెట్టడంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి కూడా అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

కేవలం దోసె ఒక్కటే కాదు.. పుణేలోని ఓ రెస్టరంట్‌లో ‘దీపికా పదుకొణె పరాఠా థాలీ’ పేరుతో పరాఠాలు కూడా అమ్ముతున్నారట! ఇవి చాలవూ.. దీప్స్‌కి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఏంటో తెలియడానికి!


ఐశ్వర్య ‘తులిప్స్‌’ సొగసు చూడతరమా?!

మన ఇళ్లలో పిల్లలకు రోజా, జాస్మిన్‌.. అంటూ పూల పేర్లు పెట్టుకోవడం తెలిసిందే! ఇక కవులు కూడా ఆడవాళ్ల అందాన్ని సుతిమెత్తనైన పూలతో పోల్చడమూ మనం వింటూనే ఉంటాం. అయితే పూలకే ఏకంగా ఓ సెలబ్రిటీ పేరు పెట్టడం మీరెక్కడైనా విన్నారా? లేదంటే నెదర్లాండ్స్‌ వెళ్లాల్సిందే! ఇంతకీ అక్కడ ఏ పూలకు ఎవరి పేరు పెట్టారో తెలుసా? అందమంతా తమలోనే నింపుకొన్న తులిప్స్‌ పూలకు అందాల రాశి ఐశ్వర్యారాయ్‌ పేరు పెట్టారట! నెదర్లాండ్స్‌లోని Keukenhof Gardensలో పూచే ఎరుపు రంగు తులిప్స్‌ పూలకు 2005లో ఐశ్వర్యారాయ్ తులిప్స్‌గా నామకరణం చేసిందట అక్కడి ప్రభుత్వం. ఆమె అందాన్ని ప్రపంచానికి చాటడానికే ఈ నిర్ణయం తీసుకుందట! దీంతో అప్పట్నుంచి ఈ పూల సొగసును ఆస్వాదించడానికి విదేశాల నుంచి పర్యటకుల తాకిడి మరింతగా పెరిగిందట!


ధృవ ‘తార’ మాధురి!

బాలీవుడ్‌ డ్యాన్సింగ్‌ క్వీన్‌గా సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది అందాల తార మాధురీ దీక్షిత్‌. 90ల్లో బాలీవుడ్‌ ధృవతారగా సినీ పరిశ్రమనేలిన ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. అభిమానించడమంటే ఆరాధించడమే కాదు.. ఆ ప్రేమను ఓ అందమైన జ్ఞాపకంగా మలిచి మన అభిమాన తారకు అందించడమే అంటారు ఆమె ఫ్యాన్స్‌. అందుకే మాధురి ఫ్యాన్స్‌ కొందరు ఆమెకు వెలకట్టలేని కానుకను అందించారు. ఈ క్రమంలో ఆమె కోసం ఏకంగా Orion Constellation లోని ఓ తారకు మాధురీ దీక్షిత్గా నామకరణం చేసేందుకు వాళ్లు ఏకంగా స్టార్‌ ఫౌండేషన్‌ నెట్‌వర్క్‌నే సంప్రదించారు. స్టార్‌ ఫౌండేషన్‌ నెట్‌వర్క్‌ అనేది ఓ స్వచ్ఛంద సంస్థ. ఎవరైనా సరే.. తమ ప్రియమైన వారికోసం ఓ నక్షత్రాన్ని కొనుగోలు చేసి.. దానికి వాళ్ల పేరు పెట్టి.. దానికి సంబంధించిన సర్టిఫికెట్ను వాళ్లకు అందించి సర్‌ప్రైజ్‌ చేయచ్చు.. మాధురి అభిమానులు చేసింది కూడా ఇదే!

ఇలా దీనికి సంబంధించి స్టార్‌ ఫౌండేషన్‌ అందించిన సర్టిఫికెట్‌ను నేరుగా మాధురికే అందించి ఆమెను సర్‌ప్రైజ్‌ చేశారు ఆమె అభిమానులు. దీంతో ఇదే విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్న ఆమె.. ‘నా అభిమానులకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియట్లేదు. నాకోసం Orion Constellationలో ఏకంగా ఓ నక్షత్రాన్నే కొనుగోలు చేసి.. దానికి నా పేరు పెట్టారు.. వాళ్లలో నాపై ఆకాశమంత అభిమానం ఉందని నిరూపించారు..’ అంటూ మురిసిపోయిందీ ముద్దుగుమ్మ.


జీనత్‌ ‘పెర్‌ఫ్యూమ్’!

బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్నారు అలనాటి అందాల తార జీనత్‌ అమన్‌. ‘డాన్‌’, ‘ఖుర్బానీ’, ‘దోస్తానా’, ‘యాందోంకీ బారాత్‌’.. వంటి ఎన్నో హిట్‌ చిత్రాల్లో 80ల్లో ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ పేరుతో మార్కెట్లో ఓ పెర్‌ఫ్యూమ్‌ అమ్ముడవుతోందన్న విషయం మీకు తెలుసా? సినీ పరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా 1990లో ఫ్రెంచ్‌ పెర్‌ఫ్యూమ్‌ బ్రాండ్ Jeanne Arthes తన సుగంధ ద్రవ్యానికి జీనత్‌ పేరు పెట్టింది. ‘For the Woman in You’ అనే లోగోతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సెంట్‌కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు.

వీరితో పాటు ప్రియాంక చోప్రా మిల్క్‌షేక్‌, కరీనా కపూర్‌ సైజ్‌ జీరో పిజ్జా, సోనమ్‌ కపూర్‌ మ్యాంగో బ్లూబెర్రీ కేక్‌, చికెన్‌ సంజూ బాబా (సంజయ్‌ దత్), Bhaijaanz రెస్టరంట్ (సల్మాన్‌ ఖాన్), Dendrobium Amitabh Bachchan Orchid (అమితాబ్‌ బచ్చన్), .. వంటివి ఆయా నటీనటుల పేర్లతో పాపులారిటీని సొంతం చేసుకున్నాయి.

ఇక నటి శ్రీదేవి వీరాభిమాని ఒకరు చెన్నైలో ఏకంగా ఓ రెస్టరంట్‌ ప్రారంభించి.. అందులో శ్రీదేవి నటించిన సినిమా పేర్లతోనే మెనూ తయారుచేసి.. ఆయా ఫుడ్‌ ఐటమ్స్‌ని అమ్ముతూ పాపులారిటీ సంపాదించడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్