Published : 15/12/2021 19:42 IST

Recycled Fashion: ఆ డ్రస్సులతో అలా అవగాహన కలిగిస్తున్నారు!

(Photo: Instagram)

కోరుకున్న ఫ్యాషన్లు ధరించాలని నేటి యువత ఎంత ముచ్చటపడుతున్నారో.. తాము ధరించే దుస్తులతో ఓ మంచి సందేశమివ్వాలనీ అంతే ఆరాటపడుతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్లు ధరించాలని ఆరాటపడే నటీమణులూ ఇందుకు మినహాయింపు కాదు. ఈ జాబితాలో తాజాగా చేరిపోయింది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ తాప్సీ. తన మాటలతో, చేతలతో సమాజంలో చైతన్యం కలిగించే ఈ అందాల తార.. ఇటీవలే నిర్వహించిన ఓటీటీ అవార్డుల వేడుకలో పాల్గొంది. రీసైక్లింగ్‌ (పాత దుస్తులు, పర్యావరణానికి హాని కలిగించే వస్తువుల్ని ఉపయోగించి తయారుచేసినవి) చేసిన డ్రస్‌ ధరించి ఆ వేదికపై సందడి చేసింది. తద్వారా పర్యావరణ పరిరక్షణపై అందరిలో అవగాహన పెంచింది.

పర్యావరణ హితం కోరి..!

తన మాటలతో, చేతలతో సమాజంలో చైతన్యం కలిగించే తాప్సీ.. వాతావరణ పరిరక్షణ విషయంలో అవగాహన పెంచడంలోనూ ముందుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ‘ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డు’ల కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. మల్టీకలర్‌ ఆఫ్‌-షోల్డర్‌ బనారసీ డ్రస్‌ ధరించింది. దేనికదే విడివిడిగా రీసైకిల్‌ చేసిన బనారసీ ప్యానల్స్‌ని అనుసంధానం చేసి గౌన్‌ రూపంలో ఈ డ్రస్‌ని రూపొందించారు డిజైనర్‌ అశ్విన్. ఇక దానికి జతగా పెద్ద పెద్ద స్టడ్‌ తరహా ఇయర్‌ రింగ్స్‌తో దర్శనమిచ్చిందీ బాలీవుడ్‌ అందం. పైగా మ్యాచింగ్‌గా ధరించిన హీల్స్‌కి కూడా ఇదే ఫ్యాబ్రిక్‌తో హంగులద్దడం తన అటైర్‌కి అదనపు ఆకర్షణ అని చెప్పచ్చు.

తారల ఎకో-ఫ్రెండ్లీ మెరుపుల్!

తాప్సీ ఒక్కర్తే కాదు.. గతంలో పలువురు ముద్దుగుమ్మలూ పలు సందర్భాల్లో రీసైక్లింగ్‌ దుస్తుల్ని ధరించి ఎకో-ఫ్రెండ్లీగా మెరిసిపోయారు.

* 2017లో నిర్వహించిన ‘జీక్యూ మెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుల’ ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న కల్కి కొచ్లిన్‌.. గ్రీన్‌ కలర్‌ ప్రింటెడ్‌ థై-హై స్లిట్‌ డ్రస్‌లో దర్శనమిచ్చింది. అసిమెట్రిక్‌గా రూపొందించిన ఈ డ్రస్‌ని బనారసీ చీరను రీసైకిల్‌ చేసి మరీ తయారుచేశారు డిజైనర్‌ అమిత్‌ అగర్వాల్.

* అమ్మమ్మల కాలం నాటి చీరలకు ఈ తరానికి తగ్గట్లుగా కొత్త హంగులద్దడం ఫ్యాషన్‌ స్టైలిస్ట్‌ దివ్య సైనీకి కొత్త కాదు. ఇదేవిధంగా రూపొందించిన ఓ ప్యాంట్‌ సూట్‌లో తళుక్కుమంది స్వరా భాస్కర్‌. గ్రే కలర్‌ ప్లంజింగ్‌ టాప్‌కి రీసైక్లింగ్‌ ప్రింటెడ్‌ ప్యాంట్‌, బ్లేజర్‌ని జతచేసి ఫ్యాషన్‌ దివాగా మెరిసిపోయింది.

* రీసైక్లింగ్‌ ఫ్యాషన్‌ని ప్రోత్సహించడంలో భాగంగా నిర్వహించిన #mysustainstory ఛాలెంజ్‌లో పాల్గొంది సమంత. ఈ క్రమంలో బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీషర్ట్‌, స్ట్రైప్‌డ్‌ ప్యాంట్‌ ధరించింది. ఎలాంటి రసాయనాలు వాడకుండా.. రీసైకిల్ చేసిన ఫ్యాబ్రిక్‌తో దీన్ని రూపొందించినట్లు, దీనికోసం ఉపయోగించిన రంగులు కూడా సహజసిద్ధమైనవే అంటూ ఆ ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది సామ్‌. లవ్‌బర్డ్స్‌ స్టూడియో దీన్ని రూపొందించింది.

* ఇక మరో సందర్భంలో పంకజ్‌, నిధి డిజైనర్‌ ద్వయం.. ఇండియన్‌ ఫ్యాషన్‌ లేబుల్‌ సంయుక్తంగా రూపొందించిన కాన్వా ఫ్లూయిడ్‌ మ్యాక్సీ డ్రస్‌ ధరించింది సామ్‌. ఈ అవుట్‌ఫిట్‌ మొత్తం పూర్తి స్థాయి ప్లాస్టిక్‌ బాటిల్స్‌ని ఉపయోగించి తయారుచేయడం విశేషం.

* స్వయంగా నేచర్‌ లవర్‌ అయిన దియా.. సందర్భం వచ్చినప్పుడల్లా రీసైక్లింగ్‌ దుస్తులకే ప్రాధాన్యమిస్తుంటుంది. ఇటీవలే లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో భాగంగా రీసైకిల్‌ చేసిన PET Bottlesతో రూపొందించిన ఫ్లోర్‌లెంత్‌ అవుట్‌ఫిట్‌ను ధరించి ర్యాంప్‌వాక్‌ చేసింది. అబ్రహాం, థాకోర్‌ డిజైనర్‌ ద్వయం దీన్ని రూపొందించింది.

* మొన్నటికి మొన్న టెన్నిస్‌ క్వీన్‌ మరియా షరపోవా కూడా బ్రిటిష్‌ ఫ్యాషన్‌ అవార్డుల కార్యక్రమంలో రీసైక్లింగ్‌ చేసిన అవుట్‌ఫిట్‌ ధరించి రెడ్‌ కార్పెట్‌పై హొయలుపోయింది. 72 శాతం ప్లాస్టిక్‌ బాటిల్స్‌, 28 శాతం సిల్క్‌ ఫ్యాబ్రిక్‌ని ఉపయోగించి రూపొందించిన ఈ ఓషన్‌ థీమ్‌ అవుట్‌ఫిట్‌కి ‘మిమిసిస్‌’ అని పేరు పెట్టారు. అంతేకాదు.. దీనిపై హ్యాండ్‌ వర్క్‌ చేయడానికి 800 గంటలు, మొత్తం డ్రస్‌ రూపొందించడానికి ఏడాది కాలం పట్టిందట! డచ్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ ఐరిస్‌ వ్యాన్‌ హెర్పెన్‌ దీన్ని రూపొందించింది.

రీసైక్లింగ్‌ చేసిన ఇలాంటి దుస్తులతోనూ ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవచ్చని నిరూపించారీ ముద్దుగుమ్మలంతా! తద్వారా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేలా చక్కటి సందేశమిచ్చారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని