ఇష్టసఖికి కష్టం కలగకుండా.. వీళ్లేం చేశారో చూడండి!
తాము మనసిచ్చిన అమ్మాయైనా, తమను వలచి వరించిన అర్ధాంగైనా.. కాలు కందకుండా.. ప్రేమగా, అపురూపంగా చూసుకుంటారు కొందరు భర్తలు/బాయ్‌ఫ్రెండ్స్. అలాంటి వాళ్లను చూస్తే.. ‘అబ్బ.. నాకూ అలాంటి భర్త/బాయ్‌ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుండేదో?!’ అని అమ్మాయిలు అనుకోవడం....
(Photos: Instagram)
తాము మనసిచ్చిన అమ్మాయైనా, తమను వలచి వరించిన అర్ధాంగైనా.. కాలు కందకుండా.. ప్రేమగా, అపురూపంగా చూసుకుంటారు కొందరు భర్తలు/బాయ్‌ఫ్రెండ్స్. అలాంటి వాళ్లను చూస్తే.. ‘అబ్బ.. నాకూ అలాంటి భర్త/బాయ్‌ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుండేదో?!’ అని అమ్మాయిలు అనుకోవడం కామన్. బాలీవుడ్ లవ్‌బర్డ్స్ హృతిక్ రోషన్ - సబా అజాద్ జంటను చూసిన వారంతా ఇప్పుడు అలాంటి ఊహల్లోనే విహరిస్తున్నారు.. ‘నాకు అలాంటి భాగస్వామి లేరే!’ అని ఈర్ష్యపడుతోన్న వారూ లేకపోలేదు.
ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఇటీవలే అంబానీ కుటుంబం ముంబయిలో NMACCని ప్రారంభించిన సంగతి తెలిసిందే! అక్కడికి చెట్టపట్టాలేసుకొని వాలిపోయిందీ జంట. అయితే ఓ సందర్భంలో తన ప్రియురాలి చెప్పులు మోస్తూ కెమెరా కంటికి చిక్కాడు హృతిక్. అంతే.. అది చూసిన వారంతా ‘జెంటిల్‌మన్’, ‘క్యూట్ బాయ్‌ఫ్రెండ్’ అంటూ ఈ కండల వీరుడిని తెగ ప్రశంసిస్తున్నారు. ఇలా వీళ్లిద్దరే కాదు.. మరికొందరు నటులు కూడా పలు సందర్భాల్లో తమ ఇష్టసఖికి సపర్యలు చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. మరి, ఆ క్యూటెస్ట్ కపుల్ లవ్లీ మూమెంట్స్‌పై మనమూ ఓ లుక్కేద్దాం రండి.
కాలు కందిపోకుండా..!
హృతిక్ రోషన్-సబా ఆజాద్.. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో రొమాంటిక్ కపుల్‌గా పేరు తెచ్చుకుందీ జంట. అది వెకేషన్ అయినా, వేడుకైనా.. చెట్టపట్టాలేసుకొని వాలిపోయే ఈ క్యూట్ కపుల్.. తమ అనుబంధంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇటీవలే NMACC ప్రారంభోత్సవానికి హాజరైన వీరిద్దరూ.. మరోసారి అందరి మనసులు దోచుకున్నారు. కలిసి ఫొటోలకు పోజివ్వడమే కాదు.. ఒకానొక సందర్భంలో ప్రియురాలు సబా హీల్స్ మోస్తూ కెమెరా కంటికి చిక్కాడీ కండల వీరుడు. నిజానికి ఎక్కువ సేపు హీల్స్ వేసుకోవడం వల్ల తన ఇష్టసఖి పడుతోన్న ఇబ్బందిని గమనించే ఈ పని చేశాడట హృతిక్. మొత్తానికి ఈ ఫొటో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘జెంటిల్‌మన్’, ‘ప్రేమ మహత్యం’.. అని అబ్బాయిలు స్పందించగా.. ‘నాకూ హృతిక్ లాంటి జీవిత భాగస్వామి కావాలి..! ఎక్కడ దొరుకుతాడు?’, ‘ప్రియురాలి కాలు కందిపోకుండా హృతిక్ చేసిన పని సో లవ్లీ కదా!’.. అంటూ అమ్మాయిలు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అమ్మాయిలైతే తమకూ ఇలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలంటూ ఏకంగా దేవుడితో మొరపెట్టుకుంటున్నట్లు కొన్ని కామెంట్ల ద్వారా తెలుస్తోంది.
నేను తీస్తాగా.. డియర్!
తమ అనుబంధంతో ప్రేమకు సరికొత్త అర్థం చెబుతున్నారు బాలీవుడ్ లవ్లీ కపుల్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్. రెండేళ్ల క్రితం మనువాడిన ఈ జంట.. ఫొటోలు, వీడియోలతో ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను తెలియజేస్తుంటారు. నాలుగ్గోడల మధ్యే కాదు.. నలుగురిలోకి వెళ్లినప్పుడూ తమ క్యూట్ మొమెంట్స్‌తో అనుబంధాన్ని చాటుకుంటారు. ఇటీవలే శ్వేతా బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా వాళ్లింటికి వెళ్లిందీ జంట. వేడుక పూర్తి కాగానే తిరిగి ఇంటికి బయల్దేరింది. ఈ క్రమంలో తానే స్వయంగా కారు డోర్ తీసి తన ముద్దుల భార్యను కారెక్కించాడీ హ్యాండ్‌సమ్. సీట్లో తాను సౌకర్యవంతంగా కూర్చొనేలా పలు సపర్యలూ చేశాడు. ఆపై డోర్ వేసి.. తానూ కారెక్కాడు. ఇలా చిన్న చిన్న పనులతోనే జీవిత భాగస్వామిని ఇంప్రెస్ చేయచ్చని రుజువు చేసిన విక్కీ-కత్రినాల క్యూట్ మొమెంట్స్‌ని అక్కడి ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు. ఇంకేముంది.. క్షణాల్లో ఆ వీడియోలూ వైరల్‌గా మారాయి.
‘నా భార్యను ప్రతి క్షణం ప్రత్యేకంగా చూసుకోవడానికే ప్రయత్నిస్తుంటా. తాను తన చుట్టూ ఉన్న వాళ్లను ఎంతో గౌరవిస్తుంది.. హ్యాపీగా ఉంచుతుంది. తనలో ఆ లక్షణం నాకు బాగా నచ్చుతుంది.. ఇంత అంకితభావంతో ఉన్న వాళ్లను నేనెక్కడా చూడలేదు..’ అంటూ ఈ సందర్భంగా స్పందించాడీ బాలీవుడ్ నటుడు. దీనికీ చాలామంది స్పందిస్తూ.. ‘క్యూట్ హబ్బీ’ అంటూ కామెంట్లు చేశారు.
పెళ్లి రోజే కాళ్లు పట్టించారు!
ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీ జంటల్లో జెనీలియా-రితేశ్ జోడీ ఒకటి. తమ మొదటి సినిమా ‘తుఝే మేరీ కసమ్’ తో పరిచయమై, ఆ స్నేహబంధాన్ని ప్రేమగా మార్చుకుని 2012లో పెళ్లిపీటలెక్కారీ లవ్లీ కపుల్. సందర్భమొచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు తమ ప్రేమను చాటుకునే వీరు.. ఓసారి ఓ డ్యాన్స్ రియాల్టీ షోకు న్యాయనిర్ణేతలుగా హాజరయ్యారు.
‘షాదీ స్పెషల్ థీమ్’ తో నిర్వహించిన ఈ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల ప్రదర్శన చూసిన జెనీలియా ‘ఇదంతా చూస్తుంటే నాకు మా పెళ్లి రోజు గుర్తుకు వచ్చింది. ఆ రోజు రితేశ్ 8 సార్లు నా కాళ్లు పట్టుకున్నాడు’ అని నవ్వుతూ చెప్పింది. దీనికి ప్రతిస్పందనగా రితేశ్.. ‘పెళ్లి తర్వాత ఏం చేయాలన్నది అక్కడి పురోహితులకు ముందే తెలిసి ఉంటుంది. అందుకే పెళ్లి రోజే వారు నాతో ప్రాక్టీస్ చేయించారు’ అని అనగానే అక్కడ ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. అయితే మహారాష్ట్ర వివాహ సంప్రదాయ ప్రకారం పెళ్లిలో వధువు కాళ్లకు వరుడు నమస్కరించడం ఆనవాయితీ. అందులో భాగంగానే రితేశ్ జెనీలియా కాళ్లు పట్టుకున్నాడు. అప్పట్లో ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరలైంది.
నీకెందుకు.. నేను కడతానుగా..!
బాలీవుడ్‌లో క్యూటెస్ట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు సోనమ్ కపూర్ - ఆనంద్ అహుజా దంపతులు. ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ, సందర్భం వచ్చినప్పుడల్లా భార్యాభర్తలిద్దరూ సమానమేనని చాటుతుంటారీ లవ్లీ పెయిర్. అయితే ఒకసారి దిల్లీలోని ఓ షూ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైందీ జంట. ఇద్దరూ మోడ్రన్ దుస్తుల్లో స్త్టెలిష్‌గా, మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా మెరిసిపోయారు. అంతేకాదు.. అక్కడ ఇద్దరూ ఒకే రకమైన షూస్ ధరించడంతో పాటు.. భర్త ఆనంద్ అందరి ముందూ మోకాలిపై కూర్చొని.. సోనమ్ షూ లేస్ కడుతూ కెమెరా కంటికి చిక్కాడు. ఇలా ఈ జంట స్వీట్ మొమెంట్స్‌కు అక్కడున్న వారే కాదు.. నెటిజన్లూ ఫిదా అయిపోయారు.
నేనుండగా అవి కింద పెట్టనివ్వను!
తమ మనసులో ఉన్న ప్రేమను కొన్ని క్యూట్ మూమెంట్స్ ద్వారా బయటపెడుతుంటారు బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కపుల్ దీపికా పదుకొణె - రణ్‌వీర్ సింగ్ దంపతులు. తానెప్పుడూ తన ఇష్టసఖి ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యమిస్తానంటూ, తన సౌకర్యమే నా సౌకర్యం అంటూ.. ఇలా పరోక్షంగా తాను భార్యా విధేయుడినంటూ చాటుతుంటాడు రణ్‌వీర్.
అయితే ఓసారి ముంబయిలో ఓ పెళ్లికి హాజరైంది దీప్‌వీర్ జంట. ఈ క్రమంలో హై-హీల్స్ వేసుకొన్న దీప్స్.. పెళ్లి మండపం దగ్గరకు చేరుకునే సమయంలో హీల్స్‌తో కాస్త అసౌకర్యానికి గురైంది. దీంతో ఆమె వాటిని విప్పేయడంతో.. ఆ హీల్స్‌ని పక్కన పెట్టకుండా.. తాను మోస్తూ తన భార్య వెంట నడిచాడు రణ్‌వీర్. ఇలా ఈ కపుల్‌కు సంబంధించిన ఈ లవ్లీ మొమెంట్ కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘తమకూ ఇలాంటి హజ్బెండ్ దొరికితే ఎంత బాగుంటుందో’ అంటూ చాలామంది అమ్మాయిలు ఊహల్లోకీ వెళ్లిపోయారట!
నువ్వే కొన్నావ్‌గా.. నువ్వే వెయ్యి!
క్రికెట్‌లో కూల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ.. సందర్భం వచ్చినప్పుడల్లా తన భార్య సాక్షిపై ఉన్న అనురాగాన్ని బయటపెడుతుంటాడు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం సాక్షి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్త షూస్ వేసుకుంటోన్న తనకు.. తన భర్త మహీ సహాయం చేస్తుండగా క్లిక్‌మనిపించిన ఓ అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన సాక్షి.. ‘నువ్వు కొన్న ఈ చెప్పులను నువ్వే వెయ్యి..’ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. దీంతో క్షణాల్లో ఈ ఫొటో వైరల్‌గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.