SonaHeer Wedding: ఏడేళ్ల ప్రేమకు.. మూడు ముళ్లు!

మనసుకు నచ్చిన వారిని కలుసుకున్న రోజు ఎవరికైనా ప్రత్యేకమే! ఈ క్రమంలోనే ఏళ్లు గడుస్తున్నా ఈ రోజును మాత్రం మర్చిపోరు.. తమ ప్రేమ జీవితం ప్రారంభించిన ఇదే రోజున పెళ్లి చేసుకునే వారూ కొందరుంటారు. ఆ లిస్టులో తాజాగా చేరిపోయారు బాలీవుడ్‌ లవ్లీ కపుల్‌ సోనాక్షీ సిన్హా - జహీర్‌ ఇక్బాల్‌. ఏడేళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట.. తాజాగా పెళ్లిపీటలెక్కింది.

Published : 25 Jun 2024 12:05 IST

(Photos: Instagram)

మనసుకు నచ్చిన వారిని కలుసుకున్న రోజు ఎవరికైనా ప్రత్యేకమే! ఈ క్రమంలోనే ఏళ్లు గడుస్తున్నా ఈ రోజును మాత్రం మర్చిపోరు.. తమ ప్రేమ జీవితం ప్రారంభించిన ఇదే రోజున పెళ్లి చేసుకునే వారూ కొందరుంటారు. ఆ లిస్టులో తాజాగా చేరిపోయారు బాలీవుడ్‌ లవ్లీ కపుల్‌ సోనాక్షీ సిన్హా - జహీర్‌ ఇక్బాల్‌. ఏడేళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట.. తాజాగా పెళ్లిపీటలెక్కింది. ‘ఇకపై తాము ఒకరికొకరం..’ అంటూ సంతకాలు చేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన వీళ్ల పెళ్లి ప్రస్తుతం ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’గా నిలిచింది. #SonaHeer హ్యాష్‌ట్యాగ్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరి, ఈ కొత్త జంట ప్రేమ, పెళ్లి కబుర్లేంటో తెలుసుకుందాం రండి..

ఆ పార్టీలో కలుసుకొని..!

ఒకే రంగంలో ఉన్న వారు ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్‌. సోనాక్షీ-జహీర్‌ల ప్రేమ కూడా ఇలాగే పుట్టింది. 2017లో సల్మాన్‌ ఖాన్‌ ఏర్పాటుచేసిన ఓ పార్టీలో వీళ్లిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. అయితే అప్పటికే సోనాక్షీ ‘దబాంగ్‌’, ‘తేవర్‌’.. వంటి చిత్రాలతో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇక్బాల్‌ 2019లో ‘నోట్‌బుక్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమ్యాడు. 2022లో ‘డబుల్‌ ఎక్సెల్‌’ సినిమాలో కలిసి నటించిందీ జంట. తొలి చూపులోనే ఒకరిపై ఒకరు మనసు పారేసుకున్న సోనాక్షీ-జహీర్‌లు.. రహస్యంగా తమ ప్రేమ ప్రయాణం మొదలుపెట్టారు. మొదట కొన్నేళ్ల పాటు తమ ప్రేమను కెమెరా కంటికి చిక్కకుండా జాగ్రత్తపడిన ఈ జంట.. ఆపై కలిసి దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో పాటు.. చెట్టపట్టాలేసుకొని కొన్ని ఈవెంట్లకు హాజరవడంతో.. వీళ్లిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయినా దీనిపై ఎప్పుడూ స్పందించలేదీ జంట. పలు టీవీ షోలు, ఇంటర్వ్యూల్లోనూ వ్యక్తిగతంగా వీళ్ల పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. పరోక్షంగా ఒకరి మనసుల్లో ఒకరం ఉన్నామని చెప్పకనే చెప్పారే తప్ప.. ఏనాడూ అధికారిక ప్రకటన చేసింది లేదు.

తను నా పర్సనల్‌ సైకో!

నచ్చిన వారికి ఓ ముద్దుపేరు పెట్టి పిలిస్తే.. వారు మనసుకు మరింత దగ్గరగా ఉన్నారన్న భావన కలుగుతుంది. సోనాక్షీ-ఇక్బాల్‌లూ ఇదే రిలేషన్‌షిప్‌ సీక్రెట్‌ని ఫాలో అయిపోయారు. ఇక్బాల్‌.. తన ఇష్టసఖి సోనాక్షీని ‘సోంజ్‌’ అని పిలిస్తే.. సోనాక్షీ మాత్రం ‘ఇక్బాల్‌ నా పర్సనల్‌ సైకో’ అంటూ నవ్వేస్తుంది. సహజంగానే చలాకీ మనస్తత్వం ఉన్న ఈ బాలీవుడ్‌ బ్యూటీ.. తన ప్రియుడి పైనా అంతే చలాకీగా ప్రేమ కురిపిస్తుంటుంది. ఇక వీళ్లిద్దరూ కలిసి జంటగా పలు ఈవెంట్లకు హాజరయ్యారు. గతేడాది సల్మాన్‌ ఖాన్‌ సోదరి అర్పితా ఖాన్‌-ఆయుష్‌ శర్మ ఏర్పాటుచేసిన ఈద్‌ పార్టీలో మెరిసిన ఈ ముద్దుల జంట.. ఆపై హ్యూమా ఖురేషీ పుట్టినరోజు వేడుకలోనూ సందడి చేసింది. అంతేకాదు.. బాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ మేనకోడలు, నటి షర్మిన్‌ సెహ్‌గల్‌ వివాహ రిసెప్షన్‌లోనూ జంటగానే మెరిశారీ లవ్‌బర్డ్స్‌. ఇక ఇద్దరూ కలిసి పలు సందర్భాల్లో దిగిన ఫొటోలు, వెకేషన్‌ ఫొటోల్నీ సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తాము ప్రేమలో ఉన్నామని చెప్పకనే చెప్పిందీ కొత్త జంట.

అమ్మ చీరలో వధువుగా!

అయితే తమ ప్రేమ గురించి ఇన్నాళ్లూ మౌనం వహించిన ఈ జంట.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలొచ్చాయి. అయినా పెదవి విప్పని ఈ జంట.. ఫ్యాన్స్‌ అంచనాల్ని నిజం చేస్తూ తాజాగా పెళ్లి పీటలెక్కింది. సాధారణంగానే సింప్లిసిటీకి ప్రాధాన్యమిచ్చే సోనాక్షీ.. తన వివాహాన్నీ అంతే సింపుల్‌గా జరుపుకొంది. సింపుల్‌గా అలంకరించిన పెళ్లి వేదికపై.. రిజిస్టర్‌ మ్యారేజ్‌ తరహాలో ఇద్దరూ వివాహ పత్రాలపై సంతకాలు చేసి భార్యాభర్తలయ్యారు.

ఇక తన పెళ్లి కోసం తన తల్లి పూనమ్‌ సిన్హా చీరను ఎంచుకుంది సోనాక్షీ. ఐవరీ కలర్‌ ఎంబ్రాయిడరీ చీరకు.. పొడవాటి స్ట్రైప్స్‌ ఉన్న బ్లౌజ్‌ను జత చేసి సింప్లీ సూపర్బ్‌ అనిపించుకుంది. ఇలా చీరే కాదు.. తాను ధరించిన డైమండ్‌ నెక్లెస్‌ కూడా ఆమె తల్లిదే! తన అవుట్‌ఫిట్‌కు జతగా బన్‌ హెయిర్‌స్టైల్‌ వేసుకొని.. మల్లెపూలతో అలంకరించుకొని.. తక్కువ మేకప్‌తో మెరుపులు మెరిపించిందీ బాలీవుడ్‌ సొగసరి. ఇక ఇక్బాల్‌ కూడా తన ఇష్టసఖి లుక్‌ను మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ చేసేలా తెలుపు రంగు కుర్తా-పైజామాలో ముస్తాబయ్యాడు. పెళ్లిలో ఇలా వీళ్ల సింప్లిసిటీకి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ‘ఈ జంట వివాహం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం!’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం #SonaHeer హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సరిగ్గా ఏడేళ్ల క్రితం..!

ప్రేమను పెళ్లి పీటలెక్కించి.. తాము కొత్త జీవితం ప్రారంభించిన ఈ రోజు తమ జీవితాల్లో ఎంతో ప్రత్యేకమైందని అంటున్నారు సోనాక్షీ-జహీర్‌. తమ పెళ్లి ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ.. అందరి ఆశీస్సులు కోరిందీ అందాల జంట.

‘సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున (జూన్‌ 23, 2017) ఇద్దరం కలుసుకున్నాం.. తొలి చూపులోనే మాలో ప్రేమ పుట్టింది. ఒకరి కోసమే మరొకరం పుట్టామని త్వరలోనే గ్రహించిన మేము.. పెళ్లితో మా అనుబంధాన్ని శాశ్వతం చేసుకోవాలనుకున్నాం. ఆ శుభఘడియ ఇప్పుడు వచ్చింది. ఇరు కుటుంబాల సమ్మతి, ఆ దేవుడి ఆశీస్సులతో ఇద్దరం ఒక్కటయ్యాం. మా ప్రేమ, ఆశలు, ఆశయాలు.. మమ్మల్ని ఎప్పుడూ కలిసి నడిచేలా ప్రేరేపిస్తాయి..’ అంటూ మురిసిపోతున్నారీ ముద్దుల జంట. ప్రస్తుతం వీళ్ల పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.

ఇక పెళ్లి తర్వాత బాలీవుడ్‌ ప్రముఖులు, స్నేహితులు, సన్నిహితుల కోసం రిసెప్షన్‌ ఏర్పాటుచేసింది సోనాక్షీ-జహీర్‌ జంట. ఈ వేడుకలో ఎరుపు రంగు పట్టు చీర, పాపిట్లో సింధూరం, గోరింటాకుతో సంప్రదాయబద్ధంగా మెరిసిందీ కొత్త పెళ్లి కూతురు. ఇలా ఈ వేడుకలోనూ సంప్రదాయానికి.. నిండుదనానికి ప్రాధాన్యమిచ్చిందీ బాలీవుడ్‌ బ్రైడ్.

కంగ్రాట్స్‌ క్యూట్‌ కపుల్!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్