Neha Dhupia: అలా 12 నెలల్లో.. 23 కిలోలు తగ్గా!

‘దాదీ ధూపియా’, ‘గ్రాండ్‌మా’, ‘మోటీ’, ‘తిమింగలం’.. ప్రసవానంతరం బరువు పెరిగిన బాలీవుడ్‌ బ్యూటీ నేహా ధూపియాకు ఎదురైన విమర్శలివి! అయినా వీటిని పట్టించుకోలేదామె. తనకు నచ్చినట్లుగానే ఉండాలనుకుంది. అవసరమైనప్పుడే బరువు తగ్గాలని నిర్ణయించుకుంది.

Updated : 06 Jul 2024 21:54 IST

(Photos: Instagram)

‘దాదీ ధూపియా’, ‘గ్రాండ్‌మా’, ‘మోటీ’, ‘తిమింగలం’.. ప్రసవానంతరం బరువు పెరిగిన బాలీవుడ్‌ బ్యూటీ నేహా ధూపియాకు ఎదురైన విమర్శలివి! అయినా వీటిని పట్టించుకోలేదామె. తనకు నచ్చినట్లుగానే ఉండాలనుకుంది. అవసరమైనప్పుడే బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. అయితే ఆ సమయం ఇప్పుడొచ్చిందంటోంది నేహ. గత ఏడాది కాలంలో సుమారు 23 కిలోల బరువు తగ్గిన ఆమె.. మునుపటి కంటే కొత్తగా, ఆరోగ్యంగా ఫీలవుతున్నానంటోంది.. కెరీర్‌లోనూ బిజీ అయ్యానంటోంది. మరి, 12 నెలల్లో నేహ ఇన్ని కిలోలు ఎలా తగ్గగలిగింది? ఎలాంటి డైట్ ఫాలో అయింది? ఏయే వ్యాయామాలు చేసింది? ఈ విషయాలన్నీ ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుందీ బాలీవుడ్‌ మామ్.

నాకు నచ్చినట్లుంటా!

నేహా ధూపియా.. మనసు చెప్పిందే ఫాలో అయిపోయే ముక్కుసూటి వ్యక్తిత్వం ఆమెది! ఎవరేమన్నా పట్టించుకోదు.. విమర్శల్నీ సానుకూలంగా స్వీకరించే పాజిటివిటీ ఆమె సొంతం. అయితే ముందు నుంచే కాస్త బొద్దుగా ఉండే నేహ.. 2018లో నటుడు అంగద్‌ బేడీని వివాహం చేసుకుంది. ఆపై కూతురు మెహ్ర్‌, కొడుకు గురిఖ్లకు జన్మనిచ్చింది. కెరీర్‌ కంటే అమ్మతనానికే ప్రాధాన్యమిచ్చిన ఈ చక్కనమ్మ.. రెండుసార్లు ప్రసవానంతరం బరువు పెరిగినా పట్టించుకోలేదు. లావుగా ఉన్నావంటూ విమర్శలొచ్చినా.. ‘ఇది బరువు తగ్గే సమయం కాదం’టూ పిల్లల బాధ్యతలకే ఓటేసిందామె. అయితే పిల్లలు కాస్త పెద్దవడంతో గతేడాది కాలంగా బరువు తగ్గడంపై దృష్టి పెట్టిన నేహ.. సుమారు 23 కిలోలు తగ్గానంటూ తన అనుభవాల్ని ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది.

ఏడాది పాటు పాలిచ్చా!

‘2018, నవంబర్‌లో నా పాప మెహ్ర్‌ పుట్టింది. ఆపై కొన్ని రోజులకు మన దేశంలో కరోనా విజృంభించడంతో లాక్‌డౌన్‌ మొదలైంది. ఆ సమయంలో ఆహార నియమాలతో కాస్త బరువు తగ్గా. కానీ ఏడాది గ్యాప్‌తో మళ్లీ గర్భం ధరించా. దాంతో మళ్లీ బరువు పెరిగా. ఇలా గత నాలుగేళ్లలో నా శరీర బరువు పెరుగుతూ, తగ్గుతూ పోయింది. నేనూ నా పిల్లల ఆలనా పాలనకే ఎక్కువ సమయం కేటాయించేదాన్ని. దాంతో బరువు తగ్గాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. పైగా ప్రసవానంతరం నేను అందంగా లేనేమోనని అస్సలు బాధపడలేదు. నా పిల్లలిద్దరికీ ఏడాది పాటు తల్లి పాలే ఇచ్చా. దీంతో నాలో ఆకలి పెరిగింది.. శక్తి స్థాయులు క్షీణించాయి. తిరిగి పునరుత్తేజితం కావడానికి, పిల్లలకు సరిపడా పాలు ఉత్పత్తి కావడానికి చక్కటి పోషకాహారం తీసుకున్నా.. అంతేకానీ బరువు తగ్గాలని కడుపు మాడ్చుకోలేదు.. అయితే ప్రసవానంతరం నేను పెరిగిన బరువును తగ్గించుకోవడంపై కచ్చితంగా దృష్టి పెట్టింది మాత్రం ఏడాది క్రితమే! ఈ క్రమంలోనే ఇప్పటివరకు సుమారు 23 కిలోలు తగ్గా. ఇది నేను పెట్టుకున్న లక్ష్యం కాదు.. కానీ దానికి దగ్గర్లో ఉన్నా.. త్వరలోనే దాన్ని చేరుకుంటా..’ అంటోంది నేహ.

సింపుల్‌గానే తగ్గా!

త్వరగా బరువు తగ్గాలని క్రాష్‌ డైట్లు పాటిస్తుంటారు కొందరు.. కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. తాను ఇందుకు పూర్తి భిన్నం అంటోంది నేహ. డైట్‌ పేరుతో కడుపు మాడ్చుతూ, కఠినమైన వ్యాయామాలతో శరీరాన్ని కష్టపెట్టకుండా సింపుల్‌ లైఫ్‌స్టైల్‌తోనే బరువు తగ్గానంటోంది.

‘శరీరంలో పేరుకుపోయిన క్యాలరీలన్నీ ఒకేసారి ఖర్చు చేయాలని నేను కోరుకోలేదు. ఎందుకంటే నేనో వర్కింగ్‌ మదర్‌ని! ఇంటిని, కెరీర్‌ని బ్యాలన్స్‌ చేసుకోవడానికి నాకూ కొంత శక్తి కావాలి. అందుకే నెమ్మదిగానే బరువు తగ్గా. ఈ క్రమంలో డైటింగ్‌ పేరుతో కడుపు మాడ్చుకోవడం కాకుండా.. ఆరోగ్యానికి నష్టం చేసే పదార్థాల్ని పక్కన పెట్టడం అలవాటు చేసుకున్నా. చక్కెర, ఫ్రైడ్‌ ఫుడ్స్‌, గ్లూటెన్‌ ఉండే పదార్థాలు.. వంటివి పూర్తిగా పక్కన పెట్టేశా. ఏది తిన్నా పోషకాలు సమతులంగా ఉండేలా చూసుకున్నా. ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేశానని చెప్పను కానీ.. నా రోజువారీ లైఫ్‌స్టైల్‌ దాదాపు అలాగే ఉండేది. ఎందుకంటే రాత్రి 7 గంటల కల్లా నా పిల్లలతో కలిసి డిన్నర్‌ చేసేదాన్ని. ఇక మరుసటి రోజు ఉదయం 11 గంటలకు నా భర్త అంగద్‌తో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ తినేదాన్ని. ఈ మధ్యలో ఏమీ తీసుకునేదాన్ని కాదు. ఇక వ్యాయామాలంటూ నేను పెద్దగా ఏమీ చేయలేదు. అప్పుడప్పుడూ జిమ్‌కి వెళ్లేదాన్ని. రోజూ రన్నింగ్‌ మాత్రం చేసేదాన్ని. ఇవే నేను బరువు తగ్గేందుకు దోహదం చేశాయి..’ అంటూ తన వెయిట్‌లాస్‌ సీక్రెట్స్‌ని పంచుకుందీ బ్యూటిఫుల్‌ మామ్.

ఆఫర్లు పెరుగుతున్నాయ్!

సినిమా రంగమంటేనే అందానికి, ఫిట్‌నెస్‌కు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం బరువు తగ్గి నాజూగ్గా మారాక.. తనకూ ఆఫర్లు పెరుగుతున్నాయంటోంది నేహ.

‘బరువు తగ్గాక నా శరీరమే కాదు.. మనసూ తేలికపడింది. నాలో ఆత్మవిశ్వాసమూ పెరిగింది. నాకు నచ్చిన దుస్తుల్లో సౌకర్యంగా ఫీలవుతున్నా. అయితే కెమెరా ముందు మనం ఎలా కనిపిస్తున్నామన్న దానికే అధిక ప్రాధాన్యం ఉంటుంది. కానీ నాకు నచ్చినట్లుగా నేను ఉండడానికే ఇష్టపడతా. ఏదేమైనా బరువు తగ్గాక నాకు ఆఫర్లు పెరుగుతున్నాయన్నది మాత్రం వాస్తవం. చివరగా కొత్తగా తల్లైన మహిళలకు కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నా.. ప్రసవానంతరం బరువు తగ్గే విషయంలో తొందర పనికిరాదు. అలాగే శరీరాకృతి, అందం విషయాల్లో ఇతరులతో పోల్చుకోవడమూ సరికాదు. కాబట్టి స్వీయ ప్రేమను పెంచుకోండి.. సమాజం నుంచి ఎదురయ్యే విమర్శలకు తలొగ్గకుండా మీకు నచ్చినట్లుగా మీరు జీవించండి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి..’ అంటూ ఈతరం తల్లుల్లో స్ఫూర్తి నింపుతోంది ఈ బాలీవుడ్‌ మామ్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్