అందుకే తల్లిపాలు ఇవ్వాల్సిందే!

ఏటా ఆగస్టు మొదటి వారంలో (ఆగస్టు 1 నుంచి 7 వరకు) తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి. ఈ క్రమంలో తల్లిపాల వల్ల పిల్లలకు, పాలివ్వడం వల్ల తల్లికి కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాల గురించి తెలుసుకోవడం సందర్భోచితం.

Published : 02 Aug 2023 12:19 IST

తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. సకల పోషకాల మిళితమైన ఈ పాలు పసిపిల్లల్ని బాలారిష్టాల నుంచి రక్షించడంలో తోడ్పడతాయి. అయితే కొంతమంది తల్లులు ఉద్యోగం, ఇతర కారణాల రీత్యా చంటి పిల్లలకు పాలివ్వడం కొన్ని నెలల్లోనే ఆపేసి డబ్బా పాలను ఆశ్రయిస్తుంటారు. ఇది ఆరోగ్యపరంగా అటు బిడ్డకు, ఇటు తల్లికి మంచిది కాదు. అందుకే బిడ్డకు తల్లిపాల ఆవశ్యకత గురించి మహిళల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఏటా ఆగస్టు మొదటి వారంలో (ఆగస్టు 1 నుంచి 7 వరకు) తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి. 
ఈ క్రమంలో తల్లిపాల వల్ల పిల్లలకు, పాలివ్వడం వల్ల తల్లికి కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాల గురించి తెలుసుకోవడం సందర్భోచితం.

బిడ్డకు కలిగే ప్రయోజనాలివే!

ఎంతో తాజాగా!

ఏ వయసు వారైనా సరే.. ఆహార పదార్థాలు ఎంత తాజాగా తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఇది పసిపిల్లలకూ వర్తిస్తుంది. తల్లిపాలు బిడ్డకు ఎప్పటికప్పుడు తాజాగా, వారికి కావాల్సిన ఉష్ణోగ్రత వద్ద లభిస్తాయి. అంతేకాదు.. వాటిలో ఎలాంటి హానికరమైన సూక్ష్మక్రిములు ఉండవు. కాబట్టి తల్లిపాలు తాగడం వల్ల పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు.

జీర్ణవ్యవస్థ పదిలం!

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నాలుగైదు రోజుల వరకూ తల్లి వక్షోజాల్లో ఉత్పత్తయ్యే పాలను 'ముర్రు పాలు' అంటారు. ఇవి పాపాయికి ఎలాంటి అలర్జీ, ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడతాయి. అలాగే ఈ పాలు బిడ్డ జీర్ణవ్యవస్థకు ఎలాంటి హాని కలగకుండా రక్షిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి పాపాయికి ఈ పాలు పట్టించడం వారి ఆరోగ్యానికి, ఎదుగుదలకు చాలా అవసరం.

అపార తెలివితేటలు..

తల్లిపాలు తాగి పెరిగిన పిల్లల మెదడు చురుగ్గా పని చేస్తుందని, అలాంటి వారు చదువులో బాగా రాణిస్తారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి పిల్లలు బాగా చదవాలన్నా, భవిష్యత్తులో అభివృద్ధి సాధించాలన్నా పుట్టిన పాపాయికి కొన్ని నెలల పాటు తల్లిపాలను అందించడం తప్పనిసరి.

పోషకాల ఖజానా!

తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానం. ఈ పాలలో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు.. వంటి ఎన్నో పోషకాలతో పాటు పాపాయి శరీరానికి అవసరమైన కొవ్వులు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి తోడ్పడతాయి. అలాగే తల్లిపాలు సులభంగా జీర్ణమవడంతో పిల్లలకు మలబద్ధకం, జీర్ణసంబంధిత సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తపడచ్చు.

వయసుకు తగ్గ బరువు!

ఎదిగే బిడ్డ వయసుకు తగ్గ బరువు ఉండేలా చూడడంలోనూ తల్లిపాలు కీలకపాత్ర పోషిస్తాయి. కేవలం ఇప్పుడే కాదు.. పెద్దయ్యాక కూడా అధిక బరువు, స్థూలకాయం.. వంటి సమస్యల బారిన పడకుండా కూడా కాపాడతాయి.

ఆర్నెళ్ల తర్వాత కూడా!

బిడ్డకు ఆరు నెలల వయసొచ్చే వరకు తల్లిపాలే సంపూర్ణ ఆహారం. ఆరు నెలలు దాటిన తర్వాత చాలామంది పిల్లలకు ఘనాహారం ఇస్తుంటారు. ఈ క్రమంలో తల్లిపాలు ఇవ్వడం ఆపేస్తుంటారు. ఫలితంగా పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆరు నెలలు దాటిన తర్వాత కూడా పిల్లలకు ఘనాహారంతో పాటు మధ్యమధ్యలో తల్లిపాలు కూడా ఇవ్వడం మంచిది. కనీసం సంవత్సరం వరకైనా వీటిని కొనసాగించడం తల్లీబిడ్డలిద్దరికీ శ్రేయస్కరం.

దృఢమయ్యే అనుబంధం!

తల్లి, బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లీబిడ్డలిద్దరి మధ్య ఉండే బంధం మరింత దృఢమవుతుందని చెబుతున్నారు నిపుణులు. పిల్లలు తల్లిపాలు తాగుతున్న క్రమంలో తల్లి ప్రేమ, ఆప్యాయతను చవిచూస్తారు. అలాగే తల్లి ఒడిని మించిన సురక్షితమైన ప్రదేశం మరెక్కడా లేదనే భావన వారిలో కలుగుతుంది. ఈ భావాలన్నీ పిల్లలకు తల్లిపై, తల్లికి పిల్లలపై ఉండే ప్రేమను మరింతగా పెంచి వారిద్దరి మధ్య బంధాన్ని పటిష్టం చేస్తాయి.

ప్రయోజనాలు మరెన్నో!

తల్లిపాలు తాగడం వల్ల క్యాన్సర్లు, గుండె సంబంధిత సమస్యల ముప్పు చాలా వరకు తగ్గుతుందనేది నిపుణుల అభిప్రాయం.

తల్లిపాలు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

తల్లిపాలు తాగి పెరిగిన పిల్లల శరీరంపై అన్ని రకాల వ్యాక్సిన్లు బాగా పని చేస్తాయని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది.

తల్లిపాలు తాగిన పిల్లలకు పెరిగి పెద్దయ్యాక మధుమేహం బారిన పడే ముప్పూ తక్కువేనంటున్నాయి కొన్ని అధ్యయనాలు.


తల్లికీ ఎంతో మంచిది..!

తల్లి పాలు తాగడం వల్ల పాపాయికే కాదు.. పాలిచ్చే తల్లికీ ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటంటే..

బిడ్డ రొమ్ము పట్టినప్పుడు తల్లి మెదడు నుంచి సంకేతాలు వెలువడి.. ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది పాలు పడడానికే కాకుండా గర్భాశయం త్వరగా సంకోచించడానికీ దోహదం చేస్తుంది. దీంతో కాన్పు తర్వాత రక్తస్రావమూ తగ్గుతుంది. ఎందుకంటే మాతృ మరణాల్లో చాలావరకు రక్తస్రావం ఆగకపోవడమే ప్రధాన కారణమట.

కాన్పు తర్వాత ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు.. వంటివి బిడ్డకు పాలివ్వడం వల్ల తగ్గుముఖం పడతాయి.

బిడ్డకు పాలివ్వడం వల్ల ప్రెగ్నెన్సీలో పెరిగిన బరువును సైతం సులభంగా తగ్గచ్చు. అదెలాగంటే.. పాపాయికి పాలు పట్టే క్రమంలో తల్లి శరీరంలోని క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. తద్వారా తల్లులు ఈజీగా బరువు తగ్గేయచ్చు.

పాలు పట్టడం వల్ల తల్లి మధుమేహం, అధిక రక్తపోటు బారిన పడే అవకాశం చాలావరకు తగ్గుతుంది.

పాలివ్వడం వల్ల నిద్ర కూడా హాయిగా పడుతుంది. చక్కటి మానసిక ఆరోగ్యానికీ, భావోద్వేగాల నియంత్రణకూ ఈ ప్రక్రియ తోడ్పడుతుంది.

బుజ్జాయికి పాలు పడుతున్నప్పుడు నెలసరి కాస్త ఆలస్యంగా వస్తుంది. తద్వారా ఆ వెంటనే గర్భం ధరించే అవకాశమూ చాలావరకు తగ్గుతుంది.

బిడ్డకు పాలిచ్చే మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ముప్పు తక్కువని.. గుండె జబ్బులు, ఎముకలు గుల్లబారే అవకాశం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్