Miss Universe 2023 : ఒత్తిడిని జయించి.. కిరీటం గెలిచి..!

జీవితంలో ఒడిదొడుకులు సహజం. ‘సవాళ్లకు ఎదురొడ్డి సానుకూల దృక్పథంతో అడుగు ముందుకు వేయాలంటే మనసును అర్థం చేసుకోవడం ముఖ్యమం’టోంది కొత్త విశ్వసుందరి షెన్నిస్‌ పలాసియోస్‌.

Published : 21 Nov 2023 12:23 IST

(Photos: Instagram)

జీవితంలో ఒడిదొడుకులు సహజం. ‘సవాళ్లకు ఎదురొడ్డి సానుకూల దృక్పథంతో అడుగు ముందుకు వేయాలంటే మనసును అర్థం చేసుకోవడం ముఖ్యమం’టోంది కొత్త విశ్వసుందరి షెన్నిస్‌ పలాసియోస్‌. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలకు పైగా సుందరాంగిణుల్ని వెనక్కి నెట్టి తాజాగా ఈ ఏటి ‘మిస్‌ యూనివర్స్‌’గా అవతరించిందీ నికరాగ్వా భామ. తద్వారా తన దేశానికి తొలి విశ్వ సుందరి కిరీటాన్ని అందించిన ఘనతనూ తన సొంతం చేసుకుంది. వృత్తిరీత్యా జర్నలిస్ట్‌ అయిన ఈ ముద్దుగుమ్మ.. అసలు అందాల పోటీల వైపు ఎలా వచ్చిందో తెలుసుకుందాం రండి..

మనసు సమస్య తెలుసుకొని..!

షెన్నిస్‌.. నికరాగ్వా రాజధాని మనగ్వాలో జన్మించింది. ఆమెకు చిన్న వయసు నుంచి అందాల పోటీల్లో పాల్గొనాలని కల. కాలేజీలో ఉన్నప్పుడే క్యాంపస్‌లో నిర్వహించిన పలు అందాల పోటీల్లో పాల్గొని కిరీటాలు గెలుచుకుంది. ‘సెంట్రల్‌ అమెరికన్‌ యూనివర్సిటీ’లో మాస్‌ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన షెన్నిస్‌.. ఈ యూనివర్సిటీలో చదువుకునే సమయంలోనే ఉన్నట్లుండి తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లిపోయేది. దీన్నుంచి బయటపడేందుకు జీవనశైలిలో పలు మార్పులు చేర్పులు చేసుకున్న ఆమె.. ఇలాంటి మానసిక వ్యాధులున్న వారిలో అవగాహన కల్పించాలనుకుంది. ఈ ఆలోచనతోనే ‘Understand Your Mind’ అనే ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే మానసిక సమస్యలపై ఉన్న మూసధోరణుల్ని బద్దలుకొట్టి.. ప్రతి ఒక్కరినీ పాటిజిటివిటీ దిశగా నడిపిస్తోంది షెన్నిస్‌.

కిరీటాల వేట!

చదువు పూర్తయ్యాక జర్నలిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించింది షెన్నిస్‌. అక్కడి ఓ స్థానిక మీడియా సంస్థలో ప్రొడ్యూసర్‌గా, ఎడిటర్‌గా పనిచేసిన ఆమె.. మోడలింగ్‌ను తన ప్రవృత్తిగా మార్చుకుంది. ఈ క్రమంలోనే పలు ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ బ్రాండ్లకు మోడలింగ్‌ చేసిన ఈ బ్యూటీ.. 2016లో ‘మిస్‌ టీన్‌ నికరాగ్వా’ టైటిల్‌ గెలిచి.. అందాల కిరీటాల వేట ప్రారంభించింది. ఆ మరుసటి ఏడాది ‘టీన్‌ మిస్‌ యూనివర్స్‌’ పోటీల్లో టాప్‌-10లో నిలిచిన షెన్నిస్‌.. ఆపై ‘మిస్‌ వరల్డ్‌ నికరాగ్వా - 2020’గా అవతరించింది. ఇక ఇదే పోటీల్లో ప్రపంచవేదికపై తన దేశం తరఫున పాల్గొన్న ఆమె.. టాప్‌-40లో చోటుదక్కించుకుంది. ఈ ఏడాది జరిగిన ‘మిస్‌ నికరాగ్వా - 2023’ పోటీల్లో కిరీటం నెగ్గిన ఈ ముద్దుగుమ్మ.. ఈ అందాల పోటీ వేదికపైనా మానసిక ఆరోగ్యంపై అందరిలో అవగాహన పెంచే ప్రయత్నం చేసింది. సమాజ శ్రేయస్సు కోసం ఆమె చూపిన ఈ చొరవే.. విశ్వ వేదికపై పోటీ పడేందుకు మార్గం సుగమం చేసిందని చెప్పచ్చు.

ఆ ‘జవాబు’కు ఫిదా!

ఇక తాజాగా సెంట్రల్‌ అమెరికాలో జరిగిన ‘విశ్వ సుందరి’ పోటీల్లో తన దేశం తరఫున పాల్గొని ఈ ఏడాది కిరీటాన్ని ఎగరేసుకుపోయింది షెన్నిస్‌. తద్వారా తన దేశానికి తొలి విశ్వ సుందరి కిరీటం అందించిన అరుదైన ఘనతను సొంతం చేసుకుందామె. ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా అందాల రాణులు ఈ పోటీలో నిలవగా.. వారందరినీ వెనక్కి నెట్టి కిరీటం తలపై అలంకరించుకుందీ నికరాగ్వా బ్యూటీ. అయితే ఈ విజయంలో తన అందం, ఆత్మసౌందర్యమే కాదు.. ఫైనల్‌ రౌండ్‌లో తాను చెప్పిన సమాధానం కూడా కీలకంగా మారిందని చెప్పచ్చు. తుది రౌండ్లో న్యాయనిర్ణేతలు అడిగిన ‘అవకాశమొస్తే ఏడాది పాటు ఎవరిలా ఉండడానికి ఇష్టపడతారు?’ అన్న ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానమిచ్చిందీ అందాల భామ.

‘ఏడాది పాటు మరొకరిలా ఉండే అవకాశమొస్తే.. 18వ శతాబ్దానికి చెందిన బ్రిటిష్‌ తత్త్వవేత్త మేరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్‌లా ఉండాలనుకుంటా. తను మహిళల హక్కులు, వారి అభ్యున్నతి కోసం పోరాడిన స్త్రీవాది. మూసధోరణులు బద్దలుకొట్టి వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించేలా ఎంతోమంది మహిళలకు అవకాశాలు కల్పించారామె. స్త్రీలు తలచుకుంటే ఎక్కడైనా విధులు నిర్వర్తించగల సమర్థులు అని ఆమె నిరూపించారు. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేయగలుగుతున్నారంటే.. ఆమె చూపిన మార్గం కూడా ఓ కారణమే! అందుకే నేనూ ఆమె బాటలో నడవాలనుకుంటున్నా. మహిళలకు అనుకూలమైన పరిస్థితులు కల్పించేలా నా వంతుగా కృషి చేయాలనుకుంటున్నా..’ అంటూ తన సమాధానంతో న్యాయనిర్ణేతల్నే కాదు.. అక్కడున్న వారందరినీ మెప్పించింది షెన్నిస్‌. తనను తాను బలమైన మహిళగా చెప్పుకునే ఈ ముద్దుగుమ్మకు.. సూర్యాస్తమయమన్నా, తన కుటుంబం-పెంపుడు జంతువులన్నా ప్రాణమట! ఇక చదువుకునే రోజుల్లో వాలీబాల్‌ బాగా ఆడేదాన్నంటోన్న ఈ చక్కనమ్మ.. ఈ క్రీడలో పలుమార్లు తన జట్టునూ గెలిపించానంటోంది.


మలాలా నా స్ఫూర్తి!

అఫ్గానిస్థాన్‌ ఉద్యమకారిణి మలాలా యూసఫ్‌జాయ్‌ ఎంతోమంది యువతులకు/మహిళలకు ఆదర్శం! వారిలో తానూ ఒకరని చెబుతోంది ‘మిస్‌ యూనివర్స్‌-2023’ తొలి రన్నరప్‌ Anntonia Porsild. అందాల పోటీ వేదికపై షెన్నిస్‌ని అడిగిన ప్రశ్నే అంటోనియానూ అడిగారు న్యాయనిర్ణేతలు. ఇందుకు ‘ఏడాది పాటు మరో మహిళగా ఉండే అవకాశమొస్తే.. నేను మలాలాలా ఉండాలనుకుంటా. ఆమె పడిన కష్టాలేంటో నాకు తెలుసు. కష్టాల నుంచే ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం ఉద్భవిస్తుందనడానికి ఆమే ఆదర్శం! బాలికా/స్త్రీ విద్య కోసం ఆమె ఎంతగానో పోరాడింది. మహిళలందరూ బలంగా నిలబడగలిగే స్ఫూర్తినిచ్చింది..’ అంటూ ఆమె చెప్పిన సమాధానం అక్కడున్న వారిని ఆకట్టుకోవడమే కాదు.. సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

ఇక ఈ పోటీలో మూడో స్థానంలో నిలిచిన ఆసీస్‌ మోడల్‌ మొరాయా విల్సన్‌ ‘నా తల్లే నాకు స్ఫూర్తి. ధైర్యంగా, బలంగా ఉండడమెలాగో ఆమెను చూసి నేర్చుకున్నా. అందుకే అవకాశమొస్తే అమ్మలాగే ఉండాలనుకుంటా..’ అంటూ తన సమాధానంతో అందరి మనసులు గెలుచుకుంది.


ఆత్మవిశ్వాసమే ఆయుధం!

‘పోటీలో గెలవకపోతే జీవితాన్ని కోల్పోయినట్లు కాదు.. మరో అవకాశం మన కోసం ఎదురుచూస్తుందని నమ్ముతా’నంటోంది చండీగఢ్‌కు చెందిన శ్వేత శార్దా. తాజా విశ్వసుందరి పోటీల్లో టాప్‌-20లో చోటుదక్కించుకున్న ఈ ఇండియన్‌ బ్యూటీ.. చిన్నతనం నుంచి పలు కష్టాల్ని ఎదుర్కొంది. చిన్న వయసులోనే తన తల్లిదండ్రులిద్దరూ విడిపోవడం వల్ల మానసికంగా కుంగిపోయిన ఆమె.. తల్లి వద్దే పెరిగింది. ఈ క్రమంలో ఒంటరి తల్లిగా ఆమె పడిన కష్టాల్ని దగ్గర్నుంచి గమనించిన శ్వేత.. ఎప్పటికైనా తన తల్లి గర్వపడే స్థాయికి ఎదగాలనుకుంది. ఈ పట్టుదలకు తోడు తన తల్లి తనలో నింపిన ఆత్మవిశ్వాసంతో ‘మిస్‌ దివా యూనివర్స్‌ - 2003’ కిరీటం గెలుచుకుంది. ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌ కావాలన్నది శ్వేత కల. అందుకు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా.. ఇటు చదువుకుంటూనే, అటు గంటల తరబడి సొంతంగానే నృత్య సాధన చేసేది. ఆపై ‘డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌’, ‘డ్యాన్స్‌ దీవానే’, ‘డ్యాన్స్‌ ప్లస్‌’.. వంటి రియాల్టీ షోల్లో గెలుపొందిన ఆమె.. ‘ఝలక్‌ దిఖ్‌లాజా’ షోకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే దీపికా పదుకొణె, మాధురీ దీక్షిత్‌, కత్రినా కైఫ్‌.. వంటి బాలీవుడ్‌ తారలకు కొరియోగ్రఫీ చేసే అవకాశం శ్వేతకు దక్కింది.

‘నాకొచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవాలనుకోలేదు. అందుకే అందాల పోటీల్లో నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నా. ఇందులో విజయం వరించలేదు. అయినా నిరాశపడను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొత్త లక్ష్యాల్ని ఏర్పరచుకుంటా..’ అంటూ నిండైన ఆత్మవిశ్వాసంతో చెబుతోందీ చండీగఢ్‌ బ్యూటీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని