Published : 30/03/2022 14:37 IST

Geeta Ben: ఆమె పాటకు ‘డాలర్ల’తో పట్టాభిషేకం!

(Photos: Instagram)

‘మానవత్వం మనిషి గుణగణాల్లోనే కాదు.. చేతల్లోనూ కనిపిస్తుందం’టారు. ఇందుకు తాజా ఉదాహరణే గుజరాత్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని గీతా బెన్‌ రబరీ. తన అద్భుత గాత్రంతో సంగీత ప్రియుల్ని ఓలలాడించే ఆమె.. ఈసారి తనలో ఉన్న ఈ ప్రత్యేక నైపుణ్యాల్ని నిధుల సమీకరణ కోసం ఉపయోగించింది. రష్యాతో యుద్ధంలో సర్వం కోల్పోయిన ఉక్రెయిన్‌కు తన వంతుగా సహాయసహకారాలు అందించడానికి అమెరికా వేదికగా నిర్వహించిన ఓ సంగీత కచేరీలో పాలుపంచుకుంది గీత. ఇక్కడా ఆమె గాత్రానికి కోట్ల కొద్దీ కాసుల వర్షం కురిపించారు ప్రేక్షకులు. ఇలా దీని ద్వారా రెండు కోట్లకు పైగా నిధులు పోగు చేసి తనలోని మానవత్వాన్ని చాటుకుంది. ఈ కచేరీకి సంబంధించిన ఫొటోల్ని ఆమె సోషల్‌ మీడియాలో పంచుకోగా.. అవి కాస్తా వైరలవుతున్నాయి. ఈ గుజరాతీ సింగర్‌ మంచితనానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

రష్యాతో యుద్ధం నేపథ్యంలో సర్వం కోల్పోయిన ఉక్రెయిన్‌కు ప్రపంచదేశాల నుంచి ఆర్థిక సహాయం అందుతూనే ఉంది. ఈ క్రమంలో వివిధ దేశాలతో పాటు పలువురు ప్రముఖులూ తమకు తోచిన సహాయం అందిస్తున్నారు. ఈ జాబితాలో గుజరాతీ జానపద గాయని గీతా బెన్‌ రబరీ కూడా చేరిపోయింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని అట్లాంటాలో ప్రవాస భారతీయులు నిర్వహించిన ఓ సంగీత కచేరీలో ఇటీవలే పాల్గొంది గీత.

పాటకు ‘డాలర్ల’తో పట్టాభిషేకం!

‘లోక్‌ దైరో’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా గుజరాతీ జానపద పాటలు ఆలపించింది గీత. ఇప్పటికే తన మధురమైన గాత్రంతో దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఆమె పాటలకు ఎన్నారైలు ఫిదా అయ్యారు. దీంతో వేదికపై గాత్ర కచేరీ చేస్తోన్న సమయంలోనే ఆమెపై డాలర్ల వర్షం కురిపించారు. ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తంగా రూ. 2.25 కోట్ల నిధులు సమీకరించిందీ గుజరాతీ సింగర్‌. వీటిని ఉక్రెయిన్‌ యుద్ధ బాధితులకు అందించనుందామె. ఇప్పుడనే కాదు.. గతంలోనూ వివిధ దేశాల్లో ఇలాంటి సంగీత కచేరీల్లో పాల్గొని అక్కడి సంగీత ప్రియుల్ని అలరించిందామె. ఇక ప్రస్తుత గాత్ర కచేరీకి సంబంధించిన ఫొటోల్ని ఆమె తన ఇన్‌స్టాలో పంచుకోగా.. అవి కాస్తా వైరల్‌గా మారాయి. అందరూ ఆమె మంచి మనసును ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఆ పథకంతో బడి బాట!

గుజరాత్ కచ్ ప్రాంతంలోని తప్పర్ గ్రామంలో పుట్టిపెరిగింది గీత. అక్కడి అటవీ ప్రాంతంలో నివసించే మల్దారీ తెగకు చెందిన అమ్మాయి ఆమె. పశువులు కాయడం, పాల వ్యాపారం చేయడం వారి తెగలో ముఖ్య వృత్తులు. అయితే ఈ తెగకు చెందిన అమ్మాయిల్ని బడికి పంపేవారు కాదట అక్కడివారు. దాంతో తనకు చదువుకోవాలని ఉన్నా వీల్లేక కొన్నాళ్ల పాటు ఇంటికే పరిమితమయ్యానంటోందామె.

‘నాకు చదువంటే ప్రాణం. కానీ మా తెగలో అమ్మాయిలు చదువుకోవడానికి వీల్లేకపోవడంతో మొదట్లో కొన్నాళ్లు ఇంట్లోనే ఉన్నా. అయితే అదే సమయంలో మోదీజీ ప్రవేశపెట్టిన ‘భేటీ బచావో.. భేటీ పఢావో..’ పథకానికి సంబంధించిన పోస్ట్ కార్డ్ నాన్నకు అందింది. ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆయన అప్పుడు నన్ను బళ్లోకి పంపించారు. ఇలా మోదీజీ స్ఫూర్తితో ఆలస్యంగానైనా బడి బాట పట్టా. చదువే కాదు.. నాకు పాటలు పాడడమన్నా మహా ఇష్టం. స్కూల్లో జరిగే కార్యక్రమాల్లో కూడా పాటలు పాడేదాన్ని. నా పాటలు విన్న చాలామంది నీ గొంతు చాలా బాగుందంటూ నన్ను ప్రశంసించేవారు. అది నన్ను మరింతగా ప్రేరేపించింది..’ అంటూ చెప్పుకొచ్చింది గీత.

ఆయన స్ఫూర్తితోనే..!

తనలో అంతర్లీనంగా ఉన్న గాత్ర నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు తెచ్చుకుంది గీత. దీంతో అక్కడక్కడా జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు, వేడుకలకు ఆమెనే పిలిచి పాటలు పాడించుకునేవారు. అలా జానపద గేయాలు, భజనలు, భక్తిపాటలు పాడుతూ కొంత డబ్బు సంపాదించేదీ గుజరాతీ అమ్మాయి. అయితే తను ఇన్ని పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి మాత్రం మోదీజీ అంటోంది గీత.

‘ఓ రోజు మా స్కూల్‌కి ప్రధాని మోదీజీ వచ్చారు. ఆయన సమక్షంలో నేనొక పాట పాడాను. నాలో ఉన్న గాత్ర ప్రతిభను మెచ్చుకున్న మోదీజీ నాకు రూ.250 బహుమతిగా అందించారు.. అంతేకాదు.. ‘నీ వాయిస్ ఎంతో బాగుంది.. కీప్‌ ఇట్‌ అప్‌! మరింత బాగా పాడడం సాధన చెయ్యి..’ అంటూ నన్ను ప్రోత్సహించారు. ఆ మాటలే నాలో స్ఫూర్తిని రగిలించాయి. నేను సింగర్‌గా కెరీర్‌ను ఎంచుకునేలా చేశాయి. అలా సొంతంగా పాటలు పాడుతూ, ఈ క్రమంలో మరిన్ని మెలకువలు నేర్చుకున్నా. నేను గుజరాతీలో పాడిన మొదటి పాట ‘రోనా సెర్ మా’. దాంతో పాటు ‘ఎక్లో రబారీ’ అనే పాట కూడా పాడాను. 2017లో విడుదలైన ఈ రెండు పాటలు పెద్ద హిట్‌గా నిలిచాయి. దాంతో నా పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అది నాకెంతో ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించింది..’ అంటోందీ ట్యాలెంటెడ్‌ సింగర్.

ఎక్కడికెళ్లినా ట్రెడిషనల్‌గానే!

ఈ రెండు పాటలు హిట్టయిన తర్వాత ‘దేశీ ధోల్ వేజ్’, ‘మస్తీ మా మస్తానీ’.. వంటి పాటలతో పాటు కొన్ని డీజే పాటలకూ తన గాత్రాన్ని అరువిచ్చింది గీత. అలా మొదలైన తన పాటల ప్రస్థానం నేటికీ నిర్విరామంగా కొనసాగుతోంది. ఆమె పాటలు యూట్యూబ్‌లో ఎంతోమంది సంగీత ప్రియుల్ని ఓలలాడిస్తున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పలు సంగీత కచేరీల్లోనూ భాగమవుతూ తన ప్రతిభను విశ్వవ్యాప్తం చేస్తోంది గీత. ఇక 2020 ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో భాగంగా మోదీ, అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎదుట గాన కచేరీ చేసి వారిని మెప్పించిందీ గుజరాతీ గాయని. అంతేకాదు.. తను పాడే ప్రతి పాటలో, చేసే ప్రతి సంగీత కచేరీలో సంప్రదాయ దుస్తులే ధరిస్తుందామె. మల్దారీ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించే కట్టూ-బొట్టుకే ప్రాధాన్యమిస్తుంటుంది. ఇక ఇటీవల అమెరికాలో నిర్వహించిన కచేరీలోనూ ఇదే ట్రెడిషన్‌ను కొనసాగించిందీ బ్యూటిఫుల్‌ సింగర్.

తనే నా బలం, ప్రోత్సాహం!

* గీతకు మూగజీవాలంటే ప్రాణం. తనకిష్టమైన ఆట క్రికెట్‌ అంటోంది.

* తన చదువుకు కారణమైన ‘భేటీ బచావో.. భేటీ పఢావో..’ కార్యక్రమాన్ని మరింతమంది బాలికలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో.. ఇదే నేపథ్యంలో పాటలు పాడి మరింత పాపులారిటీ సంపాదించింది గీత.

* గుజరాతీ సింగర్ కింజల్ దేవ్ తన ప్రాణ స్నేహితురాలంటోందామె.

* ఇక తన సంపాదనతో మొదటిసారి ఇన్నోవా కారు కొన్న ఆమె.. అది తనకు ఎంతో అమూల్యమైందని చెబుతోంది.

* పాటలే కాదు.. గర్భా పాటలతో కూడిన ఆల్బం కూడా రూపొందించింది గీత.

* సివిల్‌ ఇంజినీర్‌ అయిన పృథ్వీ రబరీని వివాహమాడిన ఈ గుజరాతీ సింగర్‌.. ‘తనే నా బలం, ప్రోత్సాహం’ అంటూ చెప్పుకొచ్చింది.

* గీతకు సోషల్‌ మీడియాలోనూ ఫాలోయింగ్‌ ఎక్కువే! ఇన్‌స్టాలో ఆమెను 23 లక్షల మంది ఫాలో అవుతుండగా.. యూట్యూబ్‌లో 11 లక్షలకు పైగా సబ్‌స్రైబర్లున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని