Wimbledon: నెలసరిలో ఇక మరక పడ్డా.. నో ప్రాబ్లమ్..!
నెలసరిలో మరక పడుతుందేమోనన్న భయంతో తెలుపు రంగు దుస్తులు ధరించడానికి ఆసక్తి చూపం. మరి, మనకంటే ఈ ఆప్షన్ ఉంది. అదే క్రీడాకారిణులైతే.. మ్యాచ్ ఆడేటప్పుడు కచ్చితంగా డ్రస్ కోడ్ ధరించాల్సిందే! అందులోనూ వింబుల్డన్ వంటి టెన్నిస్....
నెలసరిలో మరక పడుతుందేమోనన్న భయంతో తెలుపు రంగు దుస్తులు ధరించడానికి ఆసక్తి చూపం. మరి, మనకంటే ఈ ఆప్షన్ ఉంది. అదే క్రీడాకారిణులైతే.. మ్యాచ్ ఆడేటప్పుడు కచ్చితంగా డ్రస్ కోడ్ ధరించాల్సిందే! అందులోనూ వింబుల్డన్ వంటి టెన్నిస్ క్రీడలోనైతే తెలుపు రంగు షార్ట్స్ తప్పనిసరి! దాదాపు 146 ఏళ్లుగా కొనసాగుతోన్న ఈ నియమానికి తాజాగా తెరదించింది వింబుల్డన్ టోర్నమెంట్. పిరియడ్ యాంగ్జైటీతో మానసిక ఒత్తిడికి తోడు ఆట పైనా పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నామని, అందుకే డ్రస్ కోడ్ మార్చాలంటూ.. క్రీడాకారిణులు ఏళ్లుగా చేస్తోన్న పోరాటానికి సానుకూలంగా స్పందిస్తూ.. తాజాగా ముగిసిన వింబుల్డన్ టోర్నీలో పలు మార్పులు చేసింది. దీంతో ఈ టోర్నీలో పాల్గొన్న పలువురు మహిళా ప్లేయర్లు ఈ మార్పును స్వీకరించి సరికొత్త చరిత్రకు నాంది పలికారు. మరి, వింబుల్డన్‌లో జరిగిన డ్రస్ కోడ్ మార్పులేంటి? దీనికంటే ముందు మరే క్రీడలోనైనా ఇలాంటి మార్పులు చోటుచేసుకున్నాయా? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!
శతాబ్దం కిందటి నియమం!
ఆటల్లో రూలంటే రూలే! ఏ క్రీడలోనైనా సంబంధిత క్రీడా నియమాల్ని ప్లేయర్లు క్రమశిక్షణతో పాటించాల్సిందే! డ్రస్ కోడ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే కొన్ని క్రీడల్లో నెలసరిలో ఉన్న మహిళా క్రీడాకారులకు ఈ కచ్చితమైన డ్రస్ కోడ్ అసౌకర్యాన్ని కలిగించచ్చు. ముఖ్యంగా వింబుల్డన్ వంటి టెన్నిస్ టోర్నీలో స్కర్ట్స్ దగ్గర్నుంచి అండర్ షార్ట్స్ దాకా.. పూర్తిగా వైట్ అండ్ వైట్ ధరించాలన్న నియమం 1877 నుంచే అమల్లో ఉంది. కానీ తెలుపు రంగు దుస్తులు ధరించి ఆడడం వల్ల.. మరకల భయం పొంచి ఉంటుంది. ఈ అసౌకర్యంతోనే ఆటపై పూర్తి దృష్టి పెట్టలేకపోతున్నట్లు.. హీథర్ వాట్సన్, కోకో గాఫ్, జొహన్నా కాంటా.. తదితర ప్రముఖ మహిళా టెన్నిస్ ప్లేయర్స్ ఈ టోర్నీ నిర్వాహకులైన ‘ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ (AELTC)కు మొరపెట్టుకున్నారు. అంతేకాదు.. టోర్నీ జరిగే రోజుల్లో నెలసరి రాకుండా హార్మోనల్ గర్భనిరోధక మాత్రలు వాడుతున్నట్లు, ఇవి తమ శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు మరికొందరు ప్లేయర్లు తమ సమస్యల్ని క్లబ్‌కు విన్నవించుకున్నారు.
విన్నపాలు.. క్యాంపెయిన్లు!
ఇక గతేడాది తొలి వింబుల్డన్ ఆడిన బ్రిటన్ క్రీడాకారిణి అలీసియా బర్నెట్ కూడా ఇలాంటి అసౌకర్యాన్ని ఎదుర్కొన్నట్లు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ‘నిజానికి నాకు తెలుపు రంగు దుస్తులంటే చాలా ఇష్టం. కానీ నెలసరిలో ఉన్నప్పుడు వీటిని ధరించడం వల్ల మరక పడుతుందేమోనన్న భయం ఉంటుంది. గతేడాది వింబుల్డన్ అర్హత పోటీల సమయంలోనూ నెలసరికి సంబంధించి డ్రస్ కోడ్ విషయంలో పలు సమస్యలు ఎదుర్కొన్నా. నిజానికి ఆటలో నియమాలు క్రీడాకారులందరికీ సమానంగా ఉంటాయన్న విషయం అర్థం చేసుకుంటా. కానీ మహిళల సౌకర్యాన్ని కూడా బోర్డు పరిగణనలోకి తీసుకుంటే వారు మరింత సౌకర్యంగా, సమర్థంగా ఆడగలుగుతారు..’ అందామె. ఇలా కొందరు క్రీడాకారిణుల విన్నపాలే కాదు.. గ్యాబ్రియెల్లా హోమ్స్, హోలీ గోర్డన్ వంటి టెన్నిస్ ప్లేయర్లు వింబుల్డన్‌లో వైట్ డ్రస్ కోడ్ నియమాల్ని సవరించాలంటూ ఓ క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు. దీనికి తెలుపు రంగు డ్రస్ కోడ్‌పై పిరియడ్ మరకలు పడినట్లుగా ఉన్న ఓ నమూనా ఫొటోను కూడా జోడించారు. పలువురు సీనియర్ ప్లేయర్ల దగ్గర్నుంచి జూనియర్ల దాకా ఈ ప్రచార కార్యక్రమానికి మద్దతు పలికారు.
ఆమే ఆద్యురాలు!
అయితే ఇలా మహిళా టెన్నిస్ ప్లేయర్ల డ్రస్ కోడ్ సమస్యలు, వారి విన్నపాల్ని పరిశీలించిన బోర్డు.. సానుకూలంగా స్పందించింది. వైట్ డ్రస్ కోడ్‌లో మార్పులు చేయనున్నట్లు గతేడాది నవంబర్‌లో ప్రకటించింది. అయితే వైట్ స్కర్ట్ యథావిధిగానే ఉంచినా.. దాని లోపల ధరించే అండర్ షార్ట్ మాత్రం క్రీడాకారిణులు తమకు నచ్చిన రంగుల్లో ఉన్నవి ఎంచుకోవచ్చని, అది కూడా స్కర్ట్ కంటే పొడవుగా ఉండకూడదని.. సవరించిన డ్రస్ కోడ్ మార్పుల్ని వెల్లడించింది. దీంతో 146 ఏళ్లుగా స్ట్రిక్ట్‌గా పాటిస్తోన్న వింబుల్డన్ వైట్ అండ్ వైట్ డ్రస్‌కోడ్ విషయంలో ఎట్టకేలకు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక తాజాగా ముగిసిన వింబుల్డన్ టోర్నీలో భాగంగా నెలసరిలో ఉన్న మహిళా ప్లేయర్ల కోసం తొలిసారి ఈ మార్పును అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో ఈ టోర్నీ తొలి రౌండ్లో ఆడిన బెలారస్ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా.. ఈ సరికొత్త మార్పును స్వీకరించి, పాటించిన మొదటి ప్లేయర్‌గా నిలిచింది. ఇక ఈ సానుకూల మార్పుపై టెన్నిస్ మాజీలు, మహిళా ప్లేయర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
‘టెన్నిస్ చరిత్రలోనే ఇది గొప్ప మార్పు.. నేను నెలసరి గురించి మాట్లాడడానికి ఎప్పుడూ సిగ్గు పడను. ఈ మార్పు గురించి విని నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే రిస్క్ చేయలేక గతేడాది వింబుల్డన్ టోర్నీకి ముందే నెలసరి వాయిదా వేసుకోవడానికి మాత్రలు వేసుకున్నా. ఇక ఈసారి కూడా వింబుల్డన్ టోర్నీ సమయంలోనే నెలసరి వచ్చింది. కానీ డ్రస్ కోడ్‌లో మార్పులు చేసేసరికి మాత్ర అవసరం రాలేదు. అందుకే సౌకర్యంగా ఆడా..’ అంటూ తన తాజా వింబుల్డన్ అనుభవాల్ని పంచుకుంది బ్రిటిష్ స్టార్ హీథర్ వాట్సన్.
సాకర్, రగ్బీల్లోనూ..!
నెలసరిలో ఉన్న మహిళా ప్లేయర్ల సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని వారి డ్రస్ కోడ్‌లో మార్పులు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఫుట్‌బాల్, రగ్బీ జట్లలోనూ ఈ తరహా మార్పులు తీసుకొచ్చారు నిర్వాహకులు. గతేడాది ఇంగ్లండ్ జాతీయ సాకర్ జట్టు ‘ఇంగ్లండ్స్ లయన్నెస్’ వైట్ షార్ట్స్‌కి బదులు బ్లూ షార్ట్స్ ధరించచ్చని ప్రకటించింది. అప్పట్నుంచి ఈ జట్టు ప్రతి మ్యాచ్‌లోనూ ఈ నియమాన్నే పాటిస్తోంది. ఇక ఈసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్ (ఫిఫా)కు ఆతిథ్యమిస్తోన్న న్యూజిలాండ్ కూడా తమ వైట్ డ్రస్ కోడ్‌లో పలు మార్పులు చేసింది. మరోవైపు ఇంగ్లండ్, అమెరికాల్లోని పలు సాకర్ క్లబ్స్ కూడా తమ ప్లేయర్లకు నెలసరి సమయంలో సౌకర్యవంతమైన యూనిఫామ్స్‌ని అందిస్తూ వార్తల్లోకెక్కాయి. ఫుట్‌బాల్ సంగతిలా ఉంటే.. ఐరిష్ మహిళల జాతీయ రగ్బీ జట్టు కూడా ‘మా మహిళా ప్లేయర్ల నెలసరి సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని వైట్‌షార్ట్స్ డ్రస్‌కోడ్ నియమానికి స్వస్తి పలికిన’ట్లు ప్రకటించింది.
ఇలా ఆయా క్రీడల్లో మహిళా ప్లేయర్ల సౌకర్యార్థం డ్రస్‌కోడ్‌లో మార్పులు చేయడం, వారి కోసం ప్రత్యేకంగా పిరియడ్ ఫ్రెండ్లీ యూనిఫాంను అందించడం.. హర్షించదగ్గ పరిణామం అంటున్నారు మాజీ మహిళా ప్లేయర్లు. క్రీడల్లో లింగ సమానత్వానికి, మహిళా సాధికారతకు ఇదో ముందడుగుగా పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.