సేవా పథంలో మరో సోపానం!

‘మనం ఎంత సేవ చేశామన్నది కాదు.. ఎంతమందికి మన సేవలు ఉపయోగపడ్డాయన్నదే ముఖ్యం..’ అంటున్నారు ప్రముఖ ఫ్యాషనర్, సమాజ సేవకురాలు సుధా రెడ్డి. ఫ్యాషన్‌పై మక్కువ ఉన్న ఆమె.. పలు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంటారు. ఈ క్రమంలోనే ఇటీవలే ‘గ్లోబల్‌ గిఫ్ట్‌ ఫౌండేషన్’లో భాగస్వామురాలైన....

Published : 23 Nov 2022 21:28 IST

(Photos: Instagram)

‘మనం ఎంత సేవ చేశామన్నది కాదు.. ఎంతమందికి మన సేవలు ఉపయోగపడ్డాయన్నదే ముఖ్యం..’ అంటున్నారు ప్రముఖ ఫ్యాషనర్, సమాజ సేవకురాలు సుధా రెడ్డి. ఫ్యాషన్‌పై మక్కువ ఉన్న ఆమె.. పలు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంటారు. ఈ క్రమంలోనే ఇటీవలే ‘గ్లోబల్‌ గిఫ్ట్‌ ఫౌండేషన్’లో భాగస్వామురాలైన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. తాజాగా ప్యారిస్‌లో నిర్వహించిన ఈ సంస్థ దశాబ్ద వేడుకల్లో భారత్‌ తరఫున పాల్గొన్నారు సుధ. ఇక ఈ భాగస్వామ్యంతో గ్లోబల్ అంబాసిడర్‌గా తన సేవల పరిధిని మరింత విస్తృతం చేయడమే కాదు.. తమ సేవలతో ప్రపంచాన్ని మెప్పించిన పలువురు గ్లోబల్‌ సెలబ్రిటీల సరసన నిలిచారామె. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

ఫ్యాషన్‌ లవర్!

సుధారెడ్డి.. మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (MEIL) సంస్థ డైరెక్టర్‌గా, సమాజ సేవకురాలిగా ఎంతోమందికి సుపరిచితం! ఫ్యాషన్‌, కళలు.. వంటి అంశాలపై మక్కువ చూపే ఆమె.. వివిధ ఈవెంట్లలో ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతుంటారు. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసే ఫొటోలే ఇందుకు తార్కాణం. ఫ్యాషన్‌, కళలపై ఆమెకున్న మక్కువేంటో ఆమె ఇన్‌స్టా బయో చూస్తేనే అర్థమైపోతుంది. ఇలా ఫ్యాషన్‌ అంటే ప్రాణం పెట్టే ఆమె.. గతేడాది మెట్‌గాలా ఈవెంట్లో పాల్గొని ఓ అందమైన అవుట్‌ఫిట్‌లో తళుక్కుమన్నారు.

డయానా స్ఫూర్తితో..!

 ‘సుధా రెడ్డి ఫౌండేషన్‌’ను నెలకొల్పి ఆ వేదికగా పలు సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారామె. ఆరోగ్యం, విద్యను అందరికీ చేరువ చేయడానికి తన వంతు సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా పేద చిన్నారులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతోన్న పిల్లల సంక్షేమం కోసం చేయూతనందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పిల్లల ఆరోగ్యం గురించి అమెరికన్‌ తార ఎవా లాంగోరియాతో కలిసి పనిచేస్తున్నారామె. మరోవైపు.. బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై మహిళల్లో అవగాహన పెంచే దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే బ్రిటిష్‌ నటి ఎలిజబెత్‌ హర్లేతో కలిసి పనిచేస్తున్నారామె. తన సేవా కార్యక్రమాలకు ప్రిన్సెస్‌ డయానానే స్ఫూర్తి అని చెప్పే సుధ.. ‘ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా లక్ష్యం.. అందుకోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తా’ అంటున్నారు. ఇలా తన సేవలకు గుర్తింపుగా ‘యంగ్‌ ఇండియన్‌ విమెన్‌ అఛీవర్స్‌ అండర్‌ 45’ అవార్డును అందుకున్నారీ హైదరాబాదీ.

ఆ సెలబ్రిటీల సరసన!

సందర్భం వచ్చినప్పుడల్లా తన సేవల్ని మరింత విస్తృతం చేయడానికి వెనకాడరు సుధ. ఈ క్రమంలోనే తాజాగా ‘గ్లోబల్‌ గిఫ్ట్‌ ఫౌండేషన్’లో భాగస్వామురాలైన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. తాజాగా ప్యారిస్‌లో నిర్వహించిన ఈ సంస్థ దశాబ్ద వేడుకల్లో భారత్‌ తరఫున పాల్గొన్నారు సుధ. ఈ వేదికగా ఓ ఫ్యాషనబుల్‌ డ్రస్‌లో తళుక్కుమన్నారు. ఇక ఈ భాగస్వామ్యంతో తన సేవల పరిధిని మరింత విస్తృతం చేయడమే కాదు.. తమ సేవలతో ప్రపంచాన్ని మెప్పించిన, మెప్పిస్తోన్న మేగన్‌ మార్కల్‌, పమేలా ఆండర్సన్‌, గోర్డెన్‌ రామ్‌సే, క్రిస్టియానో రోనాల్డో.. వంటి పలువురు గ్లోబల్‌ సెలబ్రిటీల సరసన నిలిచారామె.

‘గ్లోబల్‌ గిఫ్ట్‌ ఫౌండేషన్‌తో చేతులు కలపడం చాలా సంతోషంగా ఉంది. అంతర్జాతీయ సెలబ్రిటీలతో కలిసి సేవ చేయడానికి, కొత్త బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తూ ఈ ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి ఉవ్విళ్లూరుతున్నా..’ అంటూ ఈ సందర్భంగా తన మనోభావాల్ని పంచుకున్నారు సుధ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని