Published : 21/01/2023 18:24 IST

మంచు ఖండంలో ఒంటరిగా..!

(Photos: Instagram)

ఈ మాత్రం చలికే తట్టుకోలేకపోతున్నాం.. అలాంటిది -50 డిగ్రీల ఉష్ణోగ్రతలో, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే శీతల పవనాలను తట్టుకుంటూ, మనిషే కానరాని చోట నడవడమంటే సాహసమనే చెప్పాలి. అలాంటి సాహసాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు బ్రిటిష్‌ ఆర్మీ ఆఫీసర్‌ హర్‌ప్రీత్‌ చాందీ. భారత సంతతికి చెందిన ఆమె.. ఒంటరిగా అంటార్కిటికా ఖండాన్ని చుట్టేయాలన్న లక్ష్యంతో దక్షిణ ధ్రువానికి చేరుకొని చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఒంటరిగా, ఎవరి సహాయం లేకుండా అంటార్కిటికాలో ఎక్కువ దూరం ప్రయాణించిన మహిళగా సరికొత్త రికార్డు నెలకొల్పారు చాందీ. గట్టిగా కోరుకోవాలే కానీ మహిళలకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదని నిరూపించడానికే ఈ సాహస యాత్రకు పూనుకున్నానంటోన్న ఈ ఆర్మీ ఆఫీసర్‌ సాహస యాత్ర గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

ఓవైపు వృత్తిని ప్రేమిస్తూ.. మరోవైపు తమ ప్రవృత్తులకు పదును పెడుతుంటారు కొంతమంది మహిళలు. హర్‌ప్రీత్‌ చాందీ కూడా ఆ కోవకే చెందుతారు. భారత సిక్కు కుటుంబానికి చెందిన ఆమె కుటుంబ సభ్యులు బ్రిటన్‌లో స్థిరపడ్డారు. దాంతో చాందీ కూడా అక్కడే పుట్టారు. పెద్దయ్యే క్రమంలో సాహసాలపై మక్కువ పెంచుకున్న ఆమె.. 2007లో బ్రిటిష్‌ ఆర్మీలో చేరారు. ప్రస్తుతం అందులో ఫిజియోథెరపిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

స్వీయ నమ్మకంతో..!

మన మనసులో ఎన్నో ఆలోచనలుంటాయి.. సాహసాలు చేయాలన్న తపన కూడా ఉంటుంది. కానీ ‘అది నా వల్లేం అవుతుంది..’ అనుకుంటారు చాలామంది. ఇదే వాళ్లను గీత దాటకుండా చేస్తుందంటున్నారు చాందీ. ‘నేను వృత్తిని ఎంతగా ప్రేమిస్తానో.. సాహసాలనూ అంతకంటే ఎక్కువగా ఆరాధిస్తాను. అంటార్కిటికాను చుట్టేయాలన్న ఆలోచన కొన్నేళ్ల క్రితమే వచ్చింది. అయితే ఆ సమయంలో ఇది నా వల్ల అవుతుందా అనిపించింది. కానీ అదే ఆలోచనతో మన చుట్టూ గిరిగీసుకోవడం కరక్ట్‌ కాదని ఆ తర్వాత తెలుసుకున్నా. ఏదైనా చేయగలిగే సత్తా మన సొంతం. అది సాధ్యం కావాలంటే ముందు మనల్ని మనం నమ్మాలి. ఇదే స్వీయ నమ్మకంతో ఈ సాహసయాత్రకు శ్రీకారం చుట్టాను..’ అంటారు చాందీ.

ప్రతికూలతల్ని అనుకూలతలుగా!

అడుగడుగునా సవాళ్లు విసిరే మంచు ఖండాన్ని దాటాలనే లక్ష్యంతోనే అంటార్కిటికాలో అడుగుపెట్టిన ఆమె.. ఈ క్రమంలో ఎన్నో ప్రతికూలతల్ని సానుకూలంగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నానంటున్నారు.

‘ట్రెక్కింగ్‌ చేసే క్రమంలో ఎన్నో ప్రతికూలతలు నాకు అడ్డుగోడగా నిలుస్తున్నాయి. అంటార్కిటికాలోని హెర్క్యులస్‌ ఇన్‌లెట్‌ వద్ద నా సాహస యాత్ర ప్రారంభమైంది. -50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతకు తోడు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే శీతల పవనాలు నాకు అతిపెద్ద అవరోధాలుగా మారుతున్నాయి. ఈ యాత్ర పూర్తి చేయాలన్న సంకల్పంతో సరిపడా ఆహారం, ఇతర రక్షణ సామగ్రితో కలిపి సుమారు 90 కిలోల స్లెడ్జ్‌ని లాగుతూ ముందుకు సాగుతున్నా. ఇలా శారీరకంగానే కాదు.. ఒక్కో రోజు మానసికంగానూ అలసట దరిచేరుతుంది. అయినా లక్ష్యాన్ని చేరాలన్న దృఢ సంకల్పం ఈ అవరోధాలన్నీ అధిగమించేలా చేస్తోంది..’ అంటూ ఈ జర్నీలో తనకెదురైన అనుభవాల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు చాందీ.

కఠోర సాధనతోనే సాధ్యమైంది!

అంటార్కిటికా వంటి మంచు ఖండానికి ఎదురీదాలంటే.. అందుకు ముందు నుంచే కఠోర సాధన చేయాల్సి ఉంటుంది. చాందీ కూడా నెలల పాటు శ్రమించి ఈ సాహస యాత్రకు సిద్ధపడింది. ఇందుకోసం ఫ్రెంచ్‌ ఆల్ఫ్స్‌ పర్వతాల్లో Crevasse Rescue నైపుణ్యాలు నేర్చుకుంది. ఐస్‌ల్యాండ్‌లోని Langjökul Glacier పై నడిచింది.. అంతేకాదు.. గ్రీన్‌ల్యాండ్‌ ఐస్‌ షీట్‌పై సుమారు 27 రోజుల పాటు గడిపింది. వీటికి తోడు స్లెడ్జింగ్‌ అలవాటు చేసుకోవడానికి అధిక బరువున్న టైర్‌ను నడుముకు కట్టుకొని లాగడం ప్రాక్టీస్‌ చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇలాంటి కఠోర సాధనే తనను ధైర్యంగా ముందుకు నడిపిస్తుందంటోంది చాందీ.

ఆమె రికార్డు బద్దలు!

బేసిగ్గా సాహసాలంటే ఇష్టపడే ఈ ఆర్మీ లేడీ.. గతంలోనూ పలు అల్ట్రా మారథాన్స్‌లో పాల్గొంది. ఇందులో భాగంగా సహారా ఎడారిని చుట్టేసింది. ఇక అంటార్కిటికాను చుట్టేయాలన్న లక్ష్యంతో దక్షిణ ధృవానికి చేరుకొని చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఈ మంచు ఖండంలో ఒంటరిగా, ఎవరి సహాయం లేకుండా ముందుకు సాగుతోన్న ఆమె.. ఇప్పటికి 868 మైళ్లు (1,397 కిలోమీటర్లు) ప్రయాణించింది. తద్వారా గత రికార్డును బద్దలు కొట్టి.. ఒంటరిగా, ఎవరి సహాయం లేకుండా అంటార్కిటికాలో అత్యధిక దూరం నడిచిన తొలి మహిళగా చరిత్రకెక్కింది చాందీ. గతంలో ఈ రికార్డు జర్మనీ పర్వతారోహకురాలు అంజా బల్చా (858 మైళ్లు - 1,381 కిలోమీటర్లు) పేరిట ఉంది. రికార్డు బద్దలు కొట్టినంత మాత్రాన తన యాత్ర పూర్తైనట్లు కాదని, అంటార్కిటికా ఖండాన్ని ఒంటరిగా, ఎవరి సహాయం లేకుండా పూర్తిగా చుట్టేసి.. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచే దాకా అలుపు లేకుండా ముందుకు సాగుతానంటోంది చాందీ.

అదే నా లక్ష్యం!

ఇక యాత్ర పూర్తిచేసుకొని తిరిగొచ్చాక.. మహిళలు ఇలాంటి ఒంటరి సాహసాలకు పూనుకునేందుకు తగిన ప్రోత్సాహం అందిస్తూనే.. అందుకోసం నిధులు సమీకరించడమే తన లక్ష్యమంటోంది చాందీ.

‘నా సాహస యాత్ర మరికొంతమంది మహిళల్లో స్ఫూర్తి నింపుతుందనుకుంటున్నా. అది ఎలాంటి సాహసమైనా సరే.. ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న బంధనాలు తెంచుకొని ధైర్యంగా ముందుకు రావాలి. అప్పుడే సవాళ్లను అధిగమిస్తూ ముందుకెళ్లగలం.. అసాధ్యాల్ని కూడా సుసాధ్యం చేయగలం. నేనూ ఇక్కడితో ఆగిపోను.. ఏటికేడు ఇలాంటి కొత్త సాహసాలు చేస్తూ.. ఔత్సాహిక మహిళల్ని ఈ దిశగా ప్రోత్సహించేందుకు నిధులు సమీకరించడమే నా తదుపరి ప్రణాళికగా పెట్టుకున్నా..’ అంటున్నారు చాందీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని