36 మంది.. 21 రోజులు.. ఓ సాహస యాత్ర!

మహిళలు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు.. వంట గదిలో గరిట తిప్పడం దగ్గర్నుంచి వాయు వేగంతో విమానాలు నడిపే దాకా.. ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. తద్వారా తోటి మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నారు. ఇలా ఒక మహిళే మరో మహిళను ముందుకు నడిపించగలదన్న సందేశాన్ని దేశవ్యాప్తంగా చాటడానికే ఓ సాహస యాత్రకు పూనుకుంది సరిహద్దు....

Updated : 13 May 2022 15:55 IST

(Photo: Twitter)

మహిళలు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు.. వంట గదిలో గరిట తిప్పడం దగ్గర్నుంచి వాయు వేగంతో విమానాలు నడిపే దాకా.. ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. తద్వారా తోటి మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నారు. ఇలా ఒక మహిళే మరో మహిళను ముందుకు నడిపించగలదన్న సందేశాన్ని దేశవ్యాప్తంగా చాటడానికే ఓ సాహస యాత్రకు పూనుకుంది సరిహద్దు భద్రతా దళానికి చెందిన మహిళా బృందం. ఇందుకు ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవా’న్ని మించిన మంచి తరుణం మరొకటి లేదంటోంది. అందుకే ఈ ప్రత్యేకమైన రోజున యాత్రను ప్రారంభించి.. దేశవ్యాప్తంగా ప్రయాణించి ఎంతోమంది మహిళల్లో ప్రేరణ నింపుతామంటోంది. మరి, ఈ మహిళా డేర్‌డెవిల్స్‌ సాహస యాత్ర గురించి కొన్ని విశేషాలు మీకోసం..!

బీఎస్‌ఎఫ్‌ సీమా భవానీ.. భారత మొట్టమొదటి మహిళా డేర్‌డెవిల్‌ మోటార్‌సైకిల్‌ బృందమిది. 2016లో ఏర్పాటైన ఈ టీమ్‌.. 2018, 2022 రిపబ్లిక్ డే పరేడ్‌లలో పాల్గొంది. రాజ్‌పథ్ మార్గంలో విభిన్న విన్యాసాలు చేసి ఆకట్టుకుంది. అయితే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మరో స్ఫూర్తిదాయక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారీ డేర్‌డెవిల్‌ విమెన్‌. ‘సీమా భవానీ శౌర్య ఎక్స్‌పెడిషన్‌ ఎంపవర్‌మెంట్‌ రైడ్‌ - 2022’ పేరుతో దేశమంతా పర్యటించి మహిళా సాధికారతను చాటేందుకు సిద్ధమయ్యారు.

దిల్లీ నుంచి చెన్నై దాకా..!

దిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద ప్రారంభం కానున్న ఈ యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తమ్మీద 5,280 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. చండీగఢ్, అమృత్‌సర్‌, బికనీర్, జైపూర్‌, ఉదయ్‌పూర్‌, గాంధీనగర్‌, భరూచ్‌, నాసిక్‌, పుణే, సోలాపూర్‌, హైదరాబాద్‌, అనంతపురం, బెంగళూరు, సేలం, మధురై, కన్యాకుమారి మీదుగా ప్రయాణించి.. ఈ నెల 28న చెన్నై చేరుకోనున్నారు. ఇలా 21 రోజుల పాటు సాగే ఈ సాహసయాత్రలో భాగంగా.. ఆయా నగరాల్లోని రైడింగ్‌ కమ్యూనిటీస్‌తో పాటు మహిళలు, ఇతర వ్యక్తుల్ని కలిసి.. లింగ వివక్ష, మూసధోరణుల్ని బద్దలుకొట్టి మహిళలు తమ శక్తి సామర్థ్యాల్ని ఎలా చాటుకోవాలో సందేశాత్మకంగా వివరిస్తారు. తద్వారా మహిళల్ని సాధికారత దిశగా నడిపించనున్నారు. మొత్తం 36 మంది మహిళలు పాల్గొననున్న ఈ బృందానికి ఇన్‌స్పెక్టర్‌ హిమాన్షు సిరోహి నాయకత్వం వహించనున్నారు. ఇక ఈ యాత్రలో భాగంగా వీరంతా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, బుల్లెట్‌ బండ్లపై రయ్‌ రయ్‌ మంటూ దూసుకుపోనున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని