ఆర్థిక స్వేచ్ఛకు అద్భుత మార్గాలు!

అభిరుచిని అందిపుచ్చుకోవడానికో లేదంటే ఆర్థిక స్వేచ్ఛ కోసమో మహిళలు వివిధ రకాల ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తుంటారు. అయితే అలాంటి వారికోసం ప్రస్తుతం బోలెడన్ని వ్యాపార ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు కెరీర్‌ నిపుణులు. వీటిలో మీకు తగినది ఎంచుకుంటే క్రమంగా జీవితంలో ఎదగడంతో పాటు మీకో ఆదాయ మార్గమూ దొరికినట్లే అంటున్నారు.

Published : 17 Jan 2022 19:29 IST

పిల్లల ఆలనా పాలనలో భాగంగా గత రెండేళ్లుగా ఇంటికే పరిమితమైంది నిధి. అయితే ఇప్పుడు తిరిగి తన కెరీర్‌ని ప్రారంభించే యోచనలో ఉంది. అది కూడా ఉద్యోగం కాకుండా వ్యాపారమైతే బాగుంటుందనేది ఆమె ఆలోచన!

ఫొటోగ్రఫీ ప్రణీత హాబీ. ఈ నేపథ్యంలోనే వ్యాపారం ప్రారంభించాలనుకుంటోందామె. ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఉంది.

అభిరుచిని అందిపుచ్చుకోవడానికో లేదంటే ఆర్థిక స్వేచ్ఛ కోసమో మహిళలు వివిధ రకాల ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తుంటారు. అయితే అలాంటి వారికోసం ప్రస్తుతం బోలెడన్ని వ్యాపార ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు కెరీర్‌ నిపుణులు. వీటిలో మీకు తగినది ఎంచుకుంటే క్రమంగా జీవితంలో ఎదగడంతో పాటు మీకో ఆదాయ మార్గమూ దొరికినట్లే అంటున్నారు. మరి, ఇంతకీ ఆర్థిక స్వేచ్ఛనిచ్చే ఆ కెరీర్‌ ఆప్షన్లేంటి? రండి.. తెలుసుకుందాం..!

వంటలంటే ఇష్టమా?

ఆడవాళ్లకు వంటింటితో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. విభిన్న వంటకాలు నేర్చుకోవడం, కొత్త కొత్త వంటలు ప్రయత్నించడంలో కొంతమంది చేయితిరిగి ఉంటారు. మీరూ అంతేనా? అయితే దీన్నే మీ వ్యాపార సూత్రంగా మలచుకోవచ్చు. ఇలా మీలో ఉన్న పాకశాస్త్ర నైపుణ్యాలతో క్యాటరింగ్‌ బిజినెస్‌ ప్రారంభించచ్చు. అది కూడా ఆరోగ్యకరమైన రెసిపీలనే మీ క్యాటరింగ్‌ మెనూలో చేర్చుకుంటే కాస్త వైవిధ్యంగానూ ఉంటుంది. లేదూ.. వివిధ రకాల ఆరోగ్య సమస్యలున్న వారి కోసం ఆయా నిపుణుల్ని సంప్రదించి ఆరోగ్యకరమైన వంటకాలు తయారుచేసి వారికి అందించచ్చు. మరోవైపు ఈ రెసిపీలను యూట్యూబ్‌లోనూ పోస్ట్‌ చేయచ్చు. ఇలా ఆలోచిస్తే మీ వ్యాపార ఆలోచనను మరింత విస్తరించుకునే మార్గాలు బోలెడు దొరుకుతాయి.

ఫొటోలు అమ్ముకోవచ్చు!

ఫొటోగ్రఫీ మీ హాబీనా? సహజసిద్ధంగా స్నాప్స్‌ తీయడంలో మీరు సిద్ధహస్తులా? అయితే ఇంకేంటి.. చేతి నిండా డబ్బు సమకూరే ఆదాయ మార్గం దొరికినట్లే! పైగా క్యాండిడ్‌ ఫొటోగ్రఫీ (నేచురల్‌గా ఫొటోలు తీయడం)కి ప్రస్తుతం విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. అయితే ఇక్కడ మీరు చేయాల్సిందల్లా.. ఈ ఫొటోగ్రఫీకి సంబంధించిన కొన్ని ప్రాథమిక మెలకువల్ని నిపుణుల వద్ద నేర్చుకోవడమే! ఇలా మీరు ఎక్కడికెళ్లినా ఆయా ప్రదేశాలు, ప్రకృతి అందాలు.. వంటివి కెమెరాలో బంధించి.. ఆ ఫొటోల్ని ఫొటోగ్రఫీ సంస్థలకు అమ్మచ్చు. ఇక మీకు ఆదరణ పెరగాలన్నా, మీ వ్యాపారం మరింత విస్తరించుకోవాలన్నా.. మీ ఫొటోగ్రఫీ నైపుణ్యాల్ని, మీ పనితనాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేసుకోవడమే తరువాయి! తద్వారా మీ స్కిల్స్‌ని బట్టి ఆఫర్లు మీకు క్యూ కడతాయి.

అభిరుచితో ఆదాయం!

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిరుచి ఉంటుంది. ఒకరు ఇంటిని అలంకరించడంపై మక్కువ చూపితే.. మరొకరు మెహెందీ/ట్యాటూలు వేయడంలో తమకు తిరుగులేదనిపిస్తారు. ఇంకొకరికి క్రాఫ్ట్స్‌ తయారుచేయడమంటే ఇష్టముంటుంది. అయితే ఇలా మీకున్న అభిరుచుల్ని, ప్రత్యేక నైపుణ్యాల్ని మీలోనే దాచుకుంటే ఎలా? దాన్నే ఆదాయ మార్గంగా మలచుకుంటే ఆర్థిక స్వేచ్ఛను సొంతం చేసుకోవచ్చు. ఈ క్రమంలో మీరు తయారుచేసిన వస్తువులు మార్కెట్లో అమ్మడమే కాదు.. మీకున్న అభిరుచిని నలుగురికి పంచడానికి బోధనా తరగతుల్ని సైతం నిర్వహించచ్చు. ఇలా కూడా మరికొంత ఆదాయం గడించచ్చు.

బొతిక్‌ తెరిస్తే..?

ఎవర్‌గ్రీన్‌ ఆదాయ మార్గాలు కొన్నుంటాయి. వాటిలో ఫ్యాషన్‌ రంగం ఒకటి. ఈ క్రమంలో రోజురోజుకీ కొత్త కొత్త ఫ్యాషన్లు పుట్టుకొస్తాయే కానీ.. ఎక్కడా ఆగిపోయే ప్రసక్తే ఉండదు. మరి, మీక్కూడా ఫ్యాషన్‌ ప్రపంచంతో పరిచయం ఉంటే.. దీన్నే మీ ఆదాయ మార్గంగా ఎంచుకోవచ్చు. మీకున్న నైపుణ్యాలతో విభిన్న దుస్తులు డిజైన్‌ చేయచ్చు. ఇందులో నానాటికీ పుట్టుకొస్తోన్న మార్పుల్ని అవపోసన పడుతూ.. కొత్త కొత్త నైపుణ్యాల్ని అందిపుచ్చుకోగలిగితే ఇక మీకు తిరుగుండదని చెబుతున్నారు నిపుణులు. అందుకే ప్రస్తుతం విభిన్న కోర్సులు ఎంచుకునే అమ్మాయిలు సైతం ఫ్యాషన్‌ వైపే మొగ్గుచూపుతున్నారని అంటున్నారు నిపుణులు.

ఇక వీటితో పాటు ట్యూషన్లు/ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పడం, పార్లర్‌ తెరవడం, ఆసక్తి ఉంటే యోగా/వ్యాయామాలకు సంబంధించిన క్లాసులు నిర్వహించడం.. ఇలా ఆలోచిస్తే చేతి నిండా డబ్బు సంపాదించడానికి బోలెడన్ని వ్యాపార మార్గాలున్నాయని చెప్పచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్