Entrepreneur: హస్తకళలతో ఇంటికి హంగులద్దుతోంది!
ఇంటి అలంకరణ వస్తువులంటే మన కంటికి ఇంపుగా కనిపించడమే కాదు.. ఇంటికీ సరికొత్త హంగులద్దాలి.. అలాంటి ఇంటీరియర్స్‌కి హస్తకళలతో హంగులద్ది ఎంతోమంది వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నారు కోల్‌కతాకు చెందిన అదితి మురర్కా. ప్రయాణాలంటే మక్కువ చూపే...
(Photos: LinkedIn)
ఇంటి అలంకరణ వస్తువులంటే మన కంటికి ఇంపుగా కనిపించడమే కాదు.. ఇంటికీ సరికొత్త హంగులద్దాలి.. అలాంటి ఇంటీరియర్స్‌కి హస్తకళలతో హంగులద్ది ఎంతోమంది వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నారు కోల్‌కతాకు చెందిన అదితి మురర్కా. ప్రయాణాలంటే మక్కువ చూపే ఆమె.. తాను వెళ్లిన ప్రదేశానికి చెందిన ప్రత్యేకతను ఇట్టే పసిగడతారు. ఆసియా వ్యాప్తంగా వివిధ దేశాల్లో పర్యటించిన ఆమె.. అక్కడి హస్తకళా నైపుణ్యాలకు ముగ్ధులయ్యారు. ఈ ఆలోచనతోనే ఈశాన్య రాష్ట్రాల్లోని హస్తకళలకు ఇంటీరియర్స్ రూపంలో జీవం పోస్తున్నారామె. కిచెన్ నుంచి డైనింగ్ దాకా.. ఫర్నిషింగ్ నుంచి హోమ్ యాక్సెసరీస్ దాకా.. తన క్రియేటివిటీకి పదును పెడుతూ, హస్తకళా నైపుణ్యాలను జత చేస్తూ ఆకర్షణీయమైన ఇంటీరియర్ ఉత్పత్తుల్ని తయారుచేస్తోన్న అదితి వ్యాపార ప్రయాణం గురించి తెలుసుకుందాం...
కోల్‌కతాకు చెందిన అదితి.. వృత్తిరీత్యా తన భర్తతో కలిసి సింగపూర్‌లో స్థిరపడ్డారు. ఆమెకు ప్రయాణాలంటే మక్కువ. ఈ క్రమంలో ఉద్యోగం నుంచి విరామం దొరికిన ప్రతిసారీ తన భర్తతో కలిసి కంబోడియా, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌ల్యాండ్, ఫిలిప్పీన్స్.. వంటి దేశాల్ని సందర్శించేవారామె.
ఆ కళల స్ఫూర్తితో..!
చాలామంది ప్రయాణాలంటే సరదా కోసమే చేస్తుంటారు. కానీ అదితికి తాను వెళ్లిన చోట్లలో ఉన్న ప్రత్యేకతల్ని పసిగట్టడం అలవాటు! ఈ క్రమంలోనే తాను పర్యటించిన ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేకమైన హస్తకళలు, క్రాఫ్ట్స్.. వంటి చేతి వృత్తులు ఆమెను ఆకట్టుకున్నాయి. ఇవి చూసినప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లోని చేతి వృత్తి నైపుణ్యాలే తన మదిలో మెదిలాయని చెబుతోందామె.
‘నేను సింగపూర్‌లో ఓ ఫ్యాషన్ సంస్థతో కలిసి పనిచేస్తున్నప్పుడు.. అక్కడి హస్తకళా నైపుణ్యాల గురించి నాకు పూర్తి అవగాహన ఏర్పడింది. అయితే నాకు ఇంటీరియర్ వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. దీనికి ఈశాన్య రాష్ట్రాల్లోని హస్తకళల్ని జోడిస్తే ఎక్కువమంది వినియోగదారుల్ని ఆకట్టుకోవచ్చనిపించింది. ఈ ఆలోచనే 2019లో ‘నెస్టేషియా’ అనే సంస్థకు బీజం వేసింది. నా భర్త అనురాగ్‌తో కలిసి అదే ఏడాది నా వెంచర్‌ని ప్రారంభించా..’ అంటూ చెప్పుకొచ్చింది అదితి.
పది వేలకు పైగానే..!
ఇంటి అలంకరణలో భాగంగా తాము తయారుచేసే ప్రతి వస్తువూ ఇంటిని ప్రత్యేకంగా మార్చేయాలన్న లక్ష్యంతోనే రూపొందిస్తున్నామంటున్నారు అదితి. ‘‘మేక్ హోమ్ స్పెషల్’ అనేది మా సంస్థ నినాదం. అంటే.. మేం తయారుచేసే ప్రతి వస్తువూ ఇంటిని ప్రత్యేకంగా మార్చేయాలనేది దీని వెనకున్న ముఖ్యోద్దేశం. ఈ క్రమంలో.. డైనింగ్, కిచెన్, డెకార్ పీసెస్, ఫర్నిషింగ్ వస్తువులు, బాత్‌రూమ్ యాక్సెసరీస్ వంటివి తొలుత అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇందులో భాగంగా ఆయా వస్తువులపై హ్యాండ్‌ప్రింటెడ్, హ్యాండ్ క్రాఫ్ట్స్ డిజైన్స్‌తో హంగులద్దాం. ఇక వీటితో పాటు సోఫా-బెడ్‌కు అందాన్నిచ్చే కుషన్స్, రగ్గులు.. వంటివీ విభిన్న హ్యాండ్ వర్క్, ఎంబ్రాయిడరీ, బొహో స్టైల్స్‌తో డిజైన్ చేసినవి, చేనేత-జ్యూట్.. వంటి మెటీరియల్‌తో తయారుచేసినవి మా వద్ద లభ్యమవుతున్నాయి. ఇక సంస్థను విస్తరించే క్రమంలో ఇలాంటి ఇంటీరియర్స్‌తో పాటు ఫ్యాషనబుల్ బ్యాగ్స్, బ్యూటీ యాక్సెసరీస్, గిఫ్ట్ బాక్సులు, ఇతర స్టేషనరీ ఐటమ్స్‌ని కూడా మా సంస్థలో భాగం చేశాం. ఇలా ఇప్పటివరకు సుమారు పది వేలకు పైగా విభిన్నమైన, ప్రత్యేకమైన అలంకరణ వస్తువుల్ని, ఇతర యాక్సెసరీస్‌ని అందుబాటులోకి తీసుకొచ్చాం. అలాగే వినియోగదారుల అభిరుచుల్ని బట్టీ ఆయా ఇంటి అలంకరణ వస్తువుల్ని తయారుచేస్తున్నాం..’ అంటున్నారీ బిజినెస్ ఉమన్.
తయారీ నుంచి ప్యాకింగ్ దాకా..!
తమ అలంకరణ వస్తువులతో ఆకట్టుకోవడమే కాదు.. వాటి తయారీ నుంచి ప్యాకింగ్ దాకా.. ప్రతి దశలోనూ పర్యావరణహితమైన ముడి సరుకుల్నే వాడుతున్నామంటున్నారు అదితి. ‘వీటి తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలన్నీ స్థానికంగా దొరికే సహజసిద్ధమైన మెటీరియల్‌నే ఎంచుకుంటున్నాం. అలాగే ప్యాకింగ్ విషయంలోనూ సహజ సూత్రాన్నే పాటిస్తున్నాం. ఈ క్రమంలో కాటన్-కార్డ్‌బోర్డ్ తుక్కు రీసైక్లింగ్ చేసి తయారుచేసిన బాక్సుల్లో.. ఉత్పత్తుల్ని ఆకర్షణీయంగా ప్యాక్ చేసి వినియోగదారులకు అందిస్తున్నాం. ఇక ఆయా చేతి వృత్తి కళాకారులకు సమకాలీన డిజైన్లు, అంశాల్లో నైపుణ్యాలు పెంచడానికి మా బృందం ప్రత్యేక శిక్షణ తరగతులు సైతం నిర్వహిస్తోంది..’ అంటోన్న ఈ బిజినెస్ లేడీ.. మహిళలు వ్యాపారంలో రాణించాలంటే తమలో ఉన్న భయాల్ని, సందేహాల్ని తరిమేయాలంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.