రూ. 265తో.. మూడు ఇళ్లు కొన్నది!

సొంతింటి కల అనేది చాలామంది కోరిక. ఈ కల నెరవేర్చుకోవడం కోసం ఏళ్ల తరబడి డబ్బు దాచుకోవడం, లక్షల కొద్దీ బ్యాంకు రుణం తీసుకోవడం.. వంటి ప్రత్యామ్నాయాల్ని పాటిస్తుంటారు చాలామంది. కానీ ఎలాంటి పొదుపు-మదుపు లేకుండా....

Published : 05 Jun 2023 19:30 IST

(Photos: Instagram)

సొంతింటి కల అనేది చాలామంది కోరిక. ఈ కల నెరవేర్చుకోవడం కోసం ఏళ్ల తరబడి డబ్బు దాచుకోవడం, లక్షల కొద్దీ బ్యాంకు రుణం తీసుకోవడం.. వంటి ప్రత్యామ్నాయాల్ని పాటిస్తుంటారు చాలామంది. కానీ ఎలాంటి పొదుపు-మదుపు లేకుండా, లక్షల రూపాయలు ఖర్చు చేయకుండా.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ఇళ్లను కొనుగోలు చేసింది క్యాలిఫోర్నియాకు చెందిన రూబియా డేనియల్స్‌ అనే మహిళ. వాటికైన ఖర్చు కేవలం రూ. 265 మాత్రమే! ఇటలీ అంటేనే అందమైన కట్టడాలు, చరిత్రకు మారుపేరు. అలాంటి దేశంలో కాఫీకయ్యే ఖర్చు కంటే తక్కువ రేటుకే మూడు ఇళ్లు కొనుగోలు చేయడంతో పాటు వాటికి తుది మెరుగులు అద్దుతోంది రూబియా. మరి, ఇంత తక్కువ ధరకు సెంటు భూమి కూడా కొనలేం.. అలాంటిది ఈ మహిళ మూడు ఇళ్లు ఎలా కొనగలిగింది? అసలు కథేంటో తెలుసుకుందాం రండి..

ఒక్క యూరోకే..

సాధారణంగా ఇల్లు కొనాలంటే లక్షలు ఖర్చవుతుంది. ఇక ప్రముఖ నగరాల్లో అయితే కోట్లు ఖర్చు పెట్టినా మనం కోరుకున్న ఇల్లు కొనలేం. అయితే ఇటలీ ప్రభుత్వం మాత్రం ఒక్క యూరో (సుమారు రూ. 88)కే ఇంటిని కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. ఇందుకూ కారణం లేకపోలేదు. అందమైన రాతి కట్టడాలు, ఏళ్ల తరబడి చరిత్ర కలిగిన భవంతులకు మారుపేరు ఇటలీ. అయితే ఇటలీలోని కొన్ని గ్రామాల్లోని ప్రజలు పని కోసం వేరే నగరాలకు వెళ్లిపోవడంతో ఆ గ్రామాలు ఖాళీ అయి వెలవెలబోవడం ప్రభుత్వం గుర్తించింది. దీంతో కొన్నేళ్లుగా అక్కడి చాలా గ్రామాలు నిర్మానుష్య ప్రాంతాలుగా మారాయి. మనుషులు లేకపోవడంతో ఇళ్లు కూడా పాతబడిపోయాయి. ఈ దుస్థితిని గమనించిన అక్కడి ప్రభుత్వం వీటికి పునర్వైభవం తేవాలనుకుంది. ఇందుకోసం ఒక్క యూరోకే ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఆ దేశ పౌరులతో పాటు విదేశీయులకు కూడా కల్పిస్తూ 2019లో ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో ఇంటిని కొనుగోలు చేసే వారు.. మూడు సంవత్సరాల్లో ఆ ఇంటిని పునరుద్ధరించాలనే నియామాన్ని కూడా పెట్టింది.

ముందు నమ్మలేదు!

ఇటలీ ప్రభుత్వం ప్రకటించిన ఆఫర్‌ను చూడగానే రూబియా ఆశ్చర్యపోయింది. దాంతో ఆ ఇళ్లను వెంటనే చూడాలనుకుంది. ‘ఇటలీ ప్రభుత్వం చేసిన ప్రకటన విని ఆశ్చర్యపోయాను.. ముందు నమ్మలేకపోయా. అందుకే నేరుగా అక్కడికి వెళ్లి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలనుకున్నా! ఈ క్రమంలో ఆ ప్రకటనకు సంబంధించిన అదనపు సమాచారం, ఇతరత్రా విషయాల గురించి తెలుసుకున్నా. ఆపై ప్రయాణానికి కావాల్సిన విమాన టికెట్‌, అద్దె కారు, ఉండడానికి హోటల్‌.. ఇలా అన్నీ ముందే బుక్‌ చేసుకొని ఇటలీకి పయనమయ్యా..’ అని చెప్పుకొచ్చింది రూబియా.

ఆపై ఇటలీ చేరుకున్నాక సిసిలీ అనే పట్టణంలోని ముస్సోమెలి అనే గ్రామంలో 10 రోజుల పాటు పర్యటించింది. అలా 2019లో మూడు యూరో (సుమారు రూ. 265)లు వెచ్చించి అక్కడే మూడు ఇళ్లను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సంబంధిత ప్రాజెక్టు కార్యకలాపాలు పర్యవేక్షిస్తోన్న ‘Case 1 Euro’ అనే సంస్థ ధృవీకరించింది.

ఆలోచనలు కలవడంతో...

రూబియా పుట్టింది క్యాలిఫోర్నియాలోనే అయినా ఉద్యోగ రీత్యా 30 సంవత్సరాల క్రితమే బ్రెజిల్‌లోని బ్రిజీలియా పట్టణానికి వచ్చి స్థిరపడింది. ప్రస్తుతం ఆమె అక్కడి ఓ సోలార్‌ ఇండస్ట్రీలో పనిచేస్తోంది. ఆమెకు పర్యావరణం అంటే ప్రాణం. ‘కొత్త వస్తువులను కొనడం కంటే పాత వస్తువులకు మెరుగులద్ది వాటిని పునర్వినియోగించుకోవడమే మేలు..’ అనే సూత్రాన్ని బలంగా నమ్ముతుందామె. ఇటలీ ప్రభుత్వ ప్రకటన కూడా తన ఆలోచనలకు దగ్గరగా ఉండడంతో ఆ ఇళ్లను కొనుగోలు చేసింది. అయితే వాటిని కొన్న కొంత కాలానికే లాక్‌డౌన్‌ రావడంతో ఇంటి పునరుద్ధరణ పనులు ఆగిపోయాయి. తిరిగి గత సంవత్సరం పనులు ప్రారంభించింది. ప్రస్తుతం అవి చివరి దశకు చేరుకున్నాయంటూ ఇటీవలే ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది రూబియా.

మూడు ఇళ్లు ఇలా...

ఇలా తాను కొన్న మూడు ఇళ్లను ఎలా వినియోగించుకోవాలనుకుంటుందో దాని తాలూకు ప్రణాళికలూ సిద్ధం చేసుకున్నానంటోంది రూబియా. ఈ క్రమంలో ఒక ఇంటిని తన నివాసంగా మలచుకోనుంది. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో మరో ఇంట్లో ఆర్ట్‌ గ్యాలరీ ఏర్పాటు చేయనుంది. ఇక మూడో ఇల్లు తన భారీ ప్రాజెక్టు అని చెబుతోంది. మూడంతస్తుల ఈ భవంతిలో వెల్‌నెస్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పుకొచ్చిందామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్