Camila Bernal : అందమైన కన్‌స్ట్రక్టర్!
ఎవరైనా ఏసీ గదిలో కూర్చొని.. కాలు మీద కాలేసుకొని హాయిగా ఉద్యోగం చేసుకోవాలనుకుంటారు. ఆ అవకాశమొస్తే తమకంటే అదృష్టవంతులు లేరనుకుంటారు. కానీ కొలంబియాకు చెందిన క్యామిలా బెర్నాల్‌కు....
(Photos: Instagram)
ఎవరైనా ఏసీ గదిలో కూర్చొని.. కాలు మీద కాలేసుకొని హాయిగా ఉద్యోగం చేసుకోవాలనుకుంటారు. ఆ అవకాశమొస్తే తమకంటే అదృష్టవంతులు లేరనుకుంటారు. కానీ కొలంబియాకు చెందిన క్యామిలా బెర్నాల్‌కు ఇది నచ్చలేదు. అందరిలా తానుంటే అందులో ప్రత్యేకతేముందనుకుందో ఏమో.. బంగారం లాంటి ఉద్యోగాన్ని వదులుకొని చెమటోడ్చి పనిచేసే నిర్మాణ రంగాన్ని ఎంచుకుంది. కాల్కర్ (భవన నిర్మాణ సమయంలో గోడల మధ్య గ్యాప్స్‌ని పూడ్చే పని)గా స్థిరపడి ప్రస్తుతం నెల తిరిగే సరికి లక్షలు ఆర్జిస్తోంది. అంతేనా.. ఎవరేమనుకున్నా సరే.. తన జీవితంలో తాను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఇదీ ఒకటంటూ.. తనను తానే ప్రశంసించుకుంటోంది. మరి, ఇంతకీ తన చదువుకు తగ్గ ఉద్యోగాన్ని వదులుకొని క్యామిలా కాల్కర్ వృత్తిని ఎందుకు ఎంచుకున్నట్లు? తన నిర్ణయం వెనకున్న అసలు కారణమేంటి? రండి.. తెలుసుకుందాం!
అందరూ వెళ్లే దారిలో కాకుండా అరుదైన రంగాల్ని ఎంచుకుంటున్నారు ఈకాలం మహిళలు. అందులోనూ పురుషాధిపత్యం ఎక్కువగా ఉన్న వృత్తిఉద్యోగాల్లో స్థిరపడడానికే మొగ్గు చూపుతున్నారు. క్యామిలా కూడా ఇదే కోవకు చెందుతుంది. కొలంబియాలో పుట్టి పెరిగిన ఆమె.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నివాసముంటోంది. గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఈ మక్కువతోనే ముందు నుంచీ గ్రాఫిక్ డిజైనర్‌గా స్థిరపడాలని నిర్ణయించుకున్న ఆమె.. గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సులో చేరింది. ఈ క్రమంలోనే పాకెట్ మనీ కోసం ఆతిథ్య రంగంలో ఉద్యోగంలో చేరింది. అలా వచ్చిన డబ్బుతో అటు తన కోర్సు ఫీజు చెల్లించడంతో పాటు, ఇటు తనకు కావాల్సిన వ్యక్తిగత ఖర్చుల్నీ వెల్లదీసుకునేదామె.
ఫ్రెండ్ ఆలోచనతో..!
ఆతిథ్య రంగంలో ఉద్యోగం చేసే క్రమంలోనే క్యామిలా స్నేహితుల్లో ఒకరు.. ‘నువ్వు కాల్కర్ వృత్తిలోకి వెళ్లొచ్చుగా..’ అంటూ సలహా ఇచ్చారు. ఆపై దాని గురించి కాస్త లోతుగా తెలుసుకున్న ఆమెకు అందులోకి వెళ్లాలన్న ఆలోచనతో పాటు అవకాశమూ వచ్చింది. అయితే సవాలుతో కూడిన ఈ ఉద్యోగం తనకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టిందంటోందీ యంగ్ కాల్కర్.
‘భవిష్యత్తులో గ్రాఫిక్ డిజైనర్‌గా స్థిరపడాలనుకున్నా. కానీ ఫ్రెండ్ సలహా మేరకు మనసు మార్చుకొని, చేస్తోన్న ఉద్యోగాన్ని వదులుకొని కాల్కర్ వృత్తిలోకొచ్చా. భవన నిర్మాణంలో భాగంగా ఇంట్లోకి తేమ ప్రవేశించకుండా గోడల మధ్య ఉండే గ్యాప్‌ను పూడ్చడమే నా పని. సునాయాసంగా పూర్తిచేసే పనే అయినా ఇందులో ఎన్నో సవాళ్లున్నాయి. అయినా నేను ఎంచుకున్న మార్గం నాకు నచ్చింది. ఏ పనైనా పర్‌ఫెక్ట్‌గా చేయడం చిన్నతనం నుంచే నాకు అలవాటు. నా వృత్తిలోనూ ఈ సూత్రాన్ని పాటిస్తున్నా. ఇదే నాకు ప్రపంచవ్యాప్త గుర్తింపును, బోలెడన్ని అవకాశాల్నీ తెచ్చిపెడుతోంది..’ అంటోన్న క్యామిలా గత ఏడేళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతోంది. ప్రస్తుతం దీన్నే తన వ్యాపారంగా మలచుకున్న ఆమె.. తన వృత్తిలో బిజీగా గడుపుతూ నెల తిరిగే సరికి లక్షల కొద్దీ ఆదాయం ఆర్జిస్తోంది.
ఆ నొప్పిని లెక్క చేయను!
గోడలు, టైల్స్, శ్యానిటరీ వేర్, బాత్ వేర్.. భవన నిర్మాణంలో భాగంగా ఇలా ఆయా ప్రదేశాల్లో కాల్కింగ్ చేయాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. చెమటలు కక్కుతూ, అందని ప్రదేశాల్లో నిచ్చెన వేసుకొని, వంగుతూ-లేస్తూ.. ఇలా వివిధ రకాల భంగిమల్లో గంటల తరబడి చేసే ఈ పని.. వీపు, వెన్నెముకపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తద్వారా ఆయా భాగాల్లో నొప్పి వచ్చే ప్రమాదం ఎక్కువ. అలా తానూ గత కొంత కాలంగా భరించలేని వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది క్యామిలా.
‘నా పని రోజూ ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. గంటల తరబడి నిరంతరాయంగా కొనసాగే ఈ పని వల్ల 2021లో నేను స్కొలియోసిస్ (వెన్నెముక అసాధారణంగా వంపు తిరగడం) అనే సమస్య బారిన పడ్డాను. దీనివల్ల ఒక్కోసారి భరించలేనంత వెన్నునొప్పి వస్తుంటుంది. ఇలాంటప్పుడు కొన్ని వ్యాయామాలు చేస్తూ, విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటూ, మసాజ్ చేయించుకుంటూ.. దీన్నుంచి ఉపశమనం పొందుతున్నా.. మరికొన్నిసార్లు పెయిన్‌కిల్లర్స్ వేసుకుంటున్నా. ఇక ఈ నొప్పి నుంచి పూర్తిగా బయటపడాలంటే.. నా వృత్తిని వదులుకోవాలని డాక్టర్లు చెప్పారు. కానీ అది నాకు నచ్చలేదు. నా పనితనం చూసి వినియోగదారులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌తో అన్నీ మర్చిపోతుంటా.. నా మనసుకు నచ్చిన పని చేస్తున్నానన్న ఆనందం నన్ను మరింత ఉత్సాహంగా పనిలోకి వెళ్లేలా చేస్తుంది..’ అంటోందీ కాల్కర్ బ్యూటీ.
30లో ఒక్కదాన్నే!
అరుదైన రంగాల్ని ఎంచుకున్న మహిళలకు సమాజం నుంచి వివక్ష ఎదురవడం కొత్త కాదు. డిజైనింగ్ రంగాన్ని కాదని కాల్కర్ వృత్తిని ఎంచుకునే క్రమంలో తానూ ఎన్నో విమర్శల్ని ఎదుర్కొన్నానంటోంది క్యామిలా.
‘మెల్‌బోర్న్‌లో స్థిరపడ్డాక ఓ కన్‌స్ట్రక్షన్ సైట్‌కి వెళ్లినప్పుడు.. అక్కడ పనిచేసే 30 మందిలో నేనొక్కదాన్నే మహిళను. దీంతో చాలామంది నన్ను విభిన్నంగా చూసేవారు. వేరే దేశానికి చెందిన మహిళనని చులకనగా మాట్లాడేవారు. పురుషాధిపత్యం ఉన్న రంగంలోకి నువ్వెందుకొచ్చావంటూ హేళన చేసేవారు. పైగా నాకు ఇంగ్లిష్ అంతంతమాత్రంగానే వచ్చేది. అది కూడా సవాలుగానే మారింది. అయితే ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితుల్లో క్రమంగా మార్పొస్తుంది. ఈ రంగంలో చేరే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతుండడమే ఇందుకు కారణం..’ అంటోన్న క్యామిలా ఇలాంటి మాటలు పట్టించుకోకపోవడం వల్లే ఈ రంగంలో రాణించగలుగుతున్నానంటోంది. ఎవరేమనుకున్నా మన మనసు మాట వింటేనే నచ్చిన రంగంలో ఎదగగలమంటోన్న ఈ బ్యూటీ.. ‘టాప్ 100 విమెన్ ఇన్ కన్‌స్ట్రక్షన్ - 2023’ అవార్డు గ్రహీత కూడా!
వృత్తి విషయం కాసేపు పక్కన పెడితే.. వ్యక్తిగతంగా ప్రయాణాలు, సాహస క్రీడలు, ప్రకృతితో గడపడం, క్యాంపింగ్.. వంటి అంశాల్ని ఇష్టపడే క్యామిలా పనితనానికే కాదు.. ఆమె అందానికీ ఫిదా అవుతుంటారు చాలామంది. ఇక గతేడాది ‘ది బ్లాక్’ అనే టీవీ షోలో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకున్న ఈ బ్యూటీ.. తన కనస్ట్రక్షన్ సైట్స్‌కి సంబంధించిన ఫొటోలతో పాటు తన బ్యూటిఫుల్ లుక్స్‌నీ ఇన్‌స్టాలో పంచుకుంటూ కుర్రకారు మనసు దోచుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.