నా భర్త ఓ హీరో!

‘నేను అందరిలా చనిపోను. నా ఛాతీ గర్వంతో ఉప్పొంగుతుండగా మరణించాలి’ అని నా భర్త అంశుమాన్‌ సింగ్‌ ఎప్పుడూ చెబుతుండేవాడు’ అని అతన్ని తలచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు స్మృతి సింగ్‌.

Updated : 07 Jul 2024 08:08 IST

‘నేను అందరిలా చనిపోను. నా ఛాతీ గర్వంతో ఉప్పొంగుతుండగా మరణించాలి’ అని నా భర్త అంశుమాన్‌ సింగ్‌ ఎప్పుడూ చెబుతుండేవాడు’ అని అతన్ని తలచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు స్మృతి సింగ్‌. ఉబికి వస్తోన్న కన్నీళ్లని పంటిబిగువున నొక్కిపట్టి ఆ అమరుడికి అందిన పురస్కారాన్ని ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సగర్వంగా అందుకున్నారామె. ఇంతకీ ఎవరీ స్మృతి..? 

విధి నిర్వహణలో ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించిన రక్షణదళ, పారా మిలిటరీ సిబ్బందికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం కీర్తిచక్ర, శౌర్యచక్ర పురస్కారాలను ప్రదానం చేశారు. అందులో భాగంగా గతేడాది సియాచిన్‌ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కెప్టెన్‌ అంశుమాన్‌ సింగ్‌కు భారత రెండో అత్యున్నత పీస్‌టైమ్‌ గ్యాలంటరీ పురస్కారం కీర్తిచక్ర లభించింది. అతని తల్లి, భార్య స్మృతి దీన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె... తన భర్త వీరోచిత త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. తమ ప్రేమ గురించి అక్కడున్న వారితో పంచుకున్నారు... 

‘ఇంజినీరింగ్‌ కాలేజీలో మొదటి రోజే మేం తొలిసారి కలిశాం. తనని చూడగానే ప్రేమలో పడ్డాను. నెల రోజులకే అతను ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజీకి ఎంపికయ్యాడు. కానీ అది మా ప్రేమకి ఏమాత్రం అవరోధం కాలేదు. ఎనిమిదేళ్లపాటు మా ప్రయాణం సాగింది. ఒకరినొకరం ఎంతో ఇష్టపడ్డాం. పెళ్లితో ఒకటయ్యాం. గతేడాది ఫిబ్రవరిలో మా వివాహం జరిగింది. కానీ దురదృష్టం మమ్మల్ని వెంటాడింది. పెళ్లయిన రెండు నెలలకే ఆయనకి సియాచిన్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. గతేడాది జులై 18న మేం చివరిసారి ఫోన్‌లో మాట్లాడుకున్నాం. భవిష్యత్తును ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవాలనుకున్నాం. సొంతిల్లు, పిల్లలు...ఇలా ఎన్నో ఊహించుకున్నాం. మరుసటి రోజే అతను లేడన్న వార్త వచ్చింది. అది నమ్మడానికి నా మనసు ఏమాత్రం అంగీకరించలేదు. ఇప్పుడు అతని గుర్తుగా ఇచ్చిన ‘కీర్తిచక్ర’ నా చేతిలో ఉంది. కాబట్టి ఎప్పటికీ అతను తిరిగి రాడన్నది నమ్మి తీరాలి. కానీ ఆయన ఎప్పటికీ నాతోనే ఉంటారు. నా భర్త ఓ హీరో. మమ్మల్ని వదిలి వెళ్లిపోయినా ఎన్నో కుటుంబాలను రక్షించాడు...’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు స్మృతి.

కెప్టెన్‌ అంశుమాన్‌ సింగ్‌ ఆర్మీ మెడికల్‌ కార్ప్స్‌ డాక్టర్‌. 26వ బెటాలియన్‌ పంజాబ్‌ రెజిమెంట్‌కు చెందిన వైద్యుడు. సియాచిన్‌లో వాళ్లు ఉన్న బేస్‌ క్యాంప్‌లో తెల్లవారుజామున మూడు గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకున్న జవాన్లను ధైర్యంగా కాపాడి బయటకు తీసుకొచ్చారు. అగ్నికీలలు పక్కనే ఉన్న మెడికల్‌ ఇన్వెస్టిగేషన్‌ రూమ్‌కు వ్యాపిస్తుండగా వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూ తీవ్ర గాయాలపాలై మరణించారు.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్