మంగు మచ్చలు ఎందుకొస్తాయ్‌?

అందంగా కనిపించాలన్న మన ఆరాటం చర్మంపై ఏ సమస్య వచ్చినా మనల్ని నిలవనివ్వదు. వెంటనే నయం చేసుకొని

Updated : 17 Aug 2021 12:46 IST

అందంగా కనిపించాలన్న మన ఆరాటం చర్మంపై ఏ సమస్య వచ్చినా మనల్ని నిలవనివ్వదు. వెంటనే నయం చేసుకొని మునుపటిలా అపురూప లావణ్యాన్ని సొంతం చేసుకోవాలని ఆతృత పడుతుంటాం. అయితే చర్మానికి వచ్చిన సమస్యలు అంత త్వరగా సమసిపోవంటున్నారు నిపుణులు. మంగు మచ్చలు/హైపర్‌ పిగ్మెంటేషన్‌ కూడా అలాంటి కోవకే చెందుతుందంటున్నారు. అందుకే ఈ సమస్య రాకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మరి, ఇంతకీ ఈ పిగ్మెంటేషన్‌ సమస్య ఎలా వస్తుంది? ఎందుకొస్తుంది? రాకుండా నివారించలేమా? రండి.. తెలుసుకుందాం..!

చర్మంపై అక్కడక్కడా ఏర్పడే నల్ల మచ్చలు/ప్యాచుల్లాంటి మచ్చల్ని హైపర్‌ పిగ్మెంటేషన్‌ (మంగు మచ్చలు) అంటారు. చర్మ కణాల్లోని మెలనోసైట్స్‌ మెలనిన్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఇది చర్మానికి రంగునిస్తుంది. అయితే ఇది చర్మంపై అక్కడక్కడా మరీ ఎక్కువగా ఉత్పత్తవడం వల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇదనే కాదు.. ఈ మంగు మచ్చలు ఏర్పడడానికి మన జీవనశైలి కూడా ఓ రకంగా కారణమే అంటున్నారు నిపుణులు.

 

కారణాలివే!

* ఆరోగ్య సమస్యల్ని బట్టి వాడే కొన్ని రకాల మందుల ప్రభావం వల్ల కూడా చర్మంపై నల్ల మచ్చలొచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా క్యాన్సర్‌ బాధితులు కీమోథెరపీ చికిత్సలో భాగంగా వాడే మందులు, Non-Steroidal Anti-Inflammatory Drugs (NSAIDs), Tetracyclines, Psychotropic Drugs.. వంటి మందులు ఈ సమస్యకు కారణమవుతాయట!

* ఎగ్జిమా, సొరియాసిస్‌, మొటిమలు, చర్మంపై గాయాలవడం.. వంటి కారణాల వల్ల చర్మంపై వాపు రావడం సహజమే! అయితే ఈ వాపు తగ్గిన తర్వాత ఆయా భాగాల్లో నల్లటి మచ్చలు ఏర్పడతాయంటున్నారు నిపుణులు.

* గాయాలు, కాలిన గాయాలు.. వంటివి మానిన చోట కూడా నల్ల మచ్చలు ఏర్పడడం మనం గమనించచ్చు.

* మనం వాడే సౌందర్య ఉత్పత్తులు, హెయిర్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌.. వంటివి చర్మానికి పడకపోయినా.. ఆయా భాగాల్లో నల్ల మచ్చలు ఏర్పడతాయి.

* గర్భిణుల్లో హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గుల కారణంగా మెలనిన్‌ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది కూడా పిగ్మెంటేషన్‌కి కారణమవుతుంది.

* Addison's Disease (శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి మందగించడం) హైపర్‌ పిగ్మెంటేషన్‌కు కారణమవుతుంది. ఇలాంటి సమస్య ఉన్న వారి చర్మంపై ఎండ పడిన చోట (అంటే.. ముఖం, మెడ, చేతులు, పాదాలు.. వంటి భాగాలు), మోకాళ్లు-మోచేతులు.. వంటి రాపిడికి గురైన భాగాల్లో నల్ల మచ్చలు రావడం గమనించచ్చు.

* చర్మంపై ఎండ పడడం వల్ల సాధారణ వ్యక్తుల్లోనూ మెలనిన్‌ ఉత్పత్తి పెరిగిపోయి మంగు మచ్చలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు.

* మధుమేహం/స్థూలకాయం ఉన్న వారిలో అరుదుగా వచ్చే వ్యాధి Acanthosis Nigricans. ఈ సమస్య ఉన్న వారిలో చర్మం ముడతలు పడిన చోట నల్ల మచ్చలొస్తాయి.

ఇలా నివారించుకోవచ్చు!

సమస్య వచ్చాక తగ్గించుకోవాలని తాపత్రయపడే బదులు రాకుండా ముందుగానే నివారించుకోవడం మేలంటున్నారు నిపుణులు. అయితే ఇది అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాకపోవచ్చని.. కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అవసరం అంటున్నారు.

* SPF-30 ఉన్న సన్‌స్క్రీన్‌ను రోజూ రాసుకోవడం తప్పనిసరి.

* ముఖంపై సూర్యరశ్మి పడకుండా హ్యాట్స్‌, గొడుగు.. వంటివి వాడాలి. అలాగే బయటికి వెళ్లినప్పుడు చర్మాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించడం కొంతవరకు మంచిది.

* వీలైనంత వరకు ఎండ బాగా ఉన్న పగటి సమయంలో బయటికి వెళ్లకపోవడమే మంచిది.

* కొన్ని రకాల మందులు/చర్మానికి పడని మందులు మానేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.

వస్తే ఏం చేయాలి?

హైపర్‌ పిగ్మెంటేషన్‌/మంగు మచ్చలు/నల్ల మచ్చలు.. పేరేదైనా ఈ సమస్య నుంచి బయటపడాలంటే అందుకు కొన్ని ఇంటి చిట్కాలు దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు.

* యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌, నీళ్లు.. సమపాళ్లలో తీసుకొని.. ఈ మిశ్రమాన్ని దూదితో నల్ల మచ్చలున్న చోట అద్దాలి. రెండు మూడు నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే సమస్య తగ్గుముఖం పడుతుంది.

* కలబందలో ఉండే Aloin అనే పదార్థం నల్ల మచ్చల సమస్యను తగ్గిస్తుందని ఓ అధ్యయనం చెబుతోంది. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు సమస్య ఉన్న చోట కలబంద గుజ్జు రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా సమస్య తగ్గే వరకూ రోజూ చేయాల్సి ఉంటుంది.

* ఎర్ర ఉల్లిపాయ రసం (ఎక్స్‌ట్రాక్ట్‌)లో మంగు మచ్చల్ని తగ్గించే గుణాలున్నాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి దీన్ని మచ్చలపై అప్లై చేసుకోవచ్చు. లేదంటే దీన్ని ఉపయోగించి తయారు చేసిన క్రీమ్స్‌ కూడా బయట దొరుకుతాయి. నిపుణుల సలహా మేరకు వాటిని కూడా ఉపయోగించచ్చు.

* వాడేసిన గ్రీన్‌ టీ బ్యాగ్‌ను మచ్చలపై కాసేపు రుద్దడం వల్ల కూడా సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు. ఇలా రోజుకు రెండుసార్లు చేయాల్సి ఉంటుంది.

* పాలలో కాటన్‌ బాల్‌ని ముంచి.. దాంతో నల్ల మచ్చలున్న చోట రుద్దుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే త్వరలోనే సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇందులోని లాక్టికామ్లం మచ్చల్ని తగ్గించడంలో సహకరిస్తుంది.

* టొమాటోల్లో ఉండే లైకోపీన్‌ చర్మంపై ఏర్పడిన నల్ల మచ్చల్ని తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి టొమాటో పేస్ట్‌ని సమస్య ఉన్న చోట అప్లై చేయడం లేదంటే టొమాటో ముక్కతో మచ్చలున్న చోట రుద్దడం ద్వారా ఫలితం ఉంటుంది. అయితే ఇన్ని చేసినా నల్ల మచ్చలు తగ్గకపోయినా, సమస్య మరీ ఎక్కువగా ఉన్నా చర్మ సంబంధ నిపుణుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్