Published : 12/11/2021 15:55 IST

ఛాతీపై మొటిమలా? ఇలా తగ్గించుకోండి!

సాధారణంగా మొటిమలంటే ముఖం పైనే వస్తాయనుకుంటాం. కానీ కొంతమందికి ఛాతీపై, రొమ్ముల చుట్టూ కూడా ఈ సమస్య ఎదురవుతుంటుంది. అయితే జీవనశైలిలో మనం చేసే కొన్ని పొరపాట్లే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. కాబట్టి సమస్య ఉంటే మొహమాట పడకుండా/నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మేలంటున్నారు. మరి, ఇంతకీ ఛాతీ, వక్షోజాల వద్ద మొటిమలు రావడానికి కారణాలేంటి? సమస్యను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..

ఈ పొరపాట్ల వల్లే..!

* కొంతమందికి ఛాతీ, వక్షోజాలు, చనుమొనల వద్ద అవాంఛిత రోమాలుంటాయి. వాటిని తొలగించుకునే క్రమంలో క్రీములు, వ్యాక్సింగ్‌.. వంటి పద్ధతుల్ని అనుసరిస్తుంటారు. తద్వారా చర్మం దుష్ప్రభావానికి/ఇరిటేషన్‌కి గురై మొటిమలు రావడానికి కారణమవుతుందంటున్నారు నిపుణులు.

* కొంతమందికి కాలంతో సంబంధం లేకుండా/వ్యాయామం చేసే క్రమంలో విపరీతమైన చెమటలు వస్తుంటాయి. ఇలాంటి వారిలో నూనెను విడుదల చేసే సెబేషియస్ గ్రంథులు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది క్రమంగా మొటిమలకు దారితీస్తుంది.

* కొంతమందిలో వక్షోజాల పరిమాణం పెద్దగా ఉండడం, బిగుతైన బ్రా ధరించడం వల్ల అవి రాపిడికి గురవుతాయి.. అలాగే అక్కడ చెమట కూడా అధికంగా వస్తుంటుంది. ఈ తేమ వల్ల మొటిమలు వచ్చే ప్రమాదం ఎక్కువ అంటున్నారు నిపుణులు.

* శరీరంలో పురుష హార్మోన్ల (ఆండ్రోజెన్స్‌) స్థాయులు పెరిగిపోవడం వల్ల సెబేషియస్ గ్రంథులు ఎక్కువ మొత్తంలో నూనెల్ని విడుదల చేస్తాయి. మొటిమలు రావడానికి ఇదీ ఓ కారణమేనట!

* పొడిబారిపోయిన చర్మానికి తేమనందించడానికి ఆయిల్‌ ఆధారిత మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మనకు అలవాటే. అయితే ఈ జిడ్డుదనం వాతావరణంలోని దుమ్ము-ధూళి, బ్యాక్టీరియాను ఆకర్షించి చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తుంది. ఇది క్రమంగా మొటిమలకు దారి తీస్తుంది.

* వ్యాయామం చేసే క్రమంలో బిగుతైన దుస్తులు ధరించడం, ఈ క్రమంలో చెమటతో దుస్తులు రాపిడికి గురైనా సమస్య తలెత్తచ్చంటున్నారు నిపుణులు.

* ఆయిల్‌ ఫుడ్‌/జంక్‌ ఫుడ్‌, చక్కెర అధికంగా ఉండే పదార్థాలు తరచూ తీసుకోవడం వల్ల కూడా మొటిమల సమస్య ఎదురవుతుంది. అలాగే నీళ్లు సరిగ్గా తాగక శరీరం డీహైడ్రేషన్‌ బారిన పడినా మొటిమలొస్తాయట!

* ఒత్తిడి, ఆందోళనలు ఎదురైనప్పుడు శరీరంలో కార్టిసాల్‌ హార్మోన్‌ స్థాయులు పెరుగుతాయి. ఇది నూనె గ్రంథుల్ని ప్రేరేపించి చర్మం జిడ్డుగా మారేలా చేస్తుంది. ఫలితంగా మొటిమలొస్తాయి.

ఇలా తగ్గించుకోవచ్చు!

* ఛాతీ, వక్షోజాల వద్ద చర్మం ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ చెమట పడితే సబ్బుతో శుభ్రం చేసుకొని పొడిగా తుడుచుకోవాలి.

* సమస్య ఉన్న వారు నూనె ఆధారిత సన్‌స్క్రీన్‌ లోషన్లు/మాయిశ్చరైజర్లు వాడకపోవడమే మంచిది.

* ఆయా భాగాల్లో ఉన్న మొటిమల సమస్యను తగ్గించుకోవడానికి టీట్రీ నూనె ఆధారిత జెల్‌లు/బాడీ వాష్‌లు మార్కెట్లో దొరుకుతాయి. వాటిని ఉపయోగించచ్చు.

* జింక్‌ ఉపయోగించి తయారుచేసిన క్రీమ్‌లు, లోషన్ల వల్ల కూడా కొంత వరకు ఫలితం ఉండచ్చు.

* అలాగే నిపుణుల సలహా మేరకు సల్ఫర్, సెలిసిలికామ్లం.. వంటి పదార్థాలతో తయారైన క్రీమ్స్‌/జెల్స్‌.. వంటివి వాడచ్చు.

* నీళ్లు ఎక్కువగా తాగడం, నూనె పదార్థాల జోలికి వెళ్లకపోవడం.. వంటివి తప్పనిసరి!

* విటమిన్లు ‘ఎ’, ‘సి’ లోపించినా మొటిమలొచ్చే అవకాశం ఉంటుందట! అందుకే అత్యవసరమైతే నిపుణుల సలహా మేరకు ఆయా విటమిన్‌ సప్లిమెంట్లు కూడా వేసుకోవచ్చు.

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య తగ్గపోయినా, తీవ్రమైనా.. నిపుణుల్ని సంప్రదించడం మాత్రం తప్పనిసరి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని