Updated : 25/01/2023 19:33 IST

ఛాతీపై మొటిమలా? ఇలా తగ్గించుకోండి!

సాధారణంగా మొటిమలంటే ముఖం పైనే వస్తాయనుకుంటాం. కానీ కొంతమందికి ఛాతీపై, రొమ్ముల చుట్టూ కూడా ఈ సమస్య ఎదురవుతుంటుంది. అయితే జీవనశైలిలో మనం చేసే కొన్ని పొరపాట్లే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. కాబట్టి సమస్య ఉంటే మొహమాటపడకుండా/నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మేలంటున్నారు. మరి, ఇంతకీ ఛాతీ, వక్షోజాల వద్ద మొటిమలు రావడానికి కారణాలేంటి? సమస్యను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..

ఈ పొరపాట్ల వల్లే..!

కొంతమందికి ఛాతీ, వక్షోజాలు, చనుమొనల వద్ద అవాంఛిత రోమాలుంటాయి. వాటిని తొలగించుకునే క్రమంలో క్రీములు, వ్యాక్సింగ్‌.. వంటి పద్ధతుల్ని అనుసరిస్తుంటారు. తద్వారా చర్మం దుష్ప్రభావానికి/ఇరిటేషన్‌కి గురై మొటిమలు రావడానికి కారణమవుతుందంటున్నారు నిపుణులు.

కొంతమందికి కాలంతో సంబంధం లేకుండా/వ్యాయామం చేసే క్రమంలో విపరీతమైన చెమటలు వస్తుంటాయి. ఇలాంటి వారిలో నూనెను విడుదల చేసే సెబేషియస్ గ్రంథులు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది క్రమంగా మొటిమలకు దారితీస్తుంది.

కొంతమందిలో వక్షోజాల పరిమాణం పెద్దగా ఉండడం, బిగుతైన బ్రా ధరించడం వల్ల అవి రాపిడికి గురవుతాయి.. అలాగే అక్కడ చెమట కూడా అధికంగా వస్తుంటుంది. ఈ తేమ వల్ల మొటిమలు వచ్చే ప్రమాదం ఎక్కువ అంటున్నారు నిపుణులు.

శరీరంలో పురుష హార్మోన్ల (ఆండ్రోజెన్స్‌) స్థాయులు పెరిగిపోవడం వల్ల సెబేషియస్ గ్రంథులు ఎక్కువ మొత్తంలో నూనెల్ని విడుదల చేస్తాయి. మొటిమలు రావడానికి ఇదీ ఓ కారణమేనట!

పొడిబారిపోయిన చర్మానికి తేమనందించడానికి ఆయిల్‌ ఆధారిత మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మనకు అలవాటే. అయితే ఈ జిడ్డుదనం వాతావరణంలోని దుమ్ము-ధూళి, బ్యాక్టీరియాను ఆకర్షించి చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తుంది. ఇది క్రమంగా మొటిమలకు దారి తీస్తుంది.

వ్యాయామం చేసే క్రమంలో బిగుతైన దుస్తులు ధరించడం, ఈ క్రమంలో చెమటతో దుస్తులు రాపిడికి గురైనా సమస్య తలెత్తచ్చంటున్నారు నిపుణులు.

ఆయిల్‌ ఫుడ్‌/జంక్‌ ఫుడ్‌, చక్కెర అధికంగా ఉండే పదార్థాలు తరచూ తీసుకోవడం వల్ల కూడా మొటిమల సమస్య ఎదురవుతుంది. అలాగే నీళ్లు సరిగ్గా తాగక శరీరం డీహైడ్రేషన్‌ బారిన పడినా మొటిమలొస్తాయట!

ఒత్తిడి, ఆందోళనలు ఎదురైనప్పుడు శరీరంలో కార్టిసాల్‌ హార్మోన్‌ స్థాయులు పెరుగుతాయి. ఇది నూనె గ్రంథుల్ని ప్రేరేపించి చర్మం జిడ్డుగా మారేలా చేస్తుంది. ఫలితంగా మొటిమలొస్తాయి.

ఇలా తగ్గించుకోవచ్చు!

ఛాతీ, వక్షోజాల వద్ద చర్మం ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ చెమట పడితే సబ్బుతో శుభ్రం చేసుకొని పొడిగా తుడుచుకోవాలి.

సమస్య ఉన్న వారు నూనె ఆధారిత సన్‌స్క్రీన్‌ లోషన్లు/మాయిశ్చరైజర్లు వాడకపోవడమే మంచిది.

ఆయా భాగాల్లో ఉన్న మొటిమల సమస్యను తగ్గించుకోవడానికి టీట్రీ నూనె ఆధారిత జెల్‌లు/బాడీ వాష్‌లు మార్కెట్లో దొరుకుతాయి. వాటిని ఉపయోగించచ్చు.

జింక్‌ ఉపయోగించి తయారుచేసిన క్రీమ్‌లు, లోషన్ల వల్ల కూడా కొంతవరకు ఫలితం ఉండచ్చు.

నీళ్లు ఎక్కువగా తాగడం, నూనె పదార్థాల జోలికి వెళ్లకపోవడం.. వంటివి తప్పనిసరి!

విటమిన్లు ‘ఎ’, ‘సి’ లోపించినా మొటిమలొచ్చే అవకాశం ఉంటుందట! అందుకే అత్యవసరమైతే నిపుణుల సలహా మేరకు ఆయా విటమిన్‌ సప్లిమెంట్లు కూడా వేసుకోవచ్చు.

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య తగ్గపోయినా, తీవ్రమైనా.. నిపుణుల్ని సంప్రదించడం మాత్రం తప్పనిసరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని