Updated : 14/06/2021 17:47 IST

అమ్మ పెళ్లి చీరలో అలా మెరిసిపోయారు!

పెళ్లంటే చాలు.. అమ్మాయిల మనసు అందంగా ముస్తాబవడం వైపే పరిగెడుతుంటుంది. ఈ క్రమంలో ప్రి-వెడ్డింగ్‌ వేడుకల దగ్గర్నుంచి పెళ్లి తంతు ముగిసే దాకా.. ప్రతి వేడుకలోనూ అటు సంప్రదాయబద్ధంగా, ఇటు అందరికంటే ప్రత్యేకంగా రడీ అయి మెరిసిపోతుంటారు వధువులు. ఇక ఈ తరం అమ్మాయిలైతే తమ పెళ్లి వేడుకల్లో అలనాడు అమ్మ ధరించిన పెళ్లి దుస్తులు, నగలకూ ప్రాధాన్యమిస్తున్నారు. ఇటీవలే రహస్యంగా పెళ్లి పీటలెక్కిన ఫెయిర్‌ అండ్‌ లవ్లీ బ్యూటీ యామీ గౌతమ్‌ కూడా అదే చేసింది. ‘ఉరి’ సినిమా డైరెక్టర్ ఆదిత్యధర్‌ను పెళ్లాడిన ఈ చక్కనమ్మ.. తన పెళ్లిలో 33 ఏళ్ల క్రితం నాటి తన తల్లి చీరను ధరించింది. అంతేకాదు.. తన బ్రైడల్‌ మేకప్‌ తానే వేసుకొని కుందనపు బొమ్మలా మెరిసిపోయిందీ లవ్లీ బ్యూటీ. ఓ వెడ్డింగ్‌ బ్లాగర్‌ ఈ విషయాన్ని ఫొటోలతో సహా సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. అయితే తనొక్కర్తే కాదు.. గతంలోనూ కొంతమంది ముద్దుగుమ్మలు తమ పెళ్లి వేడుకల్లో తమ తల్లుల చీరలు, నగలు ధరించి సంప్రదాయబద్ధంగా మెరిసిపోయారు. మరి, వారెవరో, వారు ధరించిన ఆ ట్రెడిషనల్‌ అవుట్‌ఫిట్స్‌ ఏంటో తెలుసుకుందాం రండి..
అమ్మ చీర కట్టుకోవాలని అమ్మాయిలు, తన చిట్టితల్లి తన చీరలో ఎలా ఉంటుందో చూడాలని తల్లులు ఆరాటపడడం సహజం. అందుకే ఈ తరం అమ్మాయిల్లో చాలామంది తమ పెళ్లిలో ఏదో ఒక వేడుకలో తన తల్లి పెళ్లి నాటి దుస్తుల్ని ధరిస్తూ మెరిసిపోతున్నారు. తల్లుల్ని మురిపిస్తున్నారు. తామూ ఇందుకు అతీతం కాదని నిరూపించారు చాలామంది ముద్దుగుమ్మలు.


అమ్మ చీర.. సొంతంగా మేకప్!
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన యామీ టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు ఇతర భాషా చిత్రాల్లోనూ మెరిసింది. తాను నటించిన ‘ఉరి : ది సర్జికల్‌ స్ట్రైక్‌’ సినిమా దర్శకుడు ఆదిత్యధర్‌తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే ఆయన్ని రహస్యంగా పరిణయమాడింది. అత్యంత నిరాడంబరంగా జరిగిన తన వివాహంలో ఎరుపు రంగు చీరలో కుందనపు బొమ్మలా కనిపించింది యామీ. అయితే ఇది 33 ఏళ్ల క్రితం తన తల్లి ధరించిన చీర కావడం గమనార్హం. 


ముదురు ఎరుపు రంగు పట్టుచీర, మ్యాచింగ్‌ బ్లౌజ్‌, గోల్డెన్‌ ఎంబ్రాయిడరీ బోర్డర్‌తో కూడిన ఎరుపు రంగు వెయిల్‌ ధరించిన ఈ బాలీవుడ్‌ బ్యూటీ.. చోకర్‌, నెక్‌పీస్‌, చాంద్‌బాలీ ఇయర్‌ రింగ్స్‌, ఆకట్టుకునే నోస్‌ రింగ్‌, పెద్ద మాంగ్‌ టిక్కాతో తన లుక్‌ని పూర్తి చేసింది. ఇక దుస్తులకు తగినట్లుగానే ఎర్రటి లిప్‌స్టిక్‌తో తన అధరాల్ని తీర్చిదిద్దుకున్న ఈ చక్కనమ్మ.. సింపుల్‌ మేకప్‌తో సింప్లీ సూపర్బ్‌గా దర్శనమిచ్చింది. ఇలా యామీ బ్రైడల్‌ లుక్‌ని చూడగానే అందరూ ‘వాట్‌ ఎ బ్యూటీ’ అన్నారంటే అది అతిశయోక్తి కాదు.


ఈ చీర వయసు 32 ఏళ్లు!
మెగా ప్రిన్సెస్‌ నిహారిక కూడా ఇదే చేసింది. డిసెంబర్‌ 9న వెంకట చైతన్యను వివాహమాడిన ఈ చక్కనమ్మ.. పెళ్లి కూతురు ఫంక్షన్‌లో భాగంగా తన తల్లి పద్మజ పెళ్లి నాటి చీరను ధరించి మెరిసిపోయింది. భారీ గోల్డెన్‌ జరీ బోర్డర్‌ ఉన్న రాయల్‌ బ్లూ కలర్‌ పట్టు చీర ధరించిన నిహా.. దానికి మ్యాచింగ్‌గా సింపుల్‌ డిజైన్‌ ఉన్న బ్లూ కలర్‌ బ్లౌజ్‌ను జత చేసింది. ఇక ముత్యాల ఆభరణాలు, వడ్డాణం, మ్యాచింగ్‌ గాజులు, చక్కటి హెయిర్‌స్టైల్‌, హెవీ మేకప్‌తో మెరుపులు మెరిపించిందీ మెగా డాటర్.


ఇలా ట్రెడిషనల్‌గా ముస్తాబైన తన ఫొటోను, అలనాడు ఇదే చీరలో రడీ అయిన తన తల్లి ఫొటోతో కొలేజ్‌ చేసి ఇన్‌స్టాలో పంచుకుంది నిహా. దీనికి ‘32 ఏళ్ల క్రితం మా అమ్మ తన నిశ్చితార్థంలో ధరించిన చీర ఇది..’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. అప్పుడెప్పుడో తమ నిశ్చితార్థంలో తన భార్య కట్టిన చీరలో ఇప్పుడు ఇలా పెళ్లి కూతురిలా ముస్తాబైన కూతురిని చూసిన నటుడు నాగబాబు ‘మా ఆవిడ అందంగా ఉంది.. నా చిట్టితల్లి ఏంజెల్‌లా ఉంది..’ అంటూ మురిసిపోయారు.


అమ్మ లెహెంగా చుట్టేసింది!
తన ఇష్టసఖుడు, వెండితెర భల్లాల దేవుడు రానాను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈవెంట్‌ ప్లానర్‌/మేనేజర్‌ మిహీకా బజాజ్. తన పెళ్లి వేడుకల్లో ట్రెడిషనల్‌గా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోయిన ఈ పుత్తడి బొమ్మ.. తన తల్లి పెళ్లి నాటి లెహెంగానూ తన వివాహ వేడుకల్లో భాగం చేసుకుంది. తన కూతురు తన పెళ్లి నాటి అవుట్‌ఫిట్‌లో ముస్తాబవడం చూసిన మిహీకా తల్లి బంటీ బజాజ్‌ తన ఆనందాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. 
చీరను దుపట్టాగా మార్చేసింది!
2018లో ‘గ్రాండ్‌ వెడ్డింగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా నిలిచింది ఈషా అంబానీ - ఆనంద్‌ పిరమల్‌ వివాహం. ఈ అంబానీ వారి ఆడపడుచు వివాహంలో ప్రతి సందర్భం ప్రత్యేకమే అని చెప్పుకోవాలి. ఇక ఆమె పెళ్లిలో ధరించిన లెహెంగా అప్పట్లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది. అందుకు కారణం తన బ్రైడల్‌ డ్రస్‌లో తన తల్లి పెళ్లి నాటి చీరను జత చేయడమే! అబుజానీ-సందీప్‌ ఖోస్లా డిజైనర్‌ ద్వయం రూపొందించిన గోల్డెన్ లెహెంగా ధరించింది ఈషా. ఇక దీనిపై చేత్తో రూపొందించిన మొఘల్‌ జాలీ వర్క్‌, ఫ్లోరల్‌ ప్యానల్స్‌, జర్దోసీ-నక్షి వర్క్‌.. ఈ అటైర్‌ను భారీగా మార్చేశాయి. ఇక దీనిపై మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ చేసిన ఎరుపు రంగు బాందనీ దుపట్టా తన తల్లి నీతా అంబానీ ఆమె పెళ్లిలో ధరించిన చీర కావడం విశేషం. 35 ఏళ్ల క్రితం నాటి ఈ చీర లెహెంగాకు పూర్తి కాంట్రాస్ట్‌ లుక్‌ని తీసుకొచ్చి ఆమెను మరింత ట్రెడిషనల్‌గా, ఆకర్షణీయంగా మార్చేసిందని చెప్పచ్చు. ఇలా తన తల్లి పెళ్లి చీరలో పుత్తడి బొమ్మలా మెరిసిపోయిందీ అంబానీ వారి ఆడపడుచు.


ఆభరణాల్లోనూ అమ్మ ముద్ర!
అమ్మ పెళ్లి నాటి దుస్తులు ధరించడమే కాదు.. నాడు ఆమె ధరించిన ఆభరణాలను సైతం నేడు తమ పెళ్లిలో భాగం చేసుకున్న ముద్దుగుమ్మలూ లేకపోలేదు. బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌ కూడా అదే కోవలోకొస్తుంది. గోల్డెన్‌ ఎంబ్రాయిడరీతో భారీగా డిజైన్‌ చేసిన ఎరుపు రంగు బ్రైడల్‌ లెహెంగాలో మెరిసిన ఈ సొగసరి.. ఆభరణాల విషయంలో మాత్రం అమ్మనే స్ఫూర్తిగా తీసుకుంది. అలనాడు తన తల్లి సునీతా కపూర్‌ పెళ్లిలో ధరించిన జ్యుయలరీకి ఆధునిక హంగులద్ది తన వివాహంలో భాగం చేసుకుంది సోనమ్. ఈ క్రమంలో స్టోన్స్‌, ముత్యాలతో రూపొందించిన వింటేజ్‌ హెడ్‌ పీస్‌, భారీ నెక్లెస్‌, హారం.. వంటివన్నీ ఆమెను మహారాణిలా కనిపించేలా చేశాయనడం అతిశయోక్తి కాదు.
 


లేస్‌తో వెయిల్‌కు వన్నెలద్దారు!
ప్రియాంక చోప్రా-నిక్‌ జొనాస్‌.. లవ్లీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట అనుక్షణం ప్రేమను పంచుకుంటూ తమ ఫ్యాన్స్‌కు రిలేషన్‌షిప్‌ పాఠాలు నేర్పుతుంటారు. 2018లో వైవాహిక బంధంలోకి అడుగిడిన ఈ క్యూట్‌ కపుల్‌.. హిందూ, క్రిస్టియన్‌ వివాహ సంప్రదాయాల ప్రకారం ఒక్కటయ్యారు. అయితే దేశీ వివాహంలో భాగంగా ఎరుపు రంగు భారీ లెహెంగాలో ముస్తాబైన ఈ దేశీగర్ల్‌.. క్రిస్టియన్‌ వెడ్డింగ్‌కు తెలుపు రంగు బ్రైడల్‌ గౌన్‌ ధరించింది. ఈ గౌన్‌ అప్పట్లో ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపేసిందని చెప్పచ్చు. ఇందుకు దీనికి అనుసంధానించిన 75 అడుగుల పొడవాటి వెయిల్‌ ఒక కారణమైతే.. పీసీ అత్తగారి బ్రైడల్‌ గౌన్‌ లేస్‌ను ఈ గౌన్‌ తయారీలో ఉపయోగించడం మరో కారణం. రాల్ఫ్‌ లారెన్‌ ఫ్యాషన్‌ కంపెనీ రూపొందించిన ఈ అద్భుతమైన గౌన్‌పై కొన్ని ప్రత్యేకమైన పదాలను, వాక్యాలను ఎంబ్రాయిడరీగా రూపొందించడంతో ఇది మరింత హైలైట్‌ అయింది.

చూశారుగా.. ఈ ముద్దుగుమ్మలంతా తమ తల్లులు/అత్తయ్యల అవుట్‌ఫిట్స్‌ని, నగలను తమ బ్రైడల్‌ లుక్‌లో భాగం చేసుకొని ఎలా మెరిసిపోయారో! మరి, వీరిలాగే మీరూ మీ పెళ్లి వేడుకల్లో మీ అమ్మగారి అవుట్‌ఫిట్‌ను భాగం చేసుకున్నారా? అయితే ఆ విశేషాలను, ఫొటోలను మాతో పంచుకోండి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని